icon icon icon
icon icon icon

మెజారిటీ స్థానాలు భాజపావే..

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ భాజపాకు ఎంతో అనుకూలంగా ఉందని, రానున్న ఐదు రోజులు కీలకమని, అప్రమత్తంగా వ్యవహరించాలని భాజపా కీలక నేత బి.ఎల్‌.సంతోష్‌ పార్టీ విభాగాలకు సూచించారు.

Updated : 08 May 2024 04:34 IST

ఐదు రోజులూ అప్రమత్తంగా ఉండాలి
పార్టీ విభాగాల బాధ్యుల భేటీలో బీఎల్‌ సంతోష్‌

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ భాజపాకు ఎంతో అనుకూలంగా ఉందని, రానున్న ఐదు రోజులు కీలకమని, అప్రమత్తంగా వ్యవహరించాలని భాజపా కీలక నేత బి.ఎల్‌.సంతోష్‌ పార్టీ విభాగాలకు సూచించారు. రాష్ట్రంలో ఈసారి ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలవడంతో పాటు ఓట్ల సాధనలో అతిపెద్ద పార్టీగా భాజపా ఉంటుందని తెలిపారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భాజపా ఎస్సీ, ఎస్టీ, మహిళా, యువ మోర్చాలతో పాటు సామాజిక మాధ్యమాలు, మీడియా ఇతర అనుబంధ విభాగాల బాధ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు సహా పలువురు పాల్గొన్నారు. గత మూడు రోజులుగా రాష్ట్రంలో ఉన్న బీఎల్‌ సంతోష్‌ వివిధ లోక్‌సభ నియోజకవర్గాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో గుర్తించిన అంశాలను వివరిస్తూ.. ఐదు రోజుల కార్యాచరణ ఎలా ఉండాలనే దానిపై దిశానిర్దేశం చేశారు. ఈ సమయంలో కాంగ్రెస్‌ లేవనెత్తే అంశాలు, ఆరోపణలపై దీటుగా స్పందించాలన్నారు. భాజపా గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారనే ప్రచారంలో వాస్తవంలేదనే అంశంపై ఇప్పటికే ప్రధాని మోదీ, అగ్రనేత అమిత్‌షా సహా రాష్ట్ర నేతలు స్పష్టం చేశారని పేర్కొంటూ ఇలాంటి అంశాల పట్ల అప్రమత్తంగా ఉండటంతో పాటు ఎప్పటికప్పుడు వాస్తవాలను వివరించాలన్నారు. పోలింగ్‌ బూత్‌ల వారీగా పార్టీ నిర్దేశించిన కార్యాచరణను పూర్తిగా అమలు చేయాలన్నారు. ఓటింగ్‌ శాతం పెరిగే అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మోర్చాలు క్షేత్రస్థాయి కార్యాచరణలో ఎంతో కీలకంగా ఉండాలన్నారు. ఓటర్లను కలుసుకుని దేశానికి భాజపా ఆవశ్యకత, మరోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావాల్సిన అవసరాన్ని వివరించాలన్నారు. ముఖ్యనేతలతో విడిగా సమావేశమైన సంతోష్‌.. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో గుర్తించిన అంశాలతో పాటు పార్టీ నేతలు దృష్టి సారించాల్సిన అంశాలు, లోటుపాట్లపై అప్రమత్తమవ్వాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img