icon icon icon
icon icon icon

మోదీ అడుగుజాడల్లో రేవంత్‌

ఆరెస్సెస్‌ మనిషి రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని.. ఆయన రాహుల్‌ గాంధీ మార్గంలో కాక.. మోదీ అడుగుజాడల్లో నడుస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు.

Published : 07 May 2024 05:26 IST

ప్రాంతీయ పార్టీల నేతలకే ప్రధానిని ఎదుర్కొనే సత్తా
కాంగ్రెస్‌ చెప్పేవన్నీ అబద్ధాలే
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శ

ఈనాడు డిజిటల్‌- సిరిసిల్ల, రాయదుర్గం- న్యూస్‌టుడే: ఆరెస్సెస్‌ మనిషి రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని.. ఆయన రాహుల్‌ గాంధీ మార్గంలో కాక.. మోదీ అడుగుజాడల్లో నడుస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. మోదీని ఎదుర్కొనే దమ్ము రాహుల్‌గాంధీకి లేదని, అందుకే అమేఠీ నుంచి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌, కేజ్రీవాల్‌, మమతాబెనర్జీ, స్టాలిన్‌, హేమంత్‌సోరెన్‌ వంటి ప్రాంతీయ పార్టీల నేతలకే ఆ సత్తా ఉందన్నారు. హైదరాబాద్‌ ప్రజలు కేసీఆర్‌పై నమ్మకంతో అత్యధిక స్థానాలు భారాసకిచ్చి ఆశీర్వదించారని చెప్పారు. జిల్లాల్లో కాంగ్రెస్‌ అరచేతిలో వైకుంఠం చూపించి హామీలివ్వడంతో ప్రజలు మోసపోయారన్నారు. భారాసకు 10-12 సీట్లిస్తే కేసీఆర్‌ రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుందన్నారు. సోమవారం ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌ తరఫున సిరిసిల్ల, తంగళ్లపల్లి, ముస్తాబాద్‌ మండలాల్లో బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశాలు.. సాయంత్రం చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ తరఫున హైదరాబాద్‌లోని కొండాపూర్‌, శంషాబాద్‌, బడంగ్‌పేటలలో నిర్వహించిన రోడ్‌ షోలలో కేటీఆర్‌ ప్రసంగించారు.

నమో అంటే నమ్మించి మోసం చేయడం

‘‘బడే భాయ్‌ మోదీ పదేళ్ల నుంచి కథలు చెబుతున్నారు. ఆయన చేసిన వాగ్దానాలు నెరవేరలేదు. మాట్లాడితే నమో అంటారు. నమో అంటే నమ్మించి మోసం చేయడం..  హైదరాబాద్‌కు రూపాయి సాయం చేయలేదు. రహదారులు, ఉన్నత విద్యాసంస్థలు, మరమగ్గాల అభివృద్ధికి సాయం అందించాలని మొరపెట్టుకున్నా ప్రయోజనం శూన్యం. ఆయన ముస్లింలను నోటికొచ్చినట్లు దూషిస్తున్నారు. సెస్‌ రూపంలో రాష్ట్రాలకు కొత్త పన్నులు వేశారు. ఎందుకంటే.. జాతీయ రహదారులను నిర్మిస్తున్నామన్నారు. మరి టోల్‌ ట్యాక్స్‌ ఎందుకు వసూలు చేస్తున్నారంటే దానికి జవాబివ్వరు. ఇప్పటివరకు రూ.30 లక్షల కోట్ల పన్నులు వసూలు చేశారు. అలాగే అదానీ, అంబానీలకు రూ.14.50 లక్షల కోట్ల రుణమాఫీ చేశారు. నేను చెప్పింది అబద్ధమని భాజపా నాయకులు నిరూపిస్తే తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నా రాజీనామా పత్రం ఉంచుతా. పార్లమెంటు ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని, దేశంలో రిజర్వేషన్లు తీసేస్తామని భాజపా చెబుతోంది. గోదావరి నీటిని కర్ణాటక, చెన్నైలకు తరలిస్తామంటోంది. జూన్‌ 2 తర్వాత హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని చూస్తోంది.

కాంగ్రెస్‌ సినిమా చూపించి అధికారంలోకి వచ్చింది

రంగుల కలలాంటి సినిమా ప్రజలకు చూపించి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. సీఎం రేవంత్‌ కొన్ని జిల్లాలను రద్దు చేయాలని ఆలోచిస్తున్నారు. ఇటీవల సిరిసిల్లకు వచ్చినపుడు 6 గ్యారంటీల్లో 5 అమలు చేశామని చెప్పారు. నిర్మల్‌కు వచ్చిన రాహుల్‌గాంధీ రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.2,500 జమ చేస్తున్నామన్నారు. తెలంగాణలో లక్షన్నర పెళ్లిళ్లు జరిగాయి. ఒక్కరికీ తులం బంగారం ఇచ్చేందుకు సీఎంకు దుకాణంలో బంగారం ఉద్దెరకు దొరకడం లేదా? కాంగ్రెస్‌వన్నీ అబద్ధపు ప్రచారాలే. మేం భాజపాతో కలిసున్నామని రాహుల్‌ అంటున్నారు.. అలా అయితే నా చెల్లి కవిత 50 రోజులుగా జైలులో ఉండేదా?’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img