icon icon icon
icon icon icon

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

‘‘బ్రిటిష్‌ కాలం నుంచి కొనసాగుతున్న జనాభా లెక్కల విధానాన్ని మోదీ నిలిపేశారు. కులగణన చేపట్టి బీసీలకు మేలు చేయడాన్ని అడ్డుకుంటున్నారు.

Published : 09 May 2024 02:56 IST

రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ కుట్ర
ఆర్మూర్‌, నిజామాబాద్‌ రోడ్‌షోల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఈనాడు, నిజామాబాద్‌: ‘‘బ్రిటిష్‌ కాలం నుంచి కొనసాగుతున్న జనాభా లెక్కల విధానాన్ని మోదీ నిలిపేశారు. కులగణన చేపట్టి బీసీలకు మేలు చేయడాన్ని అడ్డుకుంటున్నారు. రిజర్వేషన్లను రద్దు చేసేందుకు, రాజ్యాంగాన్ని మార్చేందుకే ఇలా కుట్ర పన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లు ప్రమాదంలో పడ్డాయి. నియంతృత్వ పాలనతో రాజ్యాంగాన్ని ఇష్టారాజ్యంగా మార్చుకుంటూ పోతే ప్రజాస్వామ్యం బతుకుతుందా? గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచిఉంది. రాజ్యాంగం మారుస్తామని, రిజర్వేషన్లు రద్దు చేస్తామని అంటున్న భాజపాను గద్దెదించాలి. వాటిని కాపాడే బాధ్యత కాంగ్రెస్‌ తీసుకుంటుంది’’ అని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌, నిజామాబాద్‌ నగరంలో నిర్వహించిన రోడ్‌ షోల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.

సిద్ధుల గుట్ట సాక్షిగా..

‘‘మాట ఇస్తే తలతెగి కింద పడ్డా వెనక్కితిరిగి చూడను. ఎన్ని కేసులు పెట్టినా తగ్గకుండా కొట్లాడాను. లక్షల మంది కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి పోరాడాను. ఇందిరమ్మ రాజ్యం తెచ్చాను. పసుపు పంటకు మద్దతు ధర, ఎర్రజొన్న, సోయా, మక్కలకు గిట్టుబాటు ధర, వరికి రూ.500 బోనస్‌ ఇచ్చే బాధ్యత నాది. ఆర్మూర్‌ సిద్ధులగుట్ట సాక్షిగా చెబుతున్నా.. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాను. మే 9వ తేదీకల్లా రైతు భరోసా వేయకుంటే ముక్కు నేలకు రాస్తానని సవాలు విసిరా. 6వ తేదీ నాటికి 69 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బుల జమ చేయడం పూర్తయింది. కేసీఆర్‌ వచ్చి అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయాలి. సవాల్‌ విసరడం కాదు.. స్వీకరించే ధైర్యం కూడా ఉండాలి. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేయాలని హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. తప్పక మాఫీ చేస్తా. ఆ రోజు దేశానికి స్వాతంత్య్రంతో పాటు సిద్దిపేటకు హరీశ్‌రావు పీడ వదిలిస్తా.

తెలంగాణకు మోదీ గాడిద గుడ్డు ఇచ్చారు..

పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వాలని, చక్కెర కర్మాగారాలను తెరిపించాలని అడిగితే.. ఏమీ ఇవ్వలేదు. మళ్లీ వచ్చి అవే అబద్ధాలు చెబుతున్నారు. పసుపు బోర్డును ఐదేళ్లైనా ఏర్పాటు చేయలేదు. గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ల విషయంలో అయితే ఇలా వాయిదా వేస్తారా? తెలంగాణ ప్రజలంటే లెక్కలేదా? వారిని మోసం చేయొచ్చని మోదీ, ధర్మపురి అర్వింద్‌ అనుకుంటున్నారు. మోదీ తెచ్చిన నల్ల చట్టాలను వ్యతిరేకించి.. మెడలు వంచి క్షమాపణ చెప్పించిన పౌరుషం హరియాణా, పంజాబ్‌ రైతులది. తెలంగాణలో ఆర్మూర్‌ ప్రాంత రైతులది ఇదే తరహా పౌరుషం. ఈ ఎన్నికల్లో భాజపాను ఓడించి బుద్ధిచెప్పాలి. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే చక్కెర కర్మాగారం కోసం మంత్రులతో కమిటీ వేశాం. బ్యాంకు బకాయిలు తీర్చేందుకు రూ.43 కోట్లు విడుదల చేశాం. సెప్టెంబరులో తెరిపిస్తాం. వచ్చే ఏడాదిలో క్రషింగ్‌ మొదలుపెడతాం. పసుపు బోర్డు రావాలన్నా, చక్కెర కర్మాగారం తొందరగా తెరుచుకోవాలన్నా జీవన్‌రెడ్డిని గెలిపించండి.

విగ్రహ ప్రతిష్ఠకు ముందే అక్షింతలెలా వచ్చాయి..

భద్రాచలంలో అయినా, మరే ఇతర ఆలయంలోనైనా కల్యాణం అయ్యాకే అక్షింతలు ఇస్తారు. అయోధ్య విగ్రహ ప్రతిష్ఠ పూజ కంటే 15 రోజుల ముందే అక్షింతలు ఎలా వచ్చాయి? ఇది హిందువులను, దేవుడిని మోసం చేయడం కాదా? మేం హిందువులం కాదా.. పూజలు చేయడం లేదా? దేవుడి గురించి భాజపా వాళ్లు మనకు చెప్పాలా? దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి. వారే నిజమైన హిందువులు.

కవిత బెయిల్‌ కోసం భారాస ఆత్మగౌరవం తాకట్టు..

కేసీఆర్‌ తన బిడ్డ కవిత బెయిల్‌ కోసం భారాస ఆత్మగౌరవాన్ని మోదీ దగ్గర తాకట్టు పెట్టారు. దేశం కోసం త్యాగం చేసిన కాంగ్రెస్‌కు 40 సీట్లు వస్తాయని, భాజపాకు 400 సీట్లు వస్తాయని అంటున్నారు. ఈ మాటలతో ఆ రెండు పార్టీలు ఒకే నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివని తేలిపోయింది. ఈ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించేందుకు భారాస వాళ్లు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారు. మేం అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో కొన్ని హామీలు అమలు చేశాం. ఉచిత బస్సు ప్రయాణాన్ని 40 కోట్ల మంది ఆడబిడ్డలు వినియోగించుకున్నారు. రూ.500కే సిలిండర్‌ అందిస్తున్నాం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు నిర్ణయం తీసుకున్నాం. గంజాయి, మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపాం. ఇన్ని చేసిన నన్ను కేసీఆర్‌ దిగిపో అంటున్నారు’’ అని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రోడ్‌షోలో కర్ణాటక మంత్రి బోసురాజు, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, నిజామాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, కర్ణాటక ఎమ్మెల్యే మంత్ర గౌడ, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.


నేడు నర్సాపూర్‌, ఎల్బీనగర్‌లలో రాహుల్‌ జన జాతర సభలు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ గురువారం రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్‌లో, సాయంత్రం 6 గంటలకు ఎల్బీనగర్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించే జన జాతర సభల్లో ఆయన పాల్గొంటారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా పాల్గొననున్నారు. ఈ నెల 11న కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకాగాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు కామారెడ్డిలో, మధ్యాహ్నం తాండూరులో జరిగే జన జాతర సభల్లో ఆమె పాల్గొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img