icon icon icon
icon icon icon

దక్షిణభారతాన్ని ప్రత్యేక దేశంగా విభజించాలని కాంగ్రెస్‌ చూస్తోంది

దేశాన్ని అఖండ భారతావనిగా ఉంచాలని ప్రధాని మోదీ చూస్తోంటే.. పాకిస్థానీయుల తరహాలో కాంగ్రెస్‌ ఆలోచిస్తోందని, దక్షిణ భారతాన్ని ప్రత్యేక దేశంగా విభజించేందుకు కుట్రలు పన్నుతోందని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి ఆరోపించారు.

Updated : 07 May 2024 05:33 IST

ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి ఆరోపణ

ఈనాడు-వరంగల్‌, నర్సంపేట, రాంనగర్‌, ముషీరాబాద్‌, న్యూస్‌టుడే: దేశాన్ని అఖండ భారతావనిగా ఉంచాలని ప్రధాని మోదీ చూస్తోంటే.. పాకిస్థానీయుల తరహాలో కాంగ్రెస్‌ ఆలోచిస్తోందని, దక్షిణ భారతాన్ని ప్రత్యేక దేశంగా విభజించేందుకు కుట్రలు పన్నుతోందని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి ఆరోపించారు. సోమవారం మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నర్సంపేటలో భాజపా అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్‌కు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో, సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డికి మద్దతుగా హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యువ సమ్మేళనం’లో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ పాలనలో దేశంలో లెక్కలేనన్ని కుంభకోణాలు జరిగాయి. భారాస కూడా కుంభకోణాల పార్టీ. కేసీఆర్‌ కుమార్తె దిల్లీ మద్యం కుంభకోణంలో జైల్లో ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక భారాస నేతల కుంభకోణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్న కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కారు(భారాస) షెడ్డుకు వెళ్లింది. ‘ఆరు గ్యారంటీ’ల పేరుతో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేసింది’’ అని ధామి విమర్శించారు. యువ సమ్మేళనంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశం కోసం మోదీకి ఓటేస్తున్నామనే విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక దేశమంతా యూసీసీ అమలు చేస్తామన్నారు. రిజర్వేషన్లు రద్దవుతాయని పదే పదే చెబుతూ దళితులు, గిరిజనుల మనోభావాలను దెబ్బతీస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఎన్నికల సంఘం, పోలీసులు సుమోటోగా తీసుకోవాలని, ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సీతారాంనాయక్‌ డిమాండ్‌ చేశారు. యువ సమ్మేళనంలో ఉత్తరాఖండ్‌ మంత్రి వినయ్‌కుమార్‌, భాజపా హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు గౌతంరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img