icon icon icon
icon icon icon

హామీలు అమలు చేయని భాజపాను ఓడించాలి

రైతులకు ఇచ్చిన రాతపూర్వక హామీలను అమలు చేయని భాజపాను ఎన్నికల్లో ఓడించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) నాయకులు పిలుపునిచ్చారు.

Published : 07 May 2024 05:15 IST

సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: రైతులకు ఇచ్చిన రాతపూర్వక హామీలను అమలు చేయని భాజపాను ఎన్నికల్లో ఓడించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) నాయకులు పిలుపునిచ్చారు. తెలంగాణలో ఈనెల 13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాని ఓడించేందుకు రైతులు సిద్ధం కావాలన్నారు. సోమవారం హైదరాబాద్‌ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఎస్‌కేఎం అఖిల భారత నాయకులు డా.విజ్జూ కృష్ణన్‌(కేరళ) డా.సునీలం (మధ్యప్రదేశ్‌), సురేశ్‌రౌత్‌ (హరియాణా), అవతార్‌ సింగ్‌ మెహ్మ (పంజాబ్‌), కె.బాలకృష్ణన్‌ (తమిళనాడు), బడగాల నాగేంద్ర, రవి కిరణ్‌ పుంచ, అరుణ్‌ కుమార్‌ (కర్ణాటక), రాయల చంద్రశేఖర్‌ (తెలంగాణ) తదితరులు మాట్లాడారు. పదేళ్లలో దేశంలో రైతులు; వ్యవసాయ, దినసరి కూలీలు 4.26 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారన్నారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలలపాటు సాగిన పోరాటంలో 750 మంది రైతులు బలిదానాలు చేస్తే.. ఆయా చట్టాలను కేంద్రం ఉపసంహరించుకుందని చెప్పారు. అదే సమయంలో కనీస మద్దతు ధరలు, విద్యుత్తు సవరణ బిల్లులను రైతులతో మాట్లాడకుండా పార్లమెంటులో పెట్టబోమని, రైతులపై అక్రమ కేసులను ఎత్తేస్తామని, ఫసల్‌ బీమా యోజన రైతులకు ఉపయోగపడే విధంగా మారుస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ హామీలను అమలు చేయకపోగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. ఎస్‌కేఎం రాష్ట్ర నాయకులు అన్వేష్‌రెడ్డి, టి.సాగర్‌, విస్సా కిరణ్‌ తదితరులు మాట్లాడుతూ.. ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు ఎస్‌కేఎం, రైతు సంఘాల నాయకులు వివిధ జిల్లాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారని ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img