icon icon icon
icon icon icon

గెలుస్తామన్న ధీమాతో నిర్లక్ష్యం వద్దు

ఎన్నికల ప్రచారం, పోలింగ్‌కు నేతల సన్నద్ధతపై కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టి సారించింది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ప్రచారం సాగుతున్న తీరుపై రాష్ట్ర ముఖ్యనేతలను అప్రమత్తం చేసింది.

Published : 08 May 2024 04:42 IST

అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, మంత్రులకు కేసీ వేణుగోపాల్‌ దిశానిర్దేశం

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల ప్రచారం, పోలింగ్‌కు నేతల సన్నద్ధతపై కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టి సారించింది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ప్రచారం సాగుతున్న తీరుపై రాష్ట్ర ముఖ్యనేతలను అప్రమత్తం చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీయే గెలుస్తుందన్న భావనతో ప్రచారంపై నిర్లక్ష్యం చూపవద్దని కొందరు ఎమ్మెల్యేలను సైతం హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ పోలింగ్‌ వరకూ వంద శాతం కష్టపడాలని సూచించింది. ప్రచారం తీరు, అన్ని పార్టీల బలాబలాలపై వార్‌ రూం ద్వారా నేరుగా క్షేత్రస్థాయి నుంచి అధిష్ఠానం సమాచారం సేకరిస్తోంది. ఏరోజుకారోజు నివేదికలు తెప్పించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మంగళవారం దిల్లీ నుంచి జూమ్‌లో కాంగ్రెస్‌ రాష్ట్ర ముఖ్యనేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, లోక్‌సభ అభ్యర్థులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు పాల్గొన్నారు.  గంటకుపైగా సాగిన సమావేశంలో ప్రచారం, ఫలితాల అంచనాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. ‘‘దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి అనుకూల వాతావరణం ఉంది. పలు ప్రాంతాల్లో భాజపా వెనుకబడింది. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రానుంది. దేశ దశ, దిశలను మార్చే ఎన్నికలను తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి. ఈ ఎన్నికల్లో పనితీరు ఆధారంగానే భవిష్యత్తులో వారికి పదవులు ఇస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నందువల్ల ఎక్కువ స్థానాల్లో నెగ్గాలి. ఇవి లోక్‌సభ ఎన్నికలు కావడంతో తమకు సంబంధం లేదన్నట్టు ఎమ్మెల్యేలు ఉండొద్దు. తమ నియోజకవర్గంలో అధిక మెజార్టీ తెప్పించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులదే. కొందరు ఎమ్మెల్యేలు ప్రచారంలో చురుగ్గా పాల్గొనడం లేదనే సమాచారం ఉంది. పోలింగ్‌ జరిగేవరకూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి.. ప్రజలను కలవాలి. నల్గొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి అక్కడి ప్రచారాన్ని చూసుకుంటారు. సికింద్రాబాద్‌కు ఇన్‌ఛార్జిగా ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ నియోజకవర్గంలో ప్రచారంపై నిర్లక్ష్యం చేయవద్దు. పోలింగ్‌ ముగిసేవరకూ నియోజకవర్గం దాటి బయటికి వెళ్లొద్దు. పార్టీ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి. పార్టీ నిర్దేశించిన పనిని ప్రతి ఒక్కరూ శ్రద్ధతో చేయాలి. పార్టీ నిర్ణయాలను ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దు’’ అని స్పష్టం చేశారు. జూమ్‌ సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంపై కేసీ వేణుగోపాల్‌ అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. ఎవరెవరు సమావేశంలో పాల్గొనలేదో నివేదిక ఇవ్వాలని పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఆయన ఆదేశించారు. కొందరు ఎమ్మెల్యేలు సమావేశం ప్రారంభమైన తర్వాత ఆలస్యంగా ఆన్‌లైన్‌లోకి వచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు ముగిసిన తర్వాత రుణమాఫీ అమలు చేయనున్నట్లు స్పష్టంచేశారు. రుణమాఫీకి ప్రభుత్వం సన్నద్ధంగా ఉందనే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రజాపాలన, గ్యారంటీ హామీల గురించి ఎమ్మెల్యేలు వివరించాలని ఆయన చెప్పినట్లు సమాచారం.


4 పార్లమెంటు నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ సహ ఇన్‌ఛార్జులు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ 4 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు సహ ఇన్‌ఛార్జులను నియమించింది. మహబూబ్‌నగర్‌కు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మెదక్‌కు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు టి.జగ్గారెడ్డి, జహీరాబాద్‌కు ఎమ్మెల్యే కె.మదన్‌మోహన్‌రావు, చేవెళ్లకు ఎమ్మెల్యే టి.రాంమోహన్‌రెడ్డిలను నియమించారు. కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ ఆదేశాల మేరకు వీరి నియామకం జరిపినట్లు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img