icon icon icon
icon icon icon

కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ.. బయ్యారం స్టీల్‌ ఎక్కడ?: జైరాం రమేశ్‌

లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది.

Published : 09 May 2024 06:16 IST

ఈనాడు, దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీలను ఎందుకు ఏర్పాటు చేయలేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ బుధవారం ‘ఎక్స్‌’ ద్వారా ప్రశ్నించారు. జనగణన, కులగణన చేపట్టకుండానే ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేయడం ఎలా సాధ్యమని అడిగారు. ‘‘భాజపా కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని 2014 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోల్లో చెప్పినప్పటికీ మాట నిలబెట్టుకోలేదు. గతంలో ఈ ఫ్యాక్టరీ కోసం కేంద్రం రూ.40 కోట్లు విడుదల చేయగా, తెలంగాణ ప్రభుత్వం 60 ఎకరాల భూమి కేటాయించింది. 2016లో దేశంలో ఎక్కడా కోచ్‌ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేయబోవడంలేదని అప్పటి రైల్వేమంత్రి ప్రకటించారు. కానీ మహారాష్ట్రలో ఏర్పాటుచేశారు. కాజీపేటలో ఎలాంటి ప్లాంట్‌ నిర్మించబోవడంలేదని 2022 డిసెంబరులో కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. తర్వాత నెలకే అస్సాంలో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించింది. గత ఏడాది తెలంగాణ ఎన్నికల సమయంలో కేంద్రం తన మాటను వెనక్కి తీసుకొని కాజీపేటలో రైల్వేవ్యాగన్‌ ఓవర్‌హాలింగ్‌ ప్లాంట్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఏడాదైనా కార్యరూపం దాల్చలేదు. ఇటీవల ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించి మాదిగలకు న్యాయం చేస్తానని మోదీ అంటున్నారు. ఇప్పటివరకు దీనికోసం కమిటీ మాత్రం ఏర్పాటుచేయగలిగారు. ఇదే సమయంలో సామాజిక ఆర్థిక గణన ఆలోచనను తిరస్కరించారు. కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడానికి కట్టుబడి ఉంది’’ అని జైరాం రమేశ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img