icon icon icon
icon icon icon

హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు భాజపా యత్నం: కేటీఆర్‌

లోక్‌సభ ఎన్నికల్లో భారాస ఎంపీ అభ్యర్థులు పన్నెండు మందిని తప్పకుండా గెలిపిస్తే.. ఆర్నెల్ల వ్యవధిలోనే రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Published : 08 May 2024 04:38 IST

నగరాన్ని కాపాడేది భారాసనే అని స్పష్టీకరణ

నల్లకుంట, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో భారాస ఎంపీ అభ్యర్థులు పన్నెండు మందిని తప్పకుండా గెలిపిస్తే.. ఆర్నెల్ల వ్యవధిలోనే రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేవలం ఐదు ఎంపీ సీట్లతోనే దిల్లీ పాలకుల మెడలు వంచి కేసీఆర్‌ తెలంగాణ తెచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భారాస సికింద్రాబాద్‌ అభ్యర్థి పద్మారావుకు మద్దతుగా మంగళవారం రాత్రి హైదరాబాద్‌ నల్లకుంటలో జరిగిన రోడ్‌ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్‌ మహానగరాన్ని తమ అధీనంలోకి తీసుకోడానికి వీలుగా కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి భాజపా సర్కార్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ తరహా చర్యలను అడ్డుకొని నగరాన్ని కాపాడేది భారాస మాత్రమేనని అన్నారు. తెలంగాణకు ఏనాటికైనా గులాబీ జెండానే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. భారాస అభ్యర్థులందర్నీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గతంలో హైదరాబాద్‌లో వరదలొచ్చి ఇళ్లు మునిగిపోతే కిషన్‌రెడ్డి ఎలాంటి సాయం చేయలేదన్నారు. సికింద్రాబాద్‌ ఎంపీగా గెలిపిస్తే.. ఐదేళ్లు కేంద్రంలో మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏ విధమైన లబ్ధి చేకూర్చలేదని, మరోసారి ఆయన్ను ఎందుకు గెలిపించాలని ప్రశ్నించారు. భాజపాకు ఓటేయడానికి అయోధ్యలో రాముడి గుడి కట్టించడమే కారణమైతే... యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్‌ నిర్మించిన విషయాన్ని ప్రజలు మర్చిపోవద్దని కోరారు.  అసెంబ్లీ ఎన్నికల హామీలు అమలు చేశామని ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఆరు గ్యారంటీల్లో సంపూర్ణంగా ఎన్ని అమలుచేశారో చెప్పాలని డిమాండ్‌  చేశారు. రేవంత్‌ మాట్లాడితే కుటుంబమంతా టీవీల ముందు కూర్చొని వార్తలు చూడలేని పరిస్థితి ఏర్పడిందని, ఆయన మాటల్లో బూతులే ఉంటున్నాయని అన్నారు. కేటీఆర్‌ ప్రసంగం ముగుస్తుండగా వర్షం ప్రారంభమవడంతో గొడుగు కిందకు వెళ్లి.. శ్రేణులకు కొద్దిసేపు అభివాదం చేశారు. కార్యక్రమంలో సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థి పద్మారావు, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, కాలేరు వెంకటేశ్‌, మాగంటి గోపీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img