icon icon icon
icon icon icon

ప్రచారానికి వానదెబ్బ

రాష్ట్రంలో మంగళవారం కురిసిన అకాల వర్షం, తీవ్రమైన గాలుల ప్రభావం లోక్‌సభ ఎన్నికల ప్రచారంపై పడింది. మంగళవారం సాయంత్రం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది.

Updated : 08 May 2024 04:07 IST

కరీంనగర్‌లో సీఎం సభ రద్దు
ప్రధాని మోదీ సభా వేదికపైనా ప్రభావం
మంథనిలో ఫ్లెక్సీ కూలి మహిళకు స్వల్ప గాయాలు

ఈనాడు- హైదరాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, న్యూస్‌టుడే- మంథని: రాష్ట్రంలో మంగళవారం కురిసిన అకాల వర్షం, తీవ్రమైన గాలుల ప్రభావం లోక్‌సభ ఎన్నికల ప్రచారంపై పడింది. మంగళవారం సాయంత్రం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల సభలు, రోడ్‌షోలు, ర్యాలీలు రద్దయ్యాయి. కరీంనగర్‌ ఎస్‌.ఆర్‌.ఆర్‌ కళాశాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పాల్గొనాల్సిన బహిరంగ సభ రద్దయింది. భారీ వర్షం కారణంగా సభా ప్రాంగణం బురదమయంగా మారింది. ఈదురుగాలులకు టెంట్లు కూలాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో హెలికాప్టర్‌లో సీఎం వచ్చే పరిస్థితి లేకపోవడంతో బహిరంగసభ రద్దు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు. సీఎం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో వరంగల్‌ వెళ్లారు. అక్కడ వరంగల్‌ ఈస్ట్‌, వెస్ట్‌ నియోజకవర్గాల పరిధిలో రోడ్‌షోలకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోనూ పలుచోట్ల నేతల ప్రచారంపై వర్షం ప్రభావం పడింది. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి ఎంపీ కిషన్‌రెడ్డి భాజపా రోడ్‌షో వాయిదా పడింది. అప్పటికే అక్కడికి చేరుకున్న ఆయన పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధి.. ఖైరతాబాద్‌లో  భారాస కార్యానిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పాల్గొనాల్సిన రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌ వాన కారణంగా రద్దయింది. రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌ శర్మ మంథని పర్యటనపై వర్షం ప్రభావం పడింది. ఆయన రాక ముందు.. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈదురుగాలులు వీయడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై వేదిక పైనుంచి నాయకులందరినీ దింపేశారు. ప్రాంగణంలోని టెంట్లు కూలగా.. కుర్చీలు చెల్లాచెదురయ్యాయి. భారీ ఫ్లెక్సీ ఎగిరి మంథని మండలం లక్ష్మీపూర్‌కు చెందిన శంకరమ్మ అనే మహిళ కాలిపై పడటంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. గాలులు తగ్గాక విచ్చేసిన భజన్‌లాల్‌ శర్మ ప్రచారరథంపై నుంచి ప్రసంగించారు.

ప్రధాని సభ ఏర్పాట్ల పునరుద్ధరణ

వేములవాడలో బుధవారం ఉదయం 10 గంటలకు జరగాల్సిన ప్రధాని మోదీ సభ ఏర్పాట్లకు వర్షం వల్ల అంతరాయం కలిగింది. అక్కడ బలమైన గాలులు ప్రభావంతో టెంట్లు కూలాయి. హెలిప్యాడ్‌ నుంచి సభా ప్రాంగణానికి వెళ్లే రోడ్డు బురదమయమైంది. మంగళవారం సాయంత్రం వర్షం తగ్గిన తరువాత భాజపా అభ్యర్థి బండి సంజయ్‌ అక్కడి పరిస్థితిని పరిశీలించి సభను యథావిధిగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img