icon icon icon
icon icon icon

సోషల్‌ మీడియా ప్రచార ఖర్చుపై ఎన్నికల సంఘం నజర్‌

లోక్‌సభ అభ్యర్థుల ప్రచార ఖర్చుపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. అనుమతులు లేకుండా సోషల్‌ మీడియా, ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌తో చేస్తున్న ప్రచార వివరాలను సమీకరిస్తోంది.

Published : 08 May 2024 04:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ అభ్యర్థుల ప్రచార ఖర్చుపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. అనుమతులు లేకుండా సోషల్‌ మీడియా, ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌తో చేస్తున్న ప్రచార వివరాలను సమీకరిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికలు, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో సోషల్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రచారాలకు అనుమతులు గణనీయంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ ద్వారా, ఇతర మార్గాల్లో అభ్యర్థులు అనుమతులు తీసుకోకుండా చేస్తున్న ప్రచారాన్ని గుర్తించి ఆ ఖర్చును లెక్కిస్తోంది. రీల్స్‌, వీడియోలకు వస్తున్న వీక్షకుల సంఖ్య ఆధారంగా లెక్కించి ఆ మొత్తాన్ని అభ్యర్థుల ఖర్చు కింద పరిగణనలోకి తీసుకుంటోంది. నిబంధనల ప్రకారం సోషల్‌మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియాలలో ప్రకటనలు ఇచ్చేందుకు, ఎస్‌ఎంఎస్‌లు, ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా ప్రచారానికి నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ అభ్యర్థులు నేరుగా అనుమతులు తీసుకోకుండా స్థానిక యూట్యూబ్‌ ఛానెళ్లు, డిజిటల్‌ పత్రికల వారితో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ ప్రచారాన్ని వార్తల కింద చూపించేందుకు వారితో రూ.2లక్షలు-రూ.10లక్షల వరకు మాట్లాడుకుంటున్నారు. తర్వాత వాటిని అభ్యర్థులు తమ వ్యక్తిగత సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్టు చేసుకుంటున్నారు. ఏ నియోజకవర్గంలో ఏ వర్గానికి ఈ సమాచారం చేరాలో ముందుగానే నిర్ణయించి ఆ మేరకు వెళ్లేలా వ్యవస్థను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని ఓ నియోజకవర్గ పరిధిలో గత లోక్‌సభ ఎన్నికల్లో, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎక్కువగానే అనుమతులు పొందగా ప్రస్తుతం కేవలం రెండు అనుమతులు మాత్రమే జారీ అయినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img