icon icon icon
icon icon icon

ఐదు నెలల్లో పరిస్థితులు తారుమారు

 అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్‌ నేతలు అరచేతిలో వైకుంఠం చూపారని.. ప్రజలందర్నీ మోసపుచ్చి, అధికారం చేపట్టాక ఏ ఒక్క వాగ్దానమూ అమలు చేయలేదని భారాస అధినేత కేసీఆర్‌ ధ్వజమెత్తారు.

Published : 09 May 2024 06:13 IST

కాంగ్రెస్‌ ఏ వాగ్దానమూ అమలు చేయలేదు
మోదీ హయాంలో దేశ ప్రతిష్ఠ దెబ్బతింది
అందరం ఏకమై తెలంగాణను కాపాడుకుందాం
భారాస అధినేత కేసీఆర్‌ వ్యాఖ్యలు

నర్సాపూర్‌, పటాన్‌చెరు, దుండిగల్‌- న్యూస్‌టుడే:  అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్‌ నేతలు అరచేతిలో వైకుంఠం చూపారని.. ప్రజలందర్నీ మోసపుచ్చి, అధికారం చేపట్టాక ఏ ఒక్క వాగ్దానమూ అమలు చేయలేదని భారాస అధినేత కేసీఆర్‌ ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చింది. ఒక్క ఉచిత బస్‌ ప్రయాణం తప్ప ఏదీ నెరవేర్చలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన అయిదు నెలల్లోనే పరిస్థితులు తారుమారయ్యాయి’ అని కేసీఆర్‌ విమర్శించారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ప్రధాన కూడలిలో బుధవారం రాత్రి నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో, హైదరాబాద్‌ దుండిగల్‌ కమాన్‌ వద్ద, పటాన్‌చెరు కూడలిలో జరిగిన రోడ్‌ షోలలో కేసీఆర్‌ ప్రసంగించారు.

‘‘భారాస ప్రభుత్వ హయాంలో పుష్కలంగా మంచినీటిని సరఫరా చేశాం. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసుకునే పరిస్థితి నగర శివారు ప్రాంతాల్లో నెలకొంది. మేం జంటనగరాల్లో కరెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చాం. మంగళవారం కొద్దిపాటి వర్షానికే 6 నుంచి 10 గంటలపాటు కరెంట్‌ పోయింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని సాక్షాత్తు ప్రధాని మోదీ చెబుతున్నారు. అవినీతితో రాష్ట్ర పరువు పోతోంది. భూముల ధరలు తగ్గాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగం కుప్పకూలింది. పరిశ్రమలు తరలిపోతున్నాయి. రైతులకు నేను రూ.లక్ష మాఫీ చేస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి రూ.2 లక్షలు మాఫీ చేస్తా అన్నారు. ఎందుకు చేయలేదు. రైతు కూలీలకు ఏటా రూ.12,000 ఇస్తామన్నారు. వడ్లకు ఇస్తానన్న బోనస్‌ బోగస్‌ అయింది. ఎవరైతే పంట పండిస్తారో వారికే రైతు బంధు ఇస్తారట? రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు 12 మంది భారాస ఎంపీలను గెలిపించాలి. మెదక్‌, చేవెళ్ల, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానాలను భారాస కైవసం చేసుకుంటుంది.

తండాలను పంచాయతీలు చేశా..

నర్సాపూర్‌లో లంబాడాలు ఎక్కువ. నేను సీఎంగా ఉండగా తండాలను పంచాయతీలుగా చేశాను. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు తెచ్చింది నేనే. టీఎస్‌పీఎస్సీలో గ్రూప్‌-1 పరీక్షలు జరుగుతున్నాయి. హైకోర్టు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని రిజర్వేషన్లపై అభిప్రాయం అడిగింది. రాష్ట్రప్రభుత్వం బలంగా వాదించాల్సి ఉండగా పట్టించుకోవడంలేదు. లంబాడా పిల్లలకు 10 శాతం రిజర్వేషన్లు ఉండాలంటే కచ్చితంగా వెంకట్రామిరెడ్డి పార్లమెంట్‌కు వెళ్లాలి. మన తరఫున వాదించాలి. ఇందుకోసం గిరిజన లంబాడాలు భారాసను గెలిపించాలి. మేం ఉన్నపుడు పోడు భూములకు పట్టాలిచ్చాం. రైతు బీమా కూడా అందించాం. సమాజంలో ఏఒక్క వర్గం కోసమూ కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేయడం లేదు. అందుకోసం అందరం ఏకమై తెలంగాణను కాపాడుకోవాలి’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. రోడ్‌షోలలో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, చామకూర మల్లారెడ్డి, కేపీ వివేకానంద్‌, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, మెదక్‌, మల్కాజిగిరి పార్లమెంట్‌ భారాస అభ్యర్థులు, వెంకట్రామిరెడ్డి, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

గోదావరి, కృష్ణా జలాలు దక్కాలంటే..

అంతర్జాతీయ స్థాయిలో విశ్వగురు అని ప్రచారం చేసుకునే ప్రధాని మోదీ దేశ ప్రతిష్ఠను మంటగలిపారు. కేజ్రీవాల్‌, కవిత అరెస్ట్‌లపై అమెరికా నిరసన వ్యక్తం చేసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.84కి పడిపోయింది. దేశంలో ఎగుమతులు తగ్గి, దిగుమతులు పెరిగాయి. విదేశీమారక విలువ పడిపోయింది. పదేళ్లకాలంలో మోదీ 150 నినాదాలు ఇచ్చారు. అవేవీ అమలు కాలేదు. పాకిస్థాన్‌ పేరు చెప్పి ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా గమనించాలి. 400 మెగావాట్ల సీలేరు పవర్‌ ప్రాజెక్ట్‌ను మోదీ ఆంధ్రకు కట్టబెట్టారు. గోదావరి, కృష్ణా జలాలు తమిళనాడు, కర్ణాటకలకు తరలిస్తామంటున్నారు. గోదావరి, కృష్ణా జలాలు మనకు దక్కాలంటే భారాసకు లోక్‌సభ ఎన్నికల్లో మద్దతు తెలపాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img