icon icon icon
icon icon icon

ఓట్ల కోసమే ‘రైతు భరోసా’ను అడ్డుకున్నాయి

రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తుంటే.. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి భాజపా, భారాస అడ్డుకున్నాయని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు మంగళవారం విమర్శించారు.

Published : 08 May 2024 04:40 IST

భాజపా, భారాసలపై కోమటిరెడ్డి, పొన్నం విమర్శ

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తుంటే.. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి భాజపా, భారాస అడ్డుకున్నాయని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు మంగళవారం విమర్శించారు. ఓట్ల కోసం ఆ రెండు పార్టీలు కలిసి చేస్తున్న కుట్రలను అన్నదాతలు అర్థం చేసుకున్నారని, ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పాలని వేర్వేరు ప్రకటనల్లో పిలుపునిచ్చారు. ఈసీని అడ్డంపెట్టుకొని బ్యాంకు ఖాతాల్లో పడిన రైతు భరోసా సొమ్ములను కూడా భాజపా నిలిపివేసిందని, ఇంతకంటే దారుణం ఎక్కడా ఉండదని మండిపడ్డారు. 2018 ఎన్నికల సమయంలో పోలింగ్‌ రోజునే కేసీఆర్‌ రైతుబంధు డబ్బులు ఖాతాల్లో వేశారని, అప్పుడు అడ్డుకోని ఈసీ ఇప్పుడెందుకు నిలిపివేసిందని ప్రశ్నించారు.


భాజపాకు రైతులంటే గిట్టదు: మంత్రి శ్రీధర్‌బాబు

మంథని, న్యూస్‌టుడే: భాజపాకు రైతులంటే గిట్టదని, అన్నదాతలకు అన్యాయం చేసిన పార్టీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తే.. భాజపా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి రైతుల ఖాతాకు జమచేసిన డబ్బులను నిలుపుదల చేసిందని దుయ్యబట్టారు. భాజపా చేస్తున్న కుట్రలను రైతులు గమనించాలన్నారు. గత భారాస ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసినప్పటికీ రైతులకు మేలు చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే అడ్డుకోవడం సరైంది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలు పెంచి రాయితీలు ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేసిందని విమర్శించారు. రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌ శర్మ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు మాని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు భాజపా ఇచ్చిన హామీలను కేంద్రం ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని దుయ్యబట్టారు. ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకొని, రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. భాజపా రిజర్వేషన్ల రద్దుకు, రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రాహుల్‌ గాంధీ కులగణన చేపట్టి ఎస్సీ, ఎస్టీ బీసీలకు న్యాయం చేయాలనుకుంటున్నారన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img