icon icon icon
icon icon icon

కేసీఆర్‌కు ఎంత పెద్ద శిక్ష వేసినా తప్పు లేదు!

‘అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ పార్టీ ఓడిపోతే ఎవరైనా బాధపడ్డారా? మద్యం కేసులో కవిత అరెస్ట్‌ అయితే అయ్యో పాపం అని ఎవరైనా అన్నారా? నేను వెయ్యి ఊళ్లలో అడిగినా.. వారి గురించి ఎవరూ బాధపడలేదు’ అని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

Updated : 09 May 2024 06:02 IST

ఆయన ఆడినన్ని అబద్ధాలు ఎవరూ ఆడరు..
త్వరలో 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి
జూన్‌ 5 తర్వాత వారి పేర్లు చెబుతా
మీట్‌ ది ప్రెస్‌లో మంత్రి కోమటిరెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ‘అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ పార్టీ ఓడిపోతే ఎవరైనా బాధపడ్డారా? మద్యం కేసులో కవిత అరెస్ట్‌ అయితే అయ్యో పాపం అని ఎవరైనా అన్నారా? నేను వెయ్యి ఊళ్లలో అడిగినా.. వారి గురించి ఎవరూ బాధపడలేదు’ అని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు ఎంత పెద్ద శిక్ష వేసినా తప్పు లేదని, ఆయన ఆడినన్ని అబద్ధాలు ప్రపంచంలో ఎవరూ ఆడలేదని వ్యాఖ్యానించారు. సోమేశ్‌కుమార్‌ లాంటి ఐదారుగురు అధికారులను రియల్‌ఎస్టేట్‌ దళారుల్లా పెట్టుకుని పాలన చేసి దోచుకున్నారని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పి.. హిందువుల ఓట్లు పొందాలని ప్రధాని మోదీ చూస్తున్నారని, గత పదేళ్లలో చేసిందేమీ లేక దేవుడి పేరు మీద ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో కోమటిరెడ్డి మాట్లాడారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఈ సమయంలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో.. రాష్ట్రంలో 14 లేదా 15 సీట్లను కాంగ్రెస్‌ గెలుస్తుందని చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే..

ఆర్‌ఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్‌ మార్చారు..

తన ఫాంహౌస్‌ ముందు నుంచి వెళ్లేలా రీజినల్‌ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఎలైన్‌మెంట్‌ను కేసీఆర్‌ మార్పించారు. నూతన సచివాలయ భవనంలో రూ.50 కోట్లు అయ్యే ఒక పనిని కేసీఆర్‌ మౌఖిక ఆదేశాలతో రూ.270 కోట్లతో చేశామని, బిల్లులు ఇవ్వమని ఇప్పుడు కాంట్రాక్టర్లు మా చుట్టూ తిరుగుతున్నారు. ఇలా ఎక్కడైనా ఉంటుందా? కేసీఆర్‌ కుటుంబ సభ్యులు ఇసుక, భూములు, మద్యంలో దోచుకున్నారు. మాజీ ఎంపీ సంతోష్‌ ఒక్క లైసెన్స్‌ పేరుతో పది మద్యం షాప్‌లు నడిపారు. కాళేశ్వరంలో, టానిక్‌ వైన్‌షాప్‌లలో ఆ కుటుంబం దోచుకున్న సొమ్మును కక్కిస్తాం.

 ఆ 11 ఎకరాలు వెనక్కు తీసుకుంటాం

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిశాక భారాస భవన్‌కు తాళం వేస్తారు. నాలెడ్జ్‌ సెంటర్‌ పేరుతో ఆ పార్టీకి కేసీఆర్‌ ప్రభుత్వం కోకాపేటలో కేటాయించిన 11 ఎకరాలు వెనక్కి తీసుకుంటాం. నేను రైతులను ఎప్పుడూ తిట్టలేదు. తిట్టినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. వచ్చే పదేళ్లు రేవంత్‌రెడ్డి సీఎంగా ఉంటారు. ఆయనను చూస్తుంటే పార్టీలో అందరినీ కలుపుకొని పనిచేసిన వైఎస్‌ గుర్తుకొస్తున్నారు. రేవంత్‌ ఇంటికి కార్యకర్తలు, సర్పంచి సహా ఎవరైనా నేరుగా వెళ్లవచ్చు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు ప్రగతిభవన్‌కు అప్పటి హోంమంత్రి వెళితే లోపలికి అనుమతి లేదని అక్కడున్న హోంగార్డు వెనక్కి పంపారు. వద్దంటున్నా ఇప్పటికే ముగ్గురు భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వచ్చారు. కాంగ్రెస్‌లో చేరే మరో 25 మంది ఎమ్మెల్యేల పేర్లను జూన్‌ 5 తరువాత చెబుతా. 25 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్‌ అంటున్నారు కదా.. ఆయన వారి పేర్లు చెప్పాలి. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో భారాస బీ ఫాం తీసుకున్న ఆరుగురు అభ్యర్థులు పోటీ విరమించుకుని.. కాంగ్రెస్‌లో చేరతామని నా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు వద్దని చెప్పా. నియోజకవర్గాల పునర్విభజనలో తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 154కు పెరుగుతాయి.

మోదీ పాలనలో ‘ఏఏ’ ట్యాక్స్‌

మరోసారి నరేంద్రమోదీ ప్రధాని అయితే శాశ్వతంగా ఆయనే ఆ పదవిలో ఉండేలా రాజ్యాంగాన్ని మారుస్తారు. పేదలకు డబ్బులు పంచుతానని చెప్పి గతంలో ఓట్లు అడిగిన మోదీ, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. హామీలు ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదు. ‘ఏఏ’ ట్యాక్స్‌ పేరుతో అదానీ, అంబానీలకు దోచిపెట్టారు. భువనగిరి కోట అభివృద్ధికి రూ.200 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అడిగితే, ఒక్క రూపాయి ఇవ్వలేదు. త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు.. కాంగ్రెస్‌కు ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క వార్డు మెంబర్‌ కూడా లేడు. ప్రస్తుత ఎన్నికల్లో మా పార్టీ అక్కడ ఒక్క సీటు కూడా గెలవదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img