icon icon icon
icon icon icon

మతపరమైన రిజర్వేషన్లకే భాజపా వ్యతిరేకం

‘‘కాంగ్రెస్‌, భారాస రెండూ కుటుంబ, అవినీతి పార్టీలు. 2జీ, అగస్టా, కామన్వెల్త్‌ లాంటి కుంభకోణాలతో కాంగ్రెస్‌.. కాళేశ్వరంతోపాటు ప్రతి పథకంలో 30 శాతం కమీషన్‌తో భారాస ప్రజలను దోచుకున్నాయి.

Updated : 07 May 2024 06:56 IST

కాంగ్రెస్‌, భారాస కుటుంబ.. అవినీతి పార్టీలు
ఏబీసీ పార్టీలు తబ్లీగీ జమాత్‌ ఎజెండాను అమలు చేస్తున్నాయి
మోదీ హయాంలోనే అభివృద్ధి
పెద్దపల్లి, చౌటుప్పల్‌, నల్గొండ ‘జన సభ’ల్లో జేపీ నడ్డా

పెద్దపల్లి, నల్గొండ - ఈనాడు: ‘‘కాంగ్రెస్‌, భారాస రెండూ కుటుంబ, అవినీతి పార్టీలు. 2జీ, అగస్టా, కామన్వెల్త్‌ లాంటి కుంభకోణాలతో కాంగ్రెస్‌.. కాళేశ్వరంతోపాటు ప్రతి పథకంలో 30 శాతం కమీషన్‌తో భారాస ప్రజలను దోచుకున్నాయి. సోనియా, రాహుల్‌లు బెయిల్‌పై ఉంటే.. కేసీఆర్‌ కుమార్తె కవిత జైలులో ఉన్నారు. ప్రతిపక్షాల నేతలు బెయిల్‌పై.. లేదంటే జైలులో ఉంటారు’’ అని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. మోదీ హయాంలో అభివృద్ధి మాత్రమే కనిపిస్తోందన్నారు. భాజపా ఉన్నంత వరకు అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను ఎవరూ రద్దుచేయలేరని ఉద్ఘాటించారు. సోమవారం పెద్దపల్లి, భువనగిరి, నల్గొండ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని పెద్దపల్లి, చౌటుప్పల్‌, నల్గొండలలో పార్టీ అభ్యర్థులు గోమాసె శ్రీనివాస్‌, బూర నర్సయ్యగౌడ్‌, శానంపూడి సైదిరెడ్డిలకు మద్దతుగా భాజపా నిర్వహించిన ‘జనసభ’లలో ఆయన ప్రసంగించారు. ‘‘ప్రధాని మోదీ హీరా (హెచ్‌ఐఆర్‌ఏ) పేరిట మౌలిక వసతులను అభివృద్ధి చేశారు. హైవేస్‌(హెచ్‌), ఇంటర్‌నెట్‌(ఐ), రైల్వేస్‌(ఆర్‌), ఎయిర్‌వేస్‌(ఏ) ఆయన పాలనలోనే ప్రగతిని సాధించాయి. కాంగ్రెస్‌ హయాంలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 74 ఉంటే పదేళ్లలో 148కు చేరింది. రాష్ట్రంలోని 2 కోట్ల మందికి రేషన్‌ సరకులు ఇస్తున్నాం. దేశంలో 25 కోట్ల మంది దారిద్య్ర రేఖ కన్నా ఎగువకు చేరుకున్నారు. తెలంగాణకు రైల్వే బడ్జెట్‌ను 20 రెట్లు పెంచాం. హైదరాబాద్‌ - విశాఖపట్నం గ్రీన్‌ కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నాం. రూ.7 వేల కోట్లతో రామగుండంలో ఎరువుల పరిశ్రమను పునరుద్ధరించాం.

అసంపూర్తి నిర్మాణాలు పూర్తిచేస్తాం

రెండు పడక గదుల ఇళ్ల పేరుతో ప్రజలను కేసీఆర్‌ మోసగించారు. ఆ అసంపూర్తి నిర్మాణాలపై రేవంత్‌రెడ్డి సర్కారు కూడా మౌనం పాటిస్తోంది. మీరు ఆశీర్వదించి మాకు ఓటేస్తే అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేస్తాం. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనను అప్పుడు కేసీఆర్‌, ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఇద్దరూ ఉపయోగించుకోవడం లేదు. దేశవ్యాప్తంగా ఈ పథకం కింద పేదలకు 4 కోట్ల ఇళ్లు అందించాం. 

రాముడికి, సనాతన ధర్మానికి కాంగ్రెస్‌ వ్యతిరేకం

ఏ అంటే ఆల్‌ ఇండియా మజ్లిస్‌, బీ అంటే భారాస, సీ అంటే కాంగ్రెస్‌.. ఈ మూడు పార్టీలు తబ్లీగీ జమాత్‌ విధానాలను అనుసరిస్తున్నాయి. రజాకార్ల చర్యలను ఈ మూడు పార్టీలు సమర్థించడం నిజం కాదా?. 17 సెప్టెంబరును తెలంగాణ విమోచన దినోత్సవంగా చేయాల్సి ఉండగా కేసీఆర్‌ తెలంగాణ విలీన దినోత్సవం చేశారు. భాజపా అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. కాంగ్రెస్‌ పార్టీ రాముడికి, సనాతన ధర్మానికి వ్యతిరేకం. రాముడు ఈ ప్రాంతంలో సంచరించారనడానికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని గతంలో సుప్రీంకోర్టుకు సోనియాగాంధీ అఫిడవిట్‌ ఇచ్చారు. పాక్‌పై మోదీ ప్రభుత్వం సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తే.. దానికి కాంగ్రెస్‌ నాయకులు ఆధారాలు కావాలంటారు. కశ్మీర్‌లో ఉగ్రవాదులను మన బలగాలు మట్టుబెడితే వారి కోసం సోనియా, సల్మాన్‌ ఖుర్షీద్‌ బాధపడతారు. వీళ్లంతా దేశద్రోహులతో కలిసి పనిచేస్తారు.

మతపరమైన రిజర్వేషన్లు వద్దన్న అంబేడ్కర్‌

ప్రధాని మోదీ రిజర్వేషన్లు రద్దు చేస్తారని రాహుల్‌గాంధీ ఆరోపిస్తున్నారు. మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే భాజపా వ్యతిరేకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన రిజర్వేషన్లలో కోత విధించి ముస్లింలకు 4 శాతం కేటాయించింది. మతపరమైన రిజర్వేషన్లు అమలు చేయవద్దని అంబేడ్కర్‌ స్పష్టంగా సూచించారు. ఈ విషయం తెలియక రాహుల్‌గాంధీ అనవసర ఆరోపణలు చేస్తున్నారు. రాహుల్‌గాంధీ తుక్‌డే గ్యాంగులకు ఎంపీ టికెట్లు ఇచ్చారు. పాక్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన ఒకరు ప్రస్తుతం కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. వారిని ఇంట్లో కూర్చోబెట్టి.. మోదీని మరోసారి ప్రధాని చేయడానికి భాజపా అభ్యర్థులకు ఓటేయాలి’’ అని నడ్డా కోరారు. ఆయా సభల్లో అభ్యర్థులతోపాటు ఎంపీ వెంకటేశ్‌ నేత, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


రేపు వేములవాడ, వరంగల్‌లలో మోదీ ప్రచారం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రధాని మోదీ మంగళవారం రాష్ట్రానికి రానున్నారు. రాత్రి హైదరాబాద్‌కు చేరుకోనున్న ఆయన.. రాజ్‌భవన్‌లో బస చేస్తారు. బుధవారం కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని వేములవాడతో పాటు వరంగల్‌ నియోజకవర్గ కేంద్రంలో భాజపా అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img