icon icon icon
icon icon icon

ఎంతో సానుకూలం.. అప్రమత్తత అవసరం

లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి ఉన్న ఎంతో సానుకూల వాతావరణం నేపథ్యంలో కీలక సమయంలో అప్రమత్తంగా ఉంటూ ముందుకు సాగాలని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా పార్టీ రాష్ట్ర నేతలకు సూచించారు.

Updated : 07 May 2024 06:24 IST

భాజపా ప్రచారాంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పది సీట్లు ఖాయం.. కృషి చేస్తే మరో మూడు..
ఎన్నికల కార్యాచరణపై ముఖ్యనేతలతో జేపీ నడ్డా

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి ఉన్న ఎంతో సానుకూల వాతావరణం నేపథ్యంలో కీలక సమయంలో అప్రమత్తంగా ఉంటూ ముందుకు సాగాలని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా పార్టీ రాష్ట్ర నేతలకు సూచించారు. భాజపా ప్రచారాంశాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రచారానికి మరో 5 రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో బూత్‌ స్థాయి నుంచి మరోమారు ఓటర్లను చేరుకునే కార్యాచరణ అమలు చేయాలన్నారు. సభలు, సమావేశాలను కొనసాగిస్తూనే ప్రజలనే నేరుగా కలిసే కార్యక్రమాన్ని బూత్‌ కమిటీలు సమర్థంగా అమలు చేయాలని సూచించారు. లోక్‌సభ స్థానాల వారీగా పరిస్థితులను సమీక్షించుకుని నేతలను సమన్వయం చేసుకుని గెలుపు లక్ష్యం చేరాలన్నారు. లోక్‌సభ ఎన్నికల ఘట్టం తుదిదశకు చేరుకుంటున్న నేపథ్యంలో సోమవారం నడ్డా హైదరాబాద్‌లో భాజపా రాష్ట్ర ముఖ్యనేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఇతర నేతలతో ప్రచారం, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా తాజా పరిస్థితులను సమీక్షించారు. రాష్ట్రంలో ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. అగ్రనేతల ప్రచార సభల ద్వారా బలమైన సందేశం ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. కాంగ్రెస్‌, భారాస ఆరోపణలు, విమర్శలను బలంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల రద్దు అంశంపై నేతలు దీటుగా స్పందించాలన్నారు. కనీసం పది స్థానాలు గెలవడం ఖాయమని మరో రెండు మూడు స్థానాల్లో గట్టిగా ప్రయత్నం చేయాలన్నారు. ఓటింగ్‌ శాతం పెంచేందుకు పోలింగ్‌ బూత్‌ల వారీగా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. ఎండలు, సెలవులు వంటి అంశాల ప్రభావం ఓటింగ్‌పై పడే అవకాశం ఉందని సాధ్యమైనంత వరకు, ఉదయమే పోలింగ్‌ ఎక్కువ జరిగేలా చూసుకోవాలని తెలిపారు. ఈనెల 8, 10వ తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో పాల్గొనే సభల ఏర్పాట్లపై ఈ సందర్భంగా ప్రత్యేకంగా చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img