icon icon icon
icon icon icon

ఐదేళ్లకు ఐదుగురు ప్రధానులట!

‘ఇండి కూటమిలో కొత్త ప్రతిపాదన వచ్చిందట. వాళ్లు అధికారంలోకి వస్తే ఐదేళ్లకు ఐదుగురు ప్రధానమంత్రులట. ఏడాదికి ఒకరని అంటున్నారు.

Updated : 09 May 2024 06:25 IST

అలాగైతే దేశం అభివృద్ధి చెందుతుందా?
ఇండి కూటమిపై ప్రధాని మండిపాటు
దేశం, తెలంగాణ అభివృద్ధికి నాదీ గ్యారంటీ
కాంగ్రెస్‌, భారాసలది అవినీతి బంధం
ట్రిపుల్‌ ఆర్‌ కలెక్షన్లను మించి డబుల్‌ ఆర్‌ వసూళ్లు
వేములవాడ, వరంగల్‌ సభల్లో నరేంద్ర మోదీ
ఈనాడు, వరంగల్‌; ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల

‘ఇండి కూటమిలో కొత్త ప్రతిపాదన వచ్చిందట. వాళ్లు అధికారంలోకి వస్తే ఐదేళ్లకు ఐదుగురు ప్రధానమంత్రులట. ఏడాదికి ఒకరని అంటున్నారు. ఏడాదికి ఒక ప్రధానమంత్రితో దేశం బలోపేతం అవుతుందా? భారత్‌ అభివృద్ధి చెందుతుందా’ అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ‘పదిమంది రైతులు నీళ్ల కోసం బోరు వేసుకోవాలని అనుకున్నారు. నీళ్లు ఎక్కడ ఉంటాయో అన్వేషించారు. చివరకు ఒకరి పొలంలో వంద మీటర్లలోతులో నీళ్లు ఉన్నాయని గుర్తించారు. వంద మీటర్ల పైపు వేస్తే నీళ్లు వస్తాయి. కానీ ఆ రైతులు ఎవరి పొలంలో వారు పదిమీటర్ల పైపు వేసుకునేందుకు ముందుకు వచ్చారు. ఇండి కూటమిలో నేతలు ఇలానే ఉన్నారు’ అని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన కరీంనగర్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని వేములవాడలో, వరంగల్‌ నియోజకవర్గం పరిధిలోని ఖిలావరంగల్‌ మండలం లక్ష్మీపురంలో భాజపా నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభల్లో మాట్లాడారు.‘చర్మం రంగు ఆధారంగా ప్రజల యోగ్యతను నిర్ణయిస్తారా? అలా నిర్ణయించే అధికారం వాళ్లకు ఎవరిచ్చారు? నా దేశ ప్రజల్ని అవమానిస్తే ఒప్పుకొనేదిలేదు. నన్ను నిందించండి సహిస్తా... చర్మం రంగు ఆధారంగా నా దేశ ప్రజల గౌరవాన్ని నిర్ణయిస్తే ఎంతమాత్రం సహించను’ అని ప్రధాని మోదీ అన్నారు. ‘‘2014లో ప్రజలు నాకు దేశానికి సేవచేసే అవకాశం కల్పించారు. మొదటి సారి అవకాశం వస్తే దళితుడైన రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతిని చేశాం. రెండోసారి అవకాశం ఇస్తే ఆదివాసీ బిడ్డ ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతిని చేశాం. ఈ రెండింటిని కాంగ్రెస్‌ పూర్తిగా వ్యతిరేకించింది. కాంగ్రెస్‌కు ముర్ముపై ఎందుకంత కోపం అని ఆలోచిస్తూ ఉండేవాడిని. చాలా రోజులు నాకు అర్థంకాలేదు. ఈ రోజు నాకు అర్థమైంది. అమెరికాలో ఉండే ఓ అంకుల్‌ రాకుమారుడికి ఫిలాసఫర్‌, గైడ్‌. రాకుమారుడు గందరగోళంలో ఉన్నప్పుడు ఆయన సలహాలు తీసుకుంటారు. ఆ ఫిలాసఫర్‌ ఒక రహస్యాన్ని వెలుగులోకి తెచ్చారు. ఎవరి రంగు అయితే నల్లగా ఉంటుందో వారంతా ఆఫ్రికా సంతతి అని. ఆ రంగు అంటే వారికి నచ్చదు. అందుకే ద్రౌపదీ ముర్మును ఓడించాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? నల్లరంగులో ఉన్న శ్రీకృష్ణుడిని మనం పూజిస్తాం కదా’’ అని మోదీ అన్నారు.

అబద్ధాల మాస్టర్‌ కాంగ్రెస్‌

‘‘కాంగ్రెస్‌ అబద్ధాల మాస్టర్‌. ఈ అంశం తెలంగాణ ప్రజలకు తెలిసినట్లు వేరెవరికీ తెలియదు. ఆ పార్టీ అతిపెద్ద నేత జన్మదినం రోజున రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదు. ఇప్పుడు ఆ గడువును ఆగస్టు 15కు పొడిగించారు. అప్పటికి ఎన్నికలు అయిపోతాయి. తర్వాత చేతులెత్తేస్తారు. ఇది ప్రజలను దగా చేయడం కాదా? వేములవాడ రాజన్నపై ఒట్టు పెడతారు. మరోవైపు సనాతన ధర్మాన్ని తిడతారు. మరి వీళ్ల ఒట్లను ఎలా నమ్మాలి? తెలంగాణలో విద్యుత్‌ కోతలు ఎంతగా పెరిగాయంటే ప్రజల జీవనమే కష్టంగా మారింది. విశ్వాసఘాతుక కాంగ్రెస్‌ దేశాన్ని బలోపేతం చేస్తుందా? భారాస కాళేశ్వరం కుంభకోణానికి పాల్పడితే కాంగ్రెస్‌ ప్రభుత్వం రక్షించే ప్రయత్నం చేస్తోంది. భాజపా రైతులకే పెద్ద పీట వేస్తోంది. రాష్ట్రంలో పసుపు రైతులకోసం పసుపుబోర్డు ఏర్పాటు చేశాం. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించి యువతకు ఉద్యోగాలు, రైతులకు ఎరువులు అందించాం. కేంద్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం అంతరాయం కలిగిస్తోంది. వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్కు నడిపించే క్రమంలో ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంట్లో కూడా డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు.

రిజర్వేషన్లకు కోత విధించారు

ఇండి కూటమి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లలో కోత విధించి ముస్లింలకు ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. కర్ణాటకలో బీసీ రిజర్వేషన్లలో కోత విధించి ముస్లింలకు ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే హైకోర్టు రద్దు చేసింది. దాన్ని కాంగ్రెస్‌ సహించలేకపోయింది. అందుకే చట్టం చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లలో కోత విధించి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లింలకు ఇచ్చింది. రిజర్వేషన్లను ముస్లింలకు ఇచ్చేందుకు ఆరాటపడుతోంది తప్ప మాదిగ సమాజానికి న్యాయం చేసేందుకు మాత్రం మనసు రావడంలేదు. మాదిగ సమాజానికి న్యాయం చేసేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఇచ్చిన మాటను మరువలేదు. దాన్ని కచ్చితంగా నెరవేరుస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ సమాజంలో ప్రతిభావంతులైన యువత అభివృద్ధి చెందడం కాంగ్రెస్‌కు ఇష్టంలేదు. కేంద్ర ప్రభుత్వం సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌ దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. భారాసదీ అదే బాట. 2014లో భారాస.. దళితుణ్ని సీఎం చేస్తామని చెప్పి ఎవర్ని చేసిందో అందరికీ తెలుసు. దళితబంధు ఇస్తామని ఇవ్వకుండా మోసం చేసింది. బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా ముస్లింలకోసం ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

మోదీ కాదు.. చేసింది మీ ఓటు

పదేళ్లలో నా పనితీరు చూశారు. మీ ఒక్క ఓటుతో భారతదేశం విశ్వంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. రక్షణ పరికరాల దిగుమతుల దేశంగా ఉండేదల్లా ఇప్పుడు ఎగుమతుల దేశంగా మారింది. ఇవన్నీ మీ ఓటుతోనే సాధ్యమయ్యాయి.

మొదటిసారి భయపడుతున్న ఎంఐఎం

హైదరాబాద్‌లో మొదటిసారి ఎంఐఎం భయపడుతోంది. భాజపా దీటైన పోటీ ఇస్తోంది. కాంగ్రెస్‌, భారాసలు ఎంఐఎంను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రామమందిర నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించింది. ఈ సారి కాంగ్రెస్‌ను గెలిపిస్తే రామమందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని కోరతామని చెబుతోంది. కాంగ్రెస్‌ను ఓడించి రామమందిరాన్ని కాపాడుకుందాం. మే 13న జరిగే పోలింగ్‌లో కాంగ్రెస్‌, భారాసకు బుద్ధి చెప్పండి. కరీంనగర్‌లో బండి సంజయ్‌ గెలుపు ఎప్పుడో నిర్ణయమైంది. పార్టీ అభ్యర్థులు బండి సంజయ్‌, గోమాసె శ్రీనివాస్‌(పెద్దపల్లి), గోడం నగేశ్‌(ఆదిలాబాద్‌), అరూరి రమేశ్‌(వరంగల్‌), సీతారాంనాయక్‌(మహబూబాబాద్‌)లకు వేసే ఓటు నేరుగా మోదీకి చేరుతుంది. వరంగల్‌ ఎప్పుడూ భాజపాకు మద్దతుగా నిలుస్తోంది. భారాస, కాంగ్రెస్‌ గుప్పిట నుంచి వరంగల్‌ను బయటకు తీసుకురావాలి’’ అని మోదీ అన్నారు.


ఐదేళ్లపాటు అంబానీ, అదానీ అని విమర్శించిన కాంగ్రెస్‌ యువరాజు ఇప్పుడు ఎన్నికల వేళ ఎందుకు మాట్లాడటంలేదు? ఏం లావాదేవీలు జరిగాయి? ఎన్ని టెంపోల డబ్బు చేరింది?


భాజపా దేశానికి మొదటి ప్రాధాన్యం ఇస్తే భారాస, కాంగ్రెస్‌ మాత్రం కుటుంబాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తాయి. ఈ రెండు పార్టీలు ఒకే నాణేనికి బొమ్మా, బొరుసులాంటివి. తెలంగాణను ఈ రెండు పార్టీల నుంచి కాపాడుకోవాలి. 

ప్రధాని మోదీ


  • కాంగ్రెస్‌, భారాస రెండింటినీ కలిపేది అవినీతి. ఈ రెండు పార్టీలు కుటుంబం వల్ల, కుటుంబ చేత, కుటుంబం కోసం.. అనే నినాదంతో ముందుకు సాగుతాయి.
  • దేశంలో ఇప్పటి వరకు మూడు దశల పోలింగ్‌ ముగిసింది. మీ ఆశీర్వాదంతో ఎన్డీఏ దూసుకుపోతోంది. ఇండి కూటమి గెలిచే స్థానాల గురించి భూతద్దంలో చూసినా కనపడటంలేదు. నాలుగో దశలో జరిగే ఎన్నికల్లో అది గెలిచే సీట్ల కోసం వెదకాలంటే మైక్రోస్కోప్‌ కావాలి.

ప్రధాని మోదీ


రాష్ట్ర ఖజానా లూటీ అవుతోంది..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన ఉన్నంతకాలం తెెలంగాణ అభివృద్ధి స్తంభించిపోతుందని మోదీ అన్నారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పారు. తెలంగాణ ప్రజల సొమ్ము డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌ పేరుతో లూటీ అవుతోందని ఆరోపించారు. ‘డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌లో ఒక ఖాతా మొదటి ఆర్‌ది. రెండో ఖాతా మరో ఆర్‌ది.. ఆ సొమ్ము దిల్లీకి వెళ్తోంది. సంచలన చిత్రం ట్రిపుల్‌ ఆర్‌ వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తే డబుల్‌ ఆర్‌ వ్యవహారం నాలుగు నెలల్లో అంతకంటే ఎక్కువ వసూలు చేసింది’ అని ధ్వజమెత్తారు. ఇండి కూటమి అధికారంలోకి వస్తే దేశాన్ని ఏటీఎంగా మార్చుకుంటారని అన్నారు. దేశం, తెలంగాణ అభివృద్ధికి తనది గ్యారంటీ అని ప్రకటించారు.


నాడు పీవీని అవమానించిన కాంగ్రెస్‌

‘‘తెలంగాణ వచ్చిన వెంటనే భారాసపై నమ్మకంతో ప్రజలు గెలిపిస్తే ఆ పార్టీ తన కుటుంబం కోసం రాష్ట్రంలోని అన్ని కుటుంబాల కలలను చిదిమేసింది. కాంగ్రెస్‌దీ అదే చరిత్ర. దేశం మునిగినా పర్వాలేదు కానీ కుటుంబానికి ఎలాంటి నష్టం జరగకూడదని నమ్ముతుంది. ఫ్యామిలీ ఫస్ట్‌ అనే లక్ష్యంతోనే నాడు ప్రధాని పీవీని అవమానించింది. కనీసం ఆయన పార్థివ దేహాన్ని కాంగ్రెస్‌ కార్యాలయానికి తీసుకురానీయలేదు. పీవీకి ఎన్డీయే భారతరత్న ఇచ్చి గౌరవించింది. దేశ పరిపాలన తప్పుడు చేతుల్లోకి వెళ్ల కూడదు. అందుకే దేశమంతా మరోసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వం రావాలని అంటోంది. కాంగ్రెస్‌ పాలనలో జరిగిన కుంభకోణాలను దేశం మరచిపోలేదు. రాష్ట్రంలో నాలుగు నెలలకే రూ.వేలకోట్ల కుంభకోణాలు జరిగాయి’’ అని మోదీ అన్నారు.


పసివాడిని చూసి.. మోదీ మురిసే...

మామునూరు విమానాశ్రయం నుంచి ఓరుగల్లు జనసభకు వెళ్తూ లక్ష్మీపురంలో ఓ ఇంటి గేటు లోపల తల్లి చేతిలో ఉన్న బాలుడిని చూసిన ప్రధాని మోదీ తన వాహనాన్ని ఆపించారు. డోరు తెరిచి ఆమెను పిలిచి చిన్నారిని చేతుల్లోకి తీసుకుని ఆడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img