icon icon icon
icon icon icon

గ్యారంటీల అమలులో కాంగ్రెస్‌ విఫలం

గ్యారంటీల పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటి అమలులో విఫలమైందని భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై విమర్శించారు.

Published : 07 May 2024 05:40 IST

దక్షిణభారతంలో బలంగా మోదీ హవా
భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై

జమ్మికుంట, న్యూస్‌టుడే: గ్యారంటీల పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటి అమలులో విఫలమైందని భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై విమర్శించారు. సోమవారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో భాజపా అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా నిర్వహించిన యువ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దక్షిణ భారతదేశంలో మోదీ హవా బలంగా ఉందని.. ఇక్కడ ఎక్కువ స్థానాలు వస్తాయని అన్నారు. తెలంగాణలోనూ కాషాయ పార్టీ బలం బలగం బాగుందని మెజారిటీ స్థానాల్ని తమ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్‌తో తెలంగాణ పోటీ పడుతోంది అని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి అక్కడి సబర్మతి నదిని ఏవిధంగా ప్రక్షాళన చేశారో.. అదే విధంగా ఇక్కడి మూసీ నదిని ఎందుకు బాగు చేయించడం లేదని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకుడు బండి సంజయ్‌ అని.. మోదీ మెచ్చే నేతల్లో ఆయన ఒకరని కొనియాడారు. సంజయ్‌ పాదయాత్ర స్ఫూర్తితోనే తాను కూడా తమిళనాడులో యాత్రను చేపట్టి ప్రజలకు చేరువయ్యానని చెప్పారు. బండి సంజయ్‌ మాట్లాడుతూ.. అన్నామలై భారతదేశ సింగమలై అని యువతకు ఆయన ఆదర్శమన్నారు. ఐపీఎస్‌ ఉద్యోగాన్ని వదిలి వచ్చిన ఆయన నిత్యం ప్రజల కష్టాలను తెలుసుకుని వారి పక్షాన పోరాటాన్ని చేస్తున్నారని చెప్పారు. భాజపా నాయకులు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


రిజర్వేషన్‌ విధానం రద్దు చేయబోం

భీమదేవరపల్లి, న్యూస్‌టుడే: ‘దేశంలో భాజపా ప్రభుత్వం ఏర్పడాలని, మోదీని మూడోసారి ప్రధానిని చేయాలని కంకణం కట్టుకున్న కార్యకర్తలం. ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తాం తప్ప.. కాంగ్రెస్‌ పార్టీ లెక్క నాశనం చేసే ఆలోచన మాకు లేదు. ఈ దేశంలో రిజర్వేషన్‌ విధానాన్ని ఇంకా శక్తిమంతంగా తయారు చేస్తాం. అదే మా లక్ష్యం. ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్‌ విధానాన్ని రద్దు చేయబోమని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం’ అంటూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూర్‌లో నిర్వహించిన హుస్నాబాద్‌ నియోజకవర్గ పోలింగ్‌ కేంద్రాల కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్‌ మాట్లాడారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని భాజపా చెప్పలేదన్నారు.  మేము ప్రమాణం చేశాం.. కాంగ్రెస్‌ నాయకులు రాజ్యాంగానికి విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లు తీసుకురాబోమని ప్రమాణం చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img