icon icon icon
icon icon icon

భారాస చిరునామా గల్లంతే

ఈ లోక్‌సభ ఎన్నికలతో రాష్ట్రంలో భారాస చిరునామా గల్లంతవుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

Published : 07 May 2024 05:30 IST

కోడ్‌ ముగియగానే ఇందిరమ్మ ఇళ్లు
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

బోనకల్లు, న్యూస్‌టుడే: ఈ లోక్‌సభ ఎన్నికలతో రాష్ట్రంలో భారాస చిరునామా గల్లంతవుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం ఖమ్మం జిల్లా బోనకల్లులో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో భారాసకు ఒక్క సీటూ రాదని, కానీ ఇక్కడ గెలిచిన అభ్యర్థి కేంద్ర మంత్రి అవుతారని కేసీఆర్‌ చెబుతున్నారని, ఎలా అవుతారని ప్రశ్నించారు. ఆ పార్టీ అబద్ధాల పునాదులపై పుట్టిందని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు మినహా మూడో పార్టీకి స్థానం లేదన్నారు. ‘‘రఘురాంరెడ్డికి కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎంతోపాటు తెలుగు తమ్ముళ్లు సైతం మద్దతు ఇస్తున్నారు. భారాసకు పదేళ్లు రాష్ట్రాన్ని అప్పగిస్తే ధనిక రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారు. పదేళ్లలో ఏనాడూ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం ఇవ్వలేదు. రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులకు గాను ఇప్పటికే 65 లక్షల మంది ఖాతాల్లో రైతుబంధు నగదును వారి ఖాతాల్లో జమ చేశాం. అధికారం చేపట్టిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, రూ.500కే గ్యాస్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకాలు అమలు చేశాం. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం. ఎన్నికల కోడ్‌ ముగియగానే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఆ ఇళ్లకు భూమి పూజలు చేస్తారు. జిల్లాలో భూముల్ని సస్యశ్యామలం చేసేందుకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.1,400 కోట్లతో రాజీవ్‌ సాగర్‌, ఇందిరా సాగర్‌ ఎత్తిపోతల పథకాలు చేపడితే భారాస ప్రభుత్వం రీడిజైన్‌ పేరుతో రూ.25వేల కోట్లకు అంచనాలు పెంచింది. ఇప్పటి వరకు రూ.8వేల కోట్లు ఖర్చుచేసి ఒక్క చుక్క కూడా నీరు అందివ్వలేదు’’ అని భట్టి విమర్శించారు.

రాముడి పేరుతో మోదీ రాజకీయాలు: పొంగులేటి

అయోధ్య రాముడి పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. భాజపా మరోసారి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, రిజర్వేషన్లు తొలగిస్తుందని అన్నారు. ‘‘దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండి భాజపాను ఓడించాలి. ధనిక రాష్ట్రాన్ని రూ.7లక్షల కోట్ల అప్పులపాల్జేసి రూ.1.50లక్షల కోట్లు కేసీఆర్‌ దోచుకున్నారు. గత ఏడాది సాగర్‌ నుంచి పంటలకు నీళ్లివ్వలేని ఆయన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. సాగర్‌ నీరు ఆంధ్రాకు పంపిన ఘనుడు’’ అని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img