icon icon icon
icon icon icon

మోదీ రాజ్యంలో అత్యాచారాలు పెరిగాయి

మోదీ రాజ్యంలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోపించారు. పదేళ్లలో మోదీ చెప్పిన 150 నినాదాల్లో ఒక్కటి కూడా నిజం కాలేదన్నారు.

Published : 07 May 2024 05:29 IST

ఆయనను వ్యతిరేకించినందుకే కవితను జైల్లో పెట్టారు..
నేను పిడికిలి బిగిస్తేనే ఆగిన రైతుబంధు మళ్లీ మొదలైంది
నిజామాబాద్‌ రోడ్‌షోలో భారాస అధినేత కేసీఆర్‌

ఈనాడు, నిజామాబాద్‌: మోదీ రాజ్యంలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోపించారు. పదేళ్లలో మోదీ చెప్పిన 150 నినాదాల్లో ఒక్కటి కూడా నిజం కాలేదన్నారు. సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌ అని ఆయన అన్నారని, కానీ.. దేశం సర్వనాశనమైందని విమర్శించారు. బేటీ బచావో.. బేటీ పఢావో.., మేకిన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియాలు ఆచరణలో కనిపించటం లేదన్నారు. వికసిత్‌ భారత్‌ ఉట్టిమాటగా మిగిలిందన్నారు. జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తానన్న మోదీ మోసం చేశారని పేర్కొన్నారు. గోదావరి నీళ్లను మోదీ తమిళనాడుకు తరలిస్తానంటున్నా.. భాజపా, కాంగ్రెస్‌ నేతలు నోరు మెదపడం లేదని విమర్శించారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. ‘‘మోదీని అన్ని అంశాల్లోనూ వ్యతిరేకించినందుకే నా కుమార్తె కవితను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అయినా వెనకాడేది లేదు. ఆరు నూరైనా పోరాడతా. మోదీకి 400 ఎంపీ సీట్లు రావడం ఉట్టిదే. 210 వస్తే ఎక్కువంటున్నారు. భారాసకు 12-14 సీట్లు వస్తే కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలకమవుతాయి.

నేను గర్జించగానే వణుకు పుట్టింది..

కేసీఆర్‌ బస్సు ఎక్కి పిడికిలి బిగించి గర్జించగానే ముఖ్యమంత్రి వణికిపోయారు. ఆగిన రైతుబంధు మళ్లీ మొదలైంది. ఖాతాల్లో డబ్బు వేస్తున్నారు. పోరాడకపోతే ఏదీ జరగదు. తెలంగాణకు శక్తి, బలం, గళం, దళం భారాసయే. కాలు విరిగినా.. కుంటుకుంటూ వచ్చి పోరాడుతున్నా. ఐదెకరాలకు పైగా ఉంటే రైతుబంధు ఇవ్వరట. వారేం పాపం చేశారు? నా ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాను. మా హయాంలో అన్ని వర్గాలను ఆదుకున్నాం. బీడీ కార్మికులకు, టేకేదారులకు పింఛన్‌ ఇచ్చాం.

రుణమాఫీ ఏమైంది?

అరచేతిలో వైకుంఠం చూపించి.. ఆరు గ్యారంటీలిస్తామంటూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. అవి అమలు కావటం లేదు. తులం బంగారం తుస్సుమంది. వడ్లకు రూ.500 బోనస్‌ బోగస్‌ అయింది. మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వటం లేదు. విద్యుత్‌ కోతలు మొదలయ్యాయి. భగీరథ నీళ్లు రావటం లేదు. ఐదు నెలలుగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వటం లేదు. కేసీఆర్‌ కిట్లు, సీఎంఆర్‌ఎఫ్‌ సహాయం ఆపేశారు. చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వక.. ఆత్మహత్య చేసుకొనే పరిస్థితి వచ్చింది. పరిశ్రమలు తరలిపోతున్నాయి. దీనికి ప్రభుత్వ అసమర్థత కారణం కాదా? వెనకటికి ఎవరో చెప్పారట.. రేపు మా ఇంట్లో లడ్డూ భోజనం ఉంటుందని. ఎప్పుడు వెళ్లినా ‘రేపు’ అని రాసి ఉంటుంది. రేవంత్‌రెడ్డి మాటలు కూడా అలాగే ఉన్నాయి. డిసెంబరు 9న రుణమాఫీ చేస్తామని రేవంత్‌ అన్నారు. ఏమైంది?

హిందువును.. అందరి ఆత్మబంధువును..

కాంగ్రెస్‌ తియ్యని మాటలు చెప్పడం తప్ప మైనార్టీలకు చేసిందేమీ లేదు. మోదీ బడే భాయ్‌ అని, తాను ఛోటే భాయ్‌నని రేవంత్‌రెడ్డి అంటున్నారు. గుజరాత్‌ మోడల్‌ తెస్తానంటున్నారు. గోధ్రా మోడల్‌ తెస్తారా? అక్కడ మోదీ చేసిన అభివృద్ధి ఏమీ లేదు. నేను హిందువునే. యావత్‌ రాష్ట్రం నా ఆత్మబంధువు. ఏ ఒక్క వర్గానికో కాదు.. రాష్ట్రంలో అందరికీ మంచి జరగాలి. హిందువులు, ముస్లింలు కలిసిమెలిసి బతకాలి. అందులోనే గొప్పదనం ఉంటుంది. విద్వేషాలు రెచ్చగొడితే వచ్చేదేమీ ఉండదు’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేశ్‌రెడ్డి, భారాస జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి, గణేశ్‌ గుప్తా, వీజీ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img