icon icon icon
icon icon icon

రిజర్వేషన్ల రద్దే భాజపా అసలు ఎజెండా

భాజపా అసలు ఎజెండా బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేయడమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం పార్టీ నేతలు బండ్ల గణేశ్‌, సామ రాంమోహన్‌రెడ్డిలతో కలసి గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

Published : 08 May 2024 04:37 IST

రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరితరమూ కాదు
కరెంటు సరఫరాపై భారాస దుష్ప్రచారం
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా అసలు ఎజెండా బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేయడమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం పార్టీ నేతలు బండ్ల గణేశ్‌, సామ రాంమోహన్‌రెడ్డిలతో కలసి గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీ వస్తే.. రాజ్యాంగం నుంచి సెక్యులర్‌ పదాన్ని తొలగించాలని భాజపా నేతలు చూస్తున్నారు. ఆ పార్టీకి కేసీఆర్‌ వత్తాసు పలకడం సిగ్గుచేటు. భాజపా, భారాస కలిసిపోయాయి. కేసీఆర్‌ పాలనలో ఛిన్నాభిన్నమైన రాష్ట్రాన్ని మూడు నెలల్లోనే చక్కదిద్దాం. ప్రజలకు వాస్తవాలు చెబితే నోటీసులు ఇచ్చి సీఎంను భయపెట్టాలని చూస్తున్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వ పదేళ్ల పాలనలో దేశం అల్లకల్లోలమైంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ మళ్లీ నెగ్గితే బడుగు, బలహీనవర్గాలు, దళితులు, గిరిజనులు తమ హక్కులు, భవిష్యత్తును కోల్పోయే ప్రమాదం ఉంది. భాజపా మళ్లీ అధికారంలోకి రాకుండా చూసే బాధ్యత బడుగు, బలహీన వర్గాలదే. ఆ పార్టీ కుట్రను అర్థం చేసుకొని.. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో, న్యాయ్‌ యాత్రలు చేశారు. కులగణన చేసి జనాభా దామాషా ప్రకారం సంపద పంచుతామని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే కులగణన చేపడుతుంది. రాహుల్‌ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణన ప్రక్రియ మొదలైంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరమూ కాదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సంపదను సృష్టించి.. ప్రజలకు పంచుతుంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 లోక్‌సభ సీట్లు గెలుస్తాం.

కావాల్సినంత కరెంటు అందుబాటులో ఉంది

రాష్ట్రంలో కావాల్సినంత కరెంటు అందుబాటులో ఉంది. గత ఏడాదితో పోలిస్తే మే ఒకటి నుంచి ఆరు వరకు విద్యుత్‌ డిమాండ్‌ 52.9% పెరిగింది. 2023 మే నెలలో 7,062 మెగావాట్లున్న సరాసరి డిమాండ్‌ ఈ నెలలో 10,799 మెగావాట్లకు పెరిగింది. సరాసరి వినియోగం 157.9 మిలియన్‌ యూనిట్ల (మి.యూ.) నుంచి 226.62 మి.యూ.లకు పెరిగింది. హైదరాబాద్‌ నగరంలో గత ప్రభుత్వ హయాంలో 2022తో పోలిస్తే 2023లో విద్యుత్‌ వినియోగం, డిమాండ్‌ వృద్ధి రేటు ఒక్క శాతం కూడా పెరగలేదు. ఈ ఏడాది గత రెండు రోజులుగా దాదాపు 4,000 మెగావాట్లకు మించి డిమాండ్‌, 90 మిలియన్‌ యూనిట్లకు మించి వినియోగం నమోదవుతోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా రాత్రిపూట సరాసరి డిమాండ్‌ అంచనాలకు మించి నమోదవుతోంది. ఈ నెల 6న అర్ధరాత్రి 12.19 గంటలకు 4,059 మెగావాట్ల డిమాండ్‌ నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 300 శాతం అధికం. నిమిషం కూడా అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరాకు కృషి చేస్తున్న సిబ్బందిని, అధికారులను అభినందించాల్సిన ప్రతిపక్షాలు.. లేని కరెంటు కోతలు ఉన్నట్టు ప్రచారం చేస్తున్నాయి. కేసీఆర్‌ పాలనలో రైతులు ధర్నాలు చేసిన రోజులు మర్చిపోయారా? తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్‌.. విద్యుత్‌ కోతలున్నాయని దుష్ప్రచారం చేయడం అత్యంత హేయం. విద్యుత్‌పై భారాస నేతలు సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. అసత్య ప్రచారం చేస్తున్న భారాసకు ప్రజలు తగిన రీతిలో సమాధానం చెబుతారు’’ అని భట్టి విక్రమార్క అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img