icon icon icon
icon icon icon

రిజర్వేషన్లపై ప్రజలు వాస్తవాలను గుర్తించారు

భాజపాపై కాంగ్రెస్‌, భారాస చేస్తున్న వ్యతిరేక ప్రచారంలో వాస్తవాలను గుర్తించి ప్రజలు తమకు మద్దతుగా నిలుస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు.

Published : 09 May 2024 06:14 IST

అబద్ధాల ప్రచారంలో కల్వకుంట్ల కుటుంబానికి, రేవంత్‌కు ఆస్కార్‌ ఇవ్వొచ్చు
రైతుభరోసా ముందే ఎందుకు ఇవ్వలేదు: కిషన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: భాజపాపై కాంగ్రెస్‌, భారాస చేస్తున్న వ్యతిరేక ప్రచారంలో వాస్తవాలను గుర్తించి ప్రజలు తమకు మద్దతుగా నిలుస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. రిజర్వేషన్‌ లబ్ధిదారులే భాజపాపై విశ్వాసంతో మద్దతు పలుకుతున్నారని చెప్పారు. వాస్తవాలను గుర్తించారని పేర్కొంటూ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘‘వెనకబడిన వర్గాల నుంచి వచ్చిన మోదీ రిజర్వేషన్లను తొలగించరనే విశ్వాసం ప్రజల్లో ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా భాజపా భారీ మెజారిటీకి బాటలు వేస్తున్నారు. అత్యధిక స్థానాలు గెలవబోతున్నాం. రాష్ట్రంలో ఇప్పటివరకు కాంగ్రెస్‌, భారాసకు అధికారం ఇచ్చాం.. ఈసారి మెజారిటీ సీట్లు భాజపాకు ఇవ్వాలని ప్రజలు నిశ్చయించుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసహనానికి గురై మాట్లాడుతున్నారు. రైతుభరోసాను కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆపింది. ఎన్నికలు వస్తాయని ముందే తెలిసినా రైతుభరోసా ఎందుకివ్వలేదు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని డబ్బులు పంచినా భాజపా రాష్ట్రంలో రెôడంకెల సీట్ల మార్కు దాటడం ఖాయం. పాత్రికేయుల గురించి రేవంత్‌రెడ్డి దురుసుగా మాట్లాడడం ఆయన తీరుకు నిదర్శనం. ఆయనలో అభద్రతాభావం పెరిగిపోయి కేంద్ర ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానమంత్రి స్వయంగా రిజర్వేషన్లపై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని చెప్పినా దుష్ప్రచారం చేస్తున్నారు. అబద్ధాల ప్రచారంలో కల్వకుంట్ల కుటుంబానికి, రేవంత్‌కు ఆస్కార్‌ అవార్డు ఇవ్వొచ్చు. తెలంగాణకు యూరియా పరిశ్రమ తీసుకొస్తే, పేదల ఇళ్లకు వెలుగులు తీసుకొస్తే అది గాడిద గుడ్డులా కనబడుతోందా? శాం పిట్రోడా జాత్యంహకార వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజల ఆదరణ కోల్పోతుందని భావించినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడటం, అసహనాన్ని వెల్లడించడం సాధారణం అయిపోయింది’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రంలో మోదీ హవా.. మెజార్టీ సీట్లు మావే

ఆసిఫ్‌నగర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మోదీ హవా బలంగా ఉందని, భాజపా మెజార్టీ సీట్లు సాధించడం ఖాయమని ఆ పార్టీ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. నాంపల్లి నియోజకవర్గంలోని గుడిమల్కాపూర్‌, మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్‌ సహా పలు ప్రాంతాల్లో బుధవారం కిషన్‌రెడ్డి రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాంపల్లి నియోజకవర్గం అభివృద్ధికి తన బడ్జెట్‌ నుంచి రూ.10కోట్లు ఖర్చు చేశానని చెప్పారు. మోదీ ప్రధానిగా ఉంటే, ప్రపంచంలో భారత్‌ జోలికి ఎవరూ రారని.. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించారన్నారు. నైతిక స్థైర్యాన్ని కోల్పోయిన ప్రతిపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు యాదగిరిరెడ్డి, అన్నపురం రమేష్‌ కుమార్‌, పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img