icon icon icon
icon icon icon

మోదీ గ్యారంటీకి కాలం చెల్లింది

‘‘యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు... రైతులకు కనీస మద్దతు ధర అంటూ భాజపా ఊదరగొట్టేది. వాటికి మోదీ గ్యారంటీ అనేది.

Updated : 07 May 2024 06:55 IST

అభివృద్ధికి నిధులివ్వని భాజపాకు కర్రు కాల్చి వాత పెడదాం
కేసీఆర్‌.. కేటీఆర్‌లు చెల్లని రూపాయలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌; నల్లకుంట, ఉప్పల్‌, న్యూస్‌టుడే: ‘‘యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు... రైతులకు కనీస మద్దతు ధర అంటూ భాజపా ఊదరగొట్టేది. వాటికి మోదీ గ్యారంటీ అనేది. ఆ గ్యారంటీకి కాలం చెల్లింది.. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్నా.. కిషన్‌రెడ్డి అంబర్‌పేట ఫ్లైవోవర్‌ను పూర్తి చేయించలేకపోయారు.. హైదరాబాద్‌ అభివృద్ధికి నిధులివ్వని భాజపాకు కర్రు కాల్చి వాత పెడదామని’’ సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న దానం నాగేందర్‌కు మద్దతుగా... నల్లకుంట కోరంటి ఆసుపత్రి వద్ద, మల్కాజిగిరి అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌రెడ్డికి మద్దతుగా ఆ స్థానం పరిధిలోని ఉప్పల్‌ కూడలిలో, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ సెగ్మెంట్‌లోని పికెట్‌ చౌరస్తాలో సోమవారం నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లలో ఆయన మాట్లాడారు. రోడ్‌షోలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మాట్లాడుతూ రెండు సార్లు ప్రధానమంత్రిగా వ్యవహరించిన మోదీ రాష్ట్రానికి నిధులివ్వలేదని విమర్శించారు. విభజన హామీలను ప్రస్తావిస్తే.. అదిచ్చాం, ఇదిచ్చాం అంటూ మాయమాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అధికారం కోల్పోయిన ఆరు నెలలలోపే భారాస చచ్చిన పాముగా తయారైందని, తండ్రీకొడుకులు కేసీఆర్‌, కేటీఆర్‌లు చెల్లని రూపాయలుగా మారిపోయారని విమర్శించారు.

బస్తీలను వరద నీరు ముంచేస్తే అణాపైసా ఇవ్వని కేంద్రం

‘‘కిషన్‌రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. మూడేళ్ల క్రితం పేదల బస్తీలను వరదలు ముంచెత్తితే కేంద్రం అణాపైసా ఇవ్వలేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని బస్తీల్లో వరద, మురుగునీరు ఇళ్లలోకి వచ్చాయి. బైకులు, ఆటోలు నీళ్లలో మునిగితే చూసేందుకు వచ్చిన బండి సంజయ్‌ అది చేస్తాం.. ఇది చేస్తాం అన్నారు తప్ప ఏమీ చేయలేదు. బల్దియా ఎన్నికలయ్యాక తిరిగి చూడలేదు. కిషన్‌రెడ్డిని గెలిపిస్తే..  సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదు. అందుకే కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు కోరంటి కూడలిలో పెద్ద గాడిద గుడ్డును వేలాడదీశారు. ఇక 2004-2014 వరకు అంజన్‌కుమార్‌ యాదవ్‌ ఎంపీగా, దానం నాగేందర్‌ మంత్రిగా, వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్‌ విశ్వనగరంగా మారేందుకు అడుగులు పడ్డాయి. తాగునీటి కొరత రాకుండా గోదావరి, కృష్ణాజలాలు తరలివచ్చాయి. మెట్రో కూత పెట్టిందంటే అది వారి హయాంలోనే. మాజీ ఎంపీ వి. హనుమంతరావు కోరిక మేరకు బతుకమ్మ కుంటలోనే ఈ ఏడాది బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నాం. మరిన్ని అభివృద్ధి పనులు చేయాలంటే దానం నాగేందర్‌ను లక్ష మెజారిటీతో గెలిపించండి.. కేంద్రమంత్రిగా చేసే బాధ్యత నాది.

కేసీఆర్‌, ఈటల వేర్వేరు కాదు

మల్కాజిగిరి భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ తాను ఎంతో నిజాయతీపరుణ్ని అని చెప్పుకొంటున్నారు. మరి 2001 నుంచి 2021వరకూ కేసీఆర్‌, ఈటల వేర్వేరు కాదు ఒక్కరే అన్నట్లు వ్యవహరించలేదా? కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో రూ.వేల కోట్లు కేసీఆర్‌ దోచుకుంటే ఆ బిల్లులపై ఆర్థిక మంత్రిగా సంతకాలు పెట్టింది మీరు కాదా? ధరణి ముసుగులో అవుటర్‌ చుట్టూ దొరలు భూములు అక్రమించుకుంటుంటే  కాపలా కాసింది మీరు కాదా? గద్దర్‌ కేసీఆర్‌ను కలిసేందుకు వస్తే మండుటెండలో నిలబెట్టి పంపించారు. ఎందుకలా చేశారని కేసీఆర్‌ను ప్రశ్నించారా? ఇక భాజపాలో చేరాక ఉప్పల్‌ ఫ్లైవోవర్‌ పనులు పూర్తి కాలేదెందుకని నితిన్‌ గడ్కరీని అడిగారా? రూ.వేల కోట్లు కేటీఆర్‌ దోచుకున్నారని ఎప్పుడైనా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫిర్యాదు చేశారా? జన్వాడలో ఫామ్‌హౌస్‌, గజ్వేల్‌లో వెయ్యిఎకరాల గురించి మోదీకి ఎందుకు వివరించలేదు? కేంద్ర ప్రభుత్వంలో మీ పార్టీ అధికారంలో ఉంది కదా.. ముదిరాజ్‌ కులం బీసీ ‘డి’లో ఉంటే ఎందుకు మార్పించలేదు? మీకు కావాల్సిందిల్లా మీ పరపతి, పైసలు మాత్రమే. మీరు అంగీ మార్చినా.. వేషం మార్చినా ప్రజలు గుర్తు పడతారు.. ఇప్పటికైనా మీ విధానాలు మార్చుకోండి. ఎందుకంటే ప్రజలు  మోదీ.. బై, బై అంటున్నారు. మీ పార్టీ బడుగు బలహీనవర్గాల రిజిర్వేషన్లు తీసేస్తుంటే మీరు నరేంద్రమోదీ వైపు ఉంటారో.. ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాల వైపు ఉంటారో తేల్చుకోండి.

అబద్ధాలు చెబుతున్న భారాస నాయకులు

కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిన ఆరింటిలో ఐదు గ్యారంటీలు అమలవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. ఎవరికీ ఇవ్వడం లేదంటూ కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులతో పాటు భారాస నాయకులంతా అబద్ధాలు చెబుతున్నారు. సంక్షేమ పథకాలు అమలవుతున్నాయో.. లేదో చర్చిద్దాం రమ్మంటే రావడానికి భయపడుతున్నారు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయా కార్యక్రమాల్లో సికింద్రాబాద్‌ అభ్యర్థి దానం నాగేందర్‌, మల్కాజిగిరి అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌రెడ్డి, కంటోన్మెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శ్రీగణేష్‌, రాజ్యసభ సభ్యుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img