icon icon icon
icon icon icon

భాజపాను మించిన అవినీతి పార్టీ లేదు

దేశంలో భాజపాను మించిన అవినీతి పార్టీ మరొకటి లేదని.. ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని ఓడించడమే తమ లక్ష్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.

Published : 08 May 2024 04:37 IST

‘మీట్‌ ది ప్రెస్‌’లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: దేశంలో భాజపాను మించిన అవినీతి పార్టీ మరొకటి లేదని.. ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని ఓడించడమే తమ లక్ష్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమని.. కానీ, మోదీ అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారని, ఆయన నియంతల కంటే ప్రమాదకారి అని ధ్వజమెత్తారు. వందేళ్ల చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీలకు చట్టసభల్లో చెప్పుకోదగ్గ ప్రాతినిధ్యం లేకున్నా.. ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. తెలంగాణ స్టేట్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (టీయూడబ్ల్యూజే) మంగళవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో కూనంనేనితో ‘మీట్‌ ది ప్రెస్‌’ నిర్వహించింది. యూనియన్‌ ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సాంబశివరావు సమాధానాలిచ్చారు. ‘‘భారాస బలంగా ఉన్నప్పుడు లిక్కర్‌ కేసులో కవితను అరెస్టు చేయలేదు. భాజపాకు అనుకూలంగా ఉన్న రాజకీయ నాయకుల్లో ఎవర్నైనా ఈ పదేళ్లలో అరెస్టు చేశారా? ఏపీ సీఎం జగన్‌ పదేళ్లుగా బెయిల్‌ మీద ఎలా ఉండగలిగారు?. మోదీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. చేసిన అభివృద్ధి ఏమీ లేదు. అందుకే మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు.  భాజపా నాయకులు రాజ్యాంగం మారుస్తామని అంటున్నారు. ముస్లిం రిజర్వేషన్లను ఎత్తేస్తామంటున్నారు. నిరంకుశ మోదీని, భాజపాను ఓడించడానికి కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం. కమ్యూనిస్టులను కేసీఆర్‌ మోసం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం ఉన్న చోట పోటీ చేస్తాం. కేంద్రంలో రాబోయేది ఇండియా కూటమి ప్రభుత్వమే’’ అని కూనంనేని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img