icon icon icon
icon icon icon

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ గడువు పొడిగింపు

రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ గడువును శుక్రవారం సాయంత్రం వరకు పొడిగించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ బుధవారం ‘ఈనాడు’తో చెప్పారు.

Published : 09 May 2024 02:50 IST

శుక్రవారం సాయంత్రం వరకు అవకాశం
తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ గడువును శుక్రవారం సాయంత్రం వరకు పొడిగించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ బుధవారం ‘ఈనాడు’తో చెప్పారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసేందుకు సీఈసీ విధించిన గడువు బుధవారం సాయంత్రంతో ముగిసింది. దానిని పొడిగించాలని వికాస్‌రాజ్‌ లేఖ రాయడంతో సీఈసీ స్పందించి శుక్రవారం వరకు అవకాశం ఇచ్చింది. సాధారణంగా ఓట్ల లెక్కింపును నిర్దేశించిన రోజున ఉదయం 8 గంటలకు ప్రారంభిస్తారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఉదయం 7:59 వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఉంచిన సీల్డు కవర్‌ను లెక్కింపు అధికారులకు అందజేసేందుకు గతంలో అవకాశం ఉండేది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ విధానాన్ని సీఈసీ రద్దు చేసింది. పోలింగ్‌ కన్నా ముందుగానే పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. అందుకోసం ఫెసిలిటేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. ఆ మేరకు లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని 2,79,519 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ నమోదు చేసేందుకు ముందుకొచ్చారు. వారిలో సుమారు 40 వేల మంది ఎన్నికల విధుల ధ్రువపత్రం(ఎలక్షన్‌ డ్యూటీ సర్టిఫికెట్‌) ద్వారా పోలింగ్‌ రోజునే ఓటు వేసేందుకు అంగీకరించారు. వారంతా ఆ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన వారే కావటంతో అధికారులు ధ్రువపత్రాలు జారీ చేశారు. మిగిలిన వారిలో బుధవారం సాయంత్రం వరకు సుమారు 1.70 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారు. మరో 70 వేల మంది వరకు మిగిలి ఉండటంతో మరింత గడువు ఇవ్వాలని నిర్ణయించారు.

ఇంటి నుంచి 21 వేల మంది ఓటు

వయోవృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే ప్రక్రియ పూర్తయింది. ఇందుకు 23,248 మందిని అర్హులుగా గుర్తించగా.. వారిలో 21 వేల మంది ఓటు వేశారని వికాస్‌రాజ్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img