icon icon icon
icon icon icon

సీబీఐ విచారణకు నేను సిద్ధం.. మీరు సిద్ధమేనా!

వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, ఆ పార్టీ నేతలు తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ మండిపడ్డారు.

Published : 08 May 2024 04:39 IST

అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్‌ నేతలకు బండి సంజయ్‌ సవాల్‌

తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌), న్యూస్‌టుడే: వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, ఆ పార్టీ నేతలు తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ మండిపడ్డారు. మంగళవారం ఇద్దరు భారాస కార్పొరేటర్లు, ఓ జడ్పీటీసీ మాజీ సభ్యుడు తదితరులు భాజపాలో చేరారు. వారికి కరీంనగర్‌ ఎంపీ కార్యాలయంలో సంజయ్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘నాపై అవినీతి ఆరోపణలు చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌, కాంగ్రెస్‌ నేతల్లారా.. సీబీఐ విచారణకు నేను సిద్ధం, మీరు సిద్ధమా?’’ అని సంజయ్‌ సవాల్‌ విసిరారు. ‘‘నరేంద్ర మోదీ, రాహుల్‌ గాంధీల మధ్య జరుగుతున్న ఎన్నికలివి.. ఎవరి నాయకత్వం కావాలో ఆలోచించుకోవాలి. పదేళ్ల యూపీఏ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగింది. 2జీ, బొగ్గు, కామన్‌వెల్త్‌ క్రీడలు, ఆదర్శ్‌ తదితర కుంభకోణాలు వెలుగుచూశాయి. ‘గరీబీ హఠావో’ అనే నినాదంతో ముందుకొచ్చిన కాంగ్రెస్‌ నేతలు మాత్రమే అమీర్‌లు అయ్యారు. పేదలు పేదరికంలోనే మగ్గుతున్నారు. ఈ నినాదం ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదు. మోదీ మచ్చలేని పాలన అందిస్తూ దేశం కోసం పనిచేస్తున్నారు. దేశ ప్రజలే కుటుంబంగా భావిస్తున్నారు. 140 కోట్ల మందికి గ్యారంటీ మోదీ మాత్రమే. వారందరూ కాంగ్రెస్‌ను ఓడించడం ఖాయం.

మళ్లీ కేసీఆర్‌ డ్రామాలు..

కేసీఆర్‌ మళ్లీ డ్రామాలు ప్రారంభించారు. తన అరెస్ట్‌కు మోదీ కుట్ర చేస్తున్నారని అంటున్నారు. నిజాయతీపరుడిని కాబట్టే తనను అరెస్ట్‌ చేయలేకపోతున్నారని కేసీఆర్‌ చెప్పడం సిగ్గుచేటు. అవినీతి ఎక్కడ బయట పడుతుందో, జైలుకు వెళ్లాల్సి వస్తుందోనన్న భయంతో సీబీఐని రాష్ట్రంలోకి అడుగు పెట్టకుండా ఉత్తర్వులు ఇచ్చిన చరిత్ర కేసీఆర్‌ది. కాంగ్రెస్‌ ప్రభుత్వం తన అవినీతి, అరాచకాలను బయటకు తీసి అరెస్ట్‌ చేస్తుందనే భయంతో ఆ పార్టీతో కలిసి కేసీఆర్‌ చీకటి ఒప్పందం చేసుకున్నారు’’ అని సంజయ్‌ ఆరోపించారు. ఇది ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img