icon icon icon
icon icon icon

రిజర్వేషన్ల ఎత్తివేతకు భాజపా యత్నం.. సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్‌.వీరయ్య

‘‘భాజపా రిజర్వేషన్లు ఎత్తివేయాలని, మళ్లీ మనుస్మృతిని తేవాలని ప్రయత్నిస్తోంది.  ఆ పార్టీ నేతలు మతాన్ని రాజకీయ అవసరాలకు వాడుతున్నారు.

Published : 07 May 2024 05:37 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ‘‘భాజపా రిజర్వేషన్లు ఎత్తివేయాలని, మళ్లీ మనుస్మృతిని తేవాలని ప్రయత్నిస్తోంది.  ఆ పార్టీ నేతలు మతాన్ని రాజకీయ అవసరాలకు వాడుతున్నారు. నిరంకుశ పోకడలకు పోతున్నారు’’ అని సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్‌.వీరయ్య ఆరోపించారు. ఇదంతా అడ్డుకోవడానికే ‘ఇండియా’ కూటమి ఏర్పడిందన్నారు. టీయూడబ్ల్యూజే సోమవారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆయనతో ‘మీట్‌ ది ప్రెస్‌’ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘అన్ని రంగాల్లో మోదీ ప్రభుత్వం విఫలమైంది. మహిళలపై లైంగిక వేధింపులు, నిత్యావసరాల ధరలు పెరిగాయి. ఎన్నడూలేనంతగా నిరుద్యోగ సమస్య పెరిగింది. కార్మికులకు దినసరి వేతనం రూ.170 సరిపోతుందా? పేదలు ప్రయాణించే ప్యాసింజర్‌ రైళ్లను వందల సంఖ్యలో రద్దుచేశారు. ఇతర పార్టీల నేతలను భాజపాలో చేరాలని బెదిరిస్తున్నారు. దేవుడు, దేవాలయం అంటూ ఓట్లడుగుతున్నారు. తెలంగాణను పదేళ్లు పాలించిన కేసీఆర్‌కు ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చునే ఓపిక లేకపోతే ఎలా? తెలంగాణలో భారాస ఒక్క ఎంపీ సీటు కూడా గెలవడం కష్టమే. భాజపాకు 2 లేదా 3 సీట్లు వచ్చే అవకాశం ఉంది. భువనగిరిలో పోటీనుంచి తప్పుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క కోరారు. కానీ రాజకీయపార్టీగా ప్రజల్లోకి వెళ్లకుండా ఉండలేం. అందుకే పోటీ చేస్తున్నాం. మిగతాచోట్ల కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని ప్రజలను కోరుతున్నాం. కేరళ ప్రచారంలో రేవంత్‌రెడ్డి అక్కడి సీఎం పినరయి విజయన్‌ మీద విమర్శలు చేయడం సరికాదు. సీపీఐ, సీపీఎం కలిసి పనిచేయాలని అందరూ కోరుకుంటున్నారు. త్వరలో జరిగే పార్టీ సమావేశాల్లో దీనిపై చర్చిస్తాం’’ అని వీరయ్య పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img