icon icon icon
icon icon icon

మోదీ మోసం.. కేసీఆర్‌ నమ్మక ద్రోహం

ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ, పదేళ్లు పాలించి యువతను మోసం చేశారని.. దళిత ముఖ్యమంత్రి, రెండు పడక గదుల ఇళ్ల హామీలను నెరవేర్చకుండా భారాస అధ్యక్షుడు కేసీఆర్‌ నమ్మక ద్రోహం చేశారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

Published : 08 May 2024 04:39 IST

ఎన్నికల ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి విమర్శ

ఆసిఫ్‌నగర్‌, న్యూస్‌టుడే: ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ, పదేళ్లు పాలించి యువతను మోసం చేశారని.. దళిత ముఖ్యమంత్రి, రెండు పడక గదుల ఇళ్ల హామీలను నెరవేర్చకుండా భారాస అధ్యక్షుడు కేసీఆర్‌ నమ్మక ద్రోహం చేశారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానంలో భారాసకు ఓటేస్తే మూసీలో కలుస్తుందని, కిషన్‌రెడ్డికి ఓటేస్తే పనికి రాకుండా పోతుందని అన్నారు. సికింద్రాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌కు మద్దతుగా మంగళవారం ఆయన నాంపల్లి నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం ప్రజల మనిషని, ఆయనకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దానం నాగేందర్‌ కేంద్ర మంత్రి కావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకు 30 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. ‘‘కుల మత విద్వేషాలు సృష్టించేందుకు భాజపా ప్రయత్నిస్తోంది. గుడికి, మసీదుకు వెళ్తే కడుపు నిండదు. అందరూ కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యం. భాజపాకు ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకుంది. అందుకే ఆ పార్టీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో 5 శాఖలకు మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి రాష్ట్రానికి 5 రూపాయల పని కూడా చేయలేదు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్‌ రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారు. రాష్ట్ర సంపదనంతా ఆంధ్రా గుత్తేదారులకు దోచి పెట్టారు. పార్లమెంటులో భాజపా ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు భారాస మద్దతు పలికింది’’ అని కోమటిరెడ్డి విమర్శించారు. ప్రచారంలో కాంగ్రెస్‌ నేత ఫిరోజ్‌ఖాన్‌, ఫిషరీస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మెట్టు సాయికుమార్‌, సినీ నటుడు అల్లు అర్జున్‌ మామ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img