icon icon icon
icon icon icon

విభజన హామీలు అమలు చేయని మోదీ ఓట్లు ఎలా అడుగుతారు?

ప్రధాని మోదీ.. విభజన హామీలేవీ నెరవేర్చకుండా ఈ ప్రాంతానికి అన్యాయం చేశారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వరంగల్‌ వస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

Updated : 08 May 2024 06:27 IST

బిడ్డ బెయిల్‌ కోసం కేసీఆర్‌ రాష్ట్రాన్ని మోదీకి తాకట్టు పెట్టారు
‘రైతు భరోసా’ను భాజపా, భారాస అడ్డుకున్నాయి
వరంగల్‌ పశ్చిమ, తూర్పు కూడలి సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, వరంగల్‌ - రంగంపేట, న్యూస్‌టుడే: ప్రధాని మోదీ.. విభజన హామీలేవీ నెరవేర్చకుండా ఈ ప్రాంతానికి అన్యాయం చేశారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వరంగల్‌ వస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. డిసెంబరులో గెలిచింది సెమీ ఫైనల్స్‌ అని.. ఇప్పుడు జరగబోయే ఫైనల్‌ మ్యాచ్‌(లోక్‌సభ ఎన్నికలు) గుజరాత్‌ వర్సెస్‌ తెలంగాణ అని చెప్పారు. మంగళవారం రాత్రి వరంగల్‌ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా కూడలి సమావేశాల్లో సీఎం ప్రసంగించారు. మే 13న జరిగే దంగల్‌లో గుజరాత్‌ టీంను డక్‌ అవుట్‌ చేసి చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. భారాస అధినేత కేసీఆర్‌ తన బిడ్డ బెయిల్‌ కోసం వరంగల్‌ సీటును భాజపాకు అప్పజెప్పి తెలంగాణను మోదీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. ‘‘వరంగల్‌లో అక్కడక్కడా తులసివనంలో గంజాయి మొక్కల్లా ఎర్రబెల్లి, అరూరి రమేశ్‌ లాంటి అనకొండలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని భారాస నేతలు పట్టి పీడిస్తున్నారు. వరంగల్‌లో భారాస, భాజపా చీకటి ఒప్పందం చేసుకొని కాంగ్రెస్‌ను దొంగ దెబ్బ కొట్టాలని కుట్ర చేస్తున్నాయి. భారాస నాయకుడిని భాజపాలోకి పంపి భారాస నుంచి ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టి కాంగ్రెస్‌ను ఓడించేందుకు అంతర్గత అవగాహనతో ముందుకెళ్తున్నారు. అందుకే వర్షం వచ్చినా, హెలికాప్టర్‌ రాకపోయినా ఈ రెండు పార్టీల కుట్రలు తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు ఇక్కడికి వచ్చా. బుధవారం ప్రధాని మోదీ వరంగల్‌కు రానున్నారని తెలిసింది. భాజపాకు ప్రజలు ఎందుకు ఓటేయాలో జవాబు చెప్పాకే మోదీ ఈ గడ్డపై కాలు పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నా. పునర్విభజన చట్టంలో భాగంగా కాంగ్రెస్‌ హయాంలో ఖమ్మం జిల్లాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చారు. కాజీపేటకు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, రంగారెడ్డి జిల్లాకు ఐటీఐఆర్‌ కారిడార్‌, మెదక్‌కు ఐఐఎం, నల్గొండకు ఐఐటీ ఇచ్చారు. కానీ, ప్రధానిగా మోదీ వచ్చాక బయ్యారానికి ఉక్కు కర్మాగారాన్ని రానివ్వలేదు. కోచ్‌ ఫ్యాక్టరీని లాతూర్‌కు తరలించుకుపోయారు. ఐటీఐఆర్‌ కారిడార్‌ను రద్దు చేశారు.

గిరిజన వర్సిటీని పదేళ్లు ఆలస్యం చేసి నిన్నగాక మొన్న మొదలుపెడుతున్నామన్నారు. ఐఐటీ, ఐఐఎం ఏదీ ఇవ్వలేదు. వరంగల్‌ స్మార్ట్‌ సిటీ, భూగర్భ డ్రైనేజీ విషయంలో కేంద్రం నిర్లక్ష్యం వహించింది. ఏం ఇచ్చారని మోదీ ఓట్లు అడగడానికి వస్తున్నారని ప్రశ్నిస్తున్నా. మోదీకి దేశం అంటే గుజరాతేనా? తెలంగాణకు వచ్చిన పరిశ్రమలన్నీ గుజరాత్‌కే తరలించుకుపోతున్నారు. మా వరంగల్‌ ఔటర్‌ రింగురోడ్డు ఎందుకు పూర్తి చేయలేదు. ఎయిర్‌పోర్టు ఏర్పాటులో ఎందుకు నిర్లక్ష్యం వహించారు. దక్షిణ భారత దేశంలోనే అతిపెద్దదైన కాజీపేట జంక్షన్‌ను రద్దు చేసే పరిస్థితిని భాజపా సర్కారు తీసుకొచ్చింది. పదేళ్లు ఆయన(మోదీ) ఇవ్వలేదు.. ఈయన(కేసీఆర్‌) అడగలేదు. పదేళ్లు కేసీఆర్‌ అధికారంలో ఉండి తెలంగాణలో విధ్వంసం సృష్టిస్తే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు. అయినా ఆయన ఆలోచనలో మార్పు రాలేదు. బస్సు యాత్ర చేస్తూ రేవంత్‌రెడ్డి దిగాల్సిందే, కాంగ్రెస్‌ పడిపోవాల్సిందేనంటూ కేసీఆర్‌ మాట్లాడుతున్నారు. నేను వాళ్ల పిల్లల్నో.. వీళ్ల పిల్లల్నో చంపి ఈ కుర్చీలోకి రాలేదు. పదేళ్లు పోరాడి లక్షల మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు రక్తాన్ని చిందించి అధికారంలోకి తెచ్చారు. కాబట్టి దిగిపొమ్మనగానే దిగిపోయేందుకు ఇక్కడ ఎవరూ అల్లాటప్పాగా లేరు. ఎవరిని మభ్యపెట్టడానికి కేసీఆర్‌ బస్సేసుకొని బయలుదేరారు? మీ అన్యాయంతోనే రెండు లక్షల ఖాళీలు ప్రభుత్వంలో పడావు పడ్డాయి. కానీ, నేను వచ్చిన వెంటనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చా. నేనొచ్చిన 48 గంటల్లోనే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే ఇప్పటికి 40 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేశారు. 40 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్‌ ఇస్తున్నాం. దాదాపు 50 లక్షల మంది పేదలకు 200 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇస్తున్నాం. ఇలా మా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేసింది. వందరోజుల్లో ఇన్ని పనులు చేసిన నన్ను కేసీఆర్‌ దిగిపొమ్మంటున్నారు. మరి పదేళ్లు దిల్లీలో గద్దె మీద ఉన్న మోదీ గురించి కేసీఆర్‌ ఎప్పుడైనా మాట్లాడారా? మీరు అమ్ముడుపోయి మోదీ వద్ద తెలంగాణను తాకట్టు పెట్టినందుకే కదా వరంగల్‌కు కోచ్‌ ఫ్యాక్టరీ, ఖమ్మంకు ఉక్కు కర్మాగారం రాలేదు. రేపు జరగబోయేవి ఎన్నికలు కావు.. యుద్ధమే. కాకతీయుల పౌరుషం స్ఫూర్తితో దిల్లీ సుల్తానులను వరంగల్‌ ప్రజలు ఓడించాలి.

ఆ రెండు పార్టీలు అడ్డుకున్నాయి..

రైతు భరోసా నిధులు జమచేద్దామంటే.. భారాస, భాజపా వాళ్లు కలిసి కుట్ర చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో 13 తర్వాతే ఆ నిధులు వేయాలని ఈసీ నాకు నోటీసులిచ్చింది. 2018 ఎన్నికల సమయంలో భారాస నేతలు రైతుల ఖాతాల్లో నగదు జమచేస్తే భాజపా వారికి సంతోషం కలిగింది. నాడు అడ్డుకోలేదు. కానీ నేను 9వ తేదీ లోపు రైతుభరోసా నిధులు ఖాతాలో వేస్తానంటే అడ్డుకున్నారు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి వినతి మేరకు ఓరుగల్లు నగరానికి భూగర్భ డ్రైనేజీ మంజూరు చేయనున్నట్లు సీఎం తెలిపారు.

సీఎంకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు

సీఎం రేవంత్‌రెడ్డికి మంగళవారం మంత్రులు, కాంగ్రెస్‌ శాసనసభ్యులు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం సీఎం దంపతుల పెళ్లి రోజైనా ఆయన కుటుంబంతో గడపకుండా ప్రజల కోసం వర్షాన్ని కూడా లెక్కచేయకుండా రోడ్డు షోకు తరలి వచ్చారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. రాత్రి ఎనిమిది గంటలకు హనుమకొండలో సీఎం ప్రసంగిస్తుండగా చినుకులు కురుస్తూనే ఉన్నాయి. అయినా పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో ప్రచారం చేయాల్సిందేనని పట్టుబట్టి రాత్రి 9.30 గంటలకు ముగించుకొని హైదరాబాద్‌ తిరుగుపయనమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img