icon icon icon
icon icon icon

కంటోన్మెంట్‌ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా

ఎన్నికల తర్వాత సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.

Updated : 09 May 2024 07:41 IST

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: ఎన్నికల తర్వాత సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సాయంత్రం ఆయన రెజిమెంటల్‌బజార్‌లో మల్కాజిగిరి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డి, కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ అభ్యర్థి శ్రీగణేశ్‌ తరఫున.. వారితో కలిసి ఎన్నికల ప్రచార ర్యాలీ, కార్నర్‌ మీటింగ్‌లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కంటోన్మెంట్‌ నియోజకవర్గానికి రానున్న కాలంలో ఏటా 6 వేల ఇళ్ల చొప్పున కేటాయించి, ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. భారాస, భాజపా ఒక్కటేనని.. అరెస్టయి జైల్లో ఉన్న బిడ్డను విడిపించుకునేందుకు భాజపాతో కేసీఆర్‌ కుమ్మక్కయ్యారని విమర్శించారు. నాలుగు నెలల కాలంలో తామిచ్చిన ఆరు గ్యారంటీల్లో 5 అమలు చేశామని, ఎన్నికల తర్వాత.. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వనివి కూడా నెరవేరుస్తామని అన్నారు. తెలంగాణకు రూ.9 లక్షల కోట్ల నిధులు కేంద్రం నుంచి తెచ్చామని కిషన్‌రెడ్డి అంటున్నారని, పన్నుల రూపంలో రూ.27 లక్షల కోట్లు తెలంగాణ నుంచి తీసుకున్న కేంద్రం కేవలం మూడో వంతు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. సునీతా మహేందర్‌రెడ్డిని, శ్రీగణేశ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నగరంలో పార్టీకి ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా రాలేదని, ఇప్పుడు శ్రీగణేశ్‌ గెలిస్తే రాష్ట్ర మంత్రి అవుతారని, సునీత గెలిస్తే.. కేంద్రంలో తమ ప్రభుత్వం వస్తే ఆమె కూడా కేంద్ర మంత్రి అవుతారని, దీంతో కంటోన్మెంట్‌ను ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img