icon icon icon
icon icon icon

అవినీతి అంతం మోదీతోనే సాధ్యం

మహనీయుల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్న నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేయడానికి భాజపాను గెలిపించాలని రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌ శర్మ పిలుపునిచ్చారు.

Published : 08 May 2024 04:41 IST

మంథని, కోదాడ భాజపా జనసభలు, బేగంబజార్‌ రోడ్‌షోలో రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌ శర్మ

ఈనాడు, పెద్దపల్లి - మంథని, కోదాడ, కోదాడ పట్టణం, బేగంబజార్‌, న్యూస్‌టుడే: మహనీయుల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్న నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేయడానికి భాజపాను గెలిపించాలని రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌ శర్మ పిలుపునిచ్చారు. అవినీతిని పూర్తిగా అంతం చేయడం మోదీతోనే సాధ్యమని అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా మంథని, సూర్యాపేట జిల్లా కోదాడలలో నిర్వహించిన భాజపా జనసభల్లో,  హైదరాబాద్‌ బేగంబజార్‌ రోడ్‌షోలలో ఆయన ప్రసంగించారు.రాష్ట్రంలో భాజపా 14-15 లోక్‌సభ స్థానాలను గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ‘‘తెలంగాణ ఆవిర్భావం తర్వాత పదేళ్లు అధికారంలో ఉన్న భారాస అవినీతి, అక్రమాలతో పాలనను భ్రష్టు పట్టించింది. కాంగ్రెస్‌ మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కి నిరుపేదల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. ఈ ఎన్నికల్లో ఓటు వేయాలంటూ వచ్చే కాంగ్రెస్‌ నాయకులను అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై నిలదీయండి. గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజనతోపాటు మోదీ గ్యారంటీల పేరిట వచ్చే ఐదేళ్లలో నిరుపేదల అభ్యున్నతికి భాజపా కట్టుబడి ఉంది. 500 ఏళ్లుగా దేశమంతా రామ మందిర నిర్మాణానికి ఎదురుచూసింది. రాముడి విగ్రహం ప్రతిష్ఠించి ఆ కలను మోదీ సాకారం చేశారు. కులాలు, మతాల ప్రస్తావన లేవనెత్తి కాంగ్రెస్‌ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది. గతంలో కాంగ్రెస్‌ హయాంలో జరిగిన అవినీతిని మరోసారి గుర్తు చేసుకొని మోదీకి మద్దతు ఇవ్వాలి. ప్రపంచంలో భారత్‌ శక్తిమంతమైన దేశంగా ఆవిర్భవిస్తుంది. దేశంలో ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేసేందుకు కృషి చేయడం అభినందనీయం’’ అని పేర్కొన్నారు. పెద్దపల్లి, నల్గొండ, హైదరాబాద్‌ భాజపా ఎంపీ అభ్యర్థులు గోమాసె శ్రీనివాస్‌, శానంపూడి సైదిరెడ్డి, కొంపెల్ల మాధవీలతలను గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. ఆయా కార్యక్రమాల్లో పెద్దపల్లి, సూర్యాపేట, నల్గొండ, గోల్కొండ భాజపా జిల్లాల అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్‌రెడ్డి, భాగ్యరెడ్డి, వర్షిత్‌రెడ్డి, పాండుయాదవ్‌, పార్టీ నేతలు దుగ్యాల ప్రదీప్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి, చాడ శ్రీనివాసరెడ్డి, చీకోటి ప్రవీణ్‌, గొంటి శంకర్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img