icon icon icon
icon icon icon

సీఎం కుట్రతోనే రైతుబంధు ఆగింది

‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో నన్ను దీవించారు.. పదిహేనేళ్లు పోరాటం చేసి.. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించాను. ఆ తర్వాత ఒక్కోటి బాగుచేస్తూ రాష్ట్రాన్ని పొదరిల్లులాగా తీర్చిదిద్దాను.

Published : 08 May 2024 04:42 IST

ఆరు గ్యారంటీలంటూ అరచేతిలో వైకుంఠం చూపెట్టిన కాంగ్రెస్‌
దేశ ప్రతిష్ఠను మంటగలిపిన భాజపా
కామారెడ్డి, మెదక్‌ రోడ్‌షోల్లో భారాస అధినేత కేసీఆర్‌

ఈనాడు, కామారెడ్డి-మెదక్‌, న్యూస్‌టుడే: ‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో నన్ను దీవించారు.. పదిహేనేళ్లు పోరాటం చేసి.. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించాను. ఆ తర్వాత ఒక్కోటి బాగుచేస్తూ రాష్ట్రాన్ని పొదరిల్లులాగా తీర్చిదిద్దాను. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన వాగ్దానాలను నమ్మి ప్రజలు ఓటేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ మోసాల నుంచి కాపాడాలన్నా.. నదుల నీళ్లు దక్కించుకోవాలన్నా.. కరెంట్‌ రావాలన్నా భారాస ఎంపీలు గెలవాలి’’ అని భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం రోడ్‌షో, అనంతరం కూడలి సమావేశంలో రాత్రి మెదక్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించారు.

హామీలను గాలికి వదిలేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం

‘‘ఆరు గ్యారంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. వాటిని గాలికి వదిలేసింది. కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నారు. దాంతో ఆటో రిక్షా కార్మికులు రోడ్డున పడి ఆత్మహత్య చేసుకుంటున్నారు. మహిళల ఖాతాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం నెలకు రూ.2500 చొప్పున వేయడం లేదు. డిసెంబరు 9లోపు రూ.రెండు లక్షల రుణం మాఫీ చేస్తామని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు.. అయిందా? విద్యార్థులకు స్కూటీలు ఇవ్వలేదు గాని.. లూటీ చేస్తున్నారు. ఆసరా పింఛన్‌ రూ.4 వేలు చేశారా? (లేదని ప్రజలు చెప్పడంతో) పింఛన్ల మొత్తం పెంచడం సంగతి దేవుడెరుగు గాని అసలుకే మోసం తెచ్చేలా జనవరి నెల పింఛన్‌ను ఎగవేశారు. యువవికాసం పేరుతో నిరుద్యోగ యువతకు భృతి ఇస్తామని చెప్పినా ఇవ్వలేదు. యువత ఉపాధికి రూ.5 లక్షలు మంజూరు చేయలేదు. ముఖ్యమంత్రే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి.. రైతుబంధు రాకుండా చేశారు. వచ్చే సీజన్‌ నుంచి ఐదు ఎకరాల వరకే రైతుబంధు వేస్తారట. ఆరు-ఏడు ఎకరాల రైతులు ఏం పాపం చేశారు? విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. మిషన్‌ భగీరథ జలాలు ఆగిపోయాయి. రైతుబీమా ఉంటుందో ఉండదో తెలియదు.

భాజపా ఎజెండాలో పేదల కష్టాలుండవు

ప్రధాని మోదీ పాలనలో అంతర్జాతీయంగా దేశప్రతిష్ఠ మంటగలిసింది. రూపాయి విలువ పతనమైంది. పదేళ్లలో మోదీ 150 వాగ్దానాలు ఇచ్చారు. ఒక్కటీ అమలు చేయలేదు. జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తానన్న మోదీ మోసం చేశారు. కామారెడ్డి ప్రజలు భాజపా ఎమ్మెల్యేను గెలిపించినందుకు రూ.30 లక్షలు వేశారట నిజమేనా? భాజపా నాయకులు ప్రస్తుత ఎన్నికల్లో ‘అబ్‌కీ బార్‌ చార్‌సౌ పార్‌’ అంటున్నారు. కేంద్రంలో మళ్లీ ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే పెట్రోల్‌, డీజిల్‌ ధర రూ.400 కావడం ఖాయం. భాజపా ఎజెండాలో పేదల కష్టాలు, బాధలుండవు. రాష్ట్రానికి రావాల్సిన నవోదయ విద్యాలయాలు, వైద్య కళాశాలలు ఇవ్వలేదు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీకి అప్పజెప్పారు. సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టును సైతం ఇచ్చేశారు. తల్లిని చంపి పిల్లను బతికించారని తెలంగాణ ఆవిర్భావం గురించి మోదీ ఎద్దేవా చేశారు. భాజపాకు ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో 200లకు మించి స్థానాలు రావు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. గోదావరి, కృష్ణా నదీ జలాలను తరలించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. అందుకే భాజపాకు ఓటు వేసి తెలంగాణకు అన్యాయం చేయవద్దు. ప్రశ్నించే గొంతుకగా నిలిచే భారాసను గెలిపించాలి.

కొత్త జిల్లాలను తీసేస్తామంటున్నారు..

ఉమ్మడి మెదక్‌ జిల్లావాడిని కాబట్టి... ప్రేమతోటి... ఎప్పటి నుంచో డిమాండ్‌ ఉండడంతో మెదక్‌ పట్టణ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. అయితే ముఖ్యమంత్రి మెదక్‌ జిల్లాను తీసేస్తానంటున్నారు. జిల్లా ఉండాలంటే భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలవాలి. మెదక్‌ కోసం యుద్ధం చేద్దాం’’ అని కేసీఆర్‌ అన్నారు. కార్యక్రమాల్లో అభ్యర్థులు గాలి అనిల్‌కుమార్‌(జహీరాబాద్‌), వెంకట్రామిరెడ్డి(మెదక్‌), మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సునీతారెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మెదక్‌ జడ్పీ అధ్యక్షురాలు హేమలతగౌడ్‌, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్‌, జాజాల సురేందర్‌, హన్మంత్‌ షిండే, భారాస కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్‌, మెదక్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img