icon icon icon
icon icon icon

కాశీ విశ్వేశ్వరుడి ప్రతిరూపం.. మోదీ

‘స్వాతంత్య్రం వచ్చాక చాలా మంది ప్రధానులు ఈ దేశాన్ని పాలించారు. కానీ ఒక్కరు కూడా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న దాఖలాల్లేవు.. ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరే దక్షిణ కాశీగా పేరొందిన ఇక్కడికి వచ్చి శివుడిని దర్శించుకున్నారు’ అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ అన్నారు.

Updated : 09 May 2024 06:27 IST

కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోనే పెద్ద గాడిద గుడ్డు
వేములవాడ జనసభలో బండి సంజయ్‌

సిరిసిల్ల, ఈనాడు డిజిటల్‌: ‘స్వాతంత్య్రం వచ్చాక చాలా మంది ప్రధానులు ఈ దేశాన్ని పాలించారు. కానీ ఒక్కరు కూడా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న దాఖలాల్లేవు.. ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరే దక్షిణ కాశీగా పేరొందిన ఇక్కడికి వచ్చి శివుడిని దర్శించుకున్నారు’ అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ అన్నారు. కాశీ నుంచి దక్షిణ కాశీకి వచ్చిన మోదీ కాశీ విశ్వేశ్వరుడికి ప్రతిరూపం అని అభివర్ణించారు. వేములవాడలో బుధవారం నిర్వహించిన ఆదిలాబాద్‌, పెద్దపల్లి, కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గాల ఎన్నికల ప్రచార సభలో సంజయ్‌ మాట్లాడారు. ‘‘మోదీపై అనవసర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు. ఈ దేశాన్ని కుటుంబ పాలనతో అవినీతిమయం చేసి భ్రష్టు పట్టించిన కాంగ్రెస్‌ పార్టీని మెడలు పట్టి బయటకు పంపించిన జగమొండి నరేంద్ర మోదీ. ఆయన మేడ్‌ ఇన్‌ భారత్‌.. మరి సోనియా ఏంటి? మా భాజపా మేడ్‌ ఇన్‌ ఇండియా.. మీ కాంగ్రెస్‌ పార్టీ మేడ్‌ ఇన్‌ బ్రిటన్‌. మా మోదీ పక్కా లోకల్‌. మరి సోనియా ఎక్కడి నుంచి వచ్చారో కాంగ్రెస్సే చెప్పాలి. మేడ్‌ ఇన్‌ భారత్‌ పార్టీ కావాలా?.. మేడ్‌ ఇన్‌ బ్రిటన్‌ పార్టీ కావాలో ప్రజలు ఆలోచించాలి. భాజపా గెలిస్తేనే ఈ దేశం హాయ్‌.. రామ్‌ అవుతుంది. ఇందులోని ఆంగ్ల అక్షరాలను చూస్తే.. హెచ్‌ అంటే హైవేస్‌, ఐ.. ఇంటర్నెట్‌, ఆర్‌.. రైల్వేస్‌, ఎ.. ఎయిర్వేస్‌, ఎం.. మోరల్‌ సపోర్ట్‌. మన మోదీ ప్రధాని అయితేనే ఇవన్నీ అభివృద్ధి చేసుకుంటాం.. దేశం నంబర్‌ వన్‌ అవుతుంది. కాంగ్రెస్‌ నేతలు తెలంగాణ ప్రజలకు గాడిద గుడ్డు చూపిస్తున్నారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోనే పెద్ద గాడిద గుడ్డు. మోదీ ఏ పని తలపెట్టినా మాతృమూర్తి ఆశీస్సులు తీసుకుని బయటకు వస్తారు. ఈ రోజు తల్లి ఆశీస్సులు తీసుకోకుండా వచ్చిన ఆయనకు మనమంతా కుటుంసభ్యులుగా నిలిచి ముచ్చటగా మూడోసారి ప్రధానిని చేద్దాం’’ అని సంజయ్‌ కోరారు. సభలో పెద్దపల్లి, ఆదిలాబాద్‌ భాజపా అభ్యర్థులు గోమాసె శ్రీనివాస్‌, గోడం నగేశ్‌, భాజపా బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా.కె.లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.


రాజన్న ఆలయంలో ప్రధాని పూజలు

ప్రధాని మోదీ హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బుధవారం ఉదయం 9.30 గంటలకు వేములవాడకు చేరుకున్నారు. రాజరాజేశ్వరస్వామి ప్రధాన ఆలయానికి వచ్చి తొలుత కోడె మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానికి వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలిచ్చారు. ఇన్నేళ్ల ఆలయ చరిత్రలో ఓ ప్రధాన మంత్రి రాజన్నను దర్శించుకోవడం ఇదే ప్రథమం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img