icon icon icon
icon icon icon

పరిశోధనలో గెలిచారు.. ప్రజాక్షేత్రంలో నిలిచారు..

‘అమ్మో... రాజకీయాలా!! మాకు సరిపడవు. వాటిలోకి మేం దిగలేం’ అంటూ బాగా చదువుకున్న వారిలో ఎక్కువమంది గతంలో అనాసక్తి ప్రదర్శించే వారు.

Published : 11 Nov 2023 08:17 IST

అసెంబ్లీ బరిలో పది మంది డాక్టరేట్‌లు
ప్రస్తుత సభలో ఇద్దరే పీహెచ్‌డీలు

‘అమ్మో... రాజకీయాలా!! మాకు సరిపడవు. వాటిలోకి మేం దిగలేం’ అంటూ బాగా చదువుకున్న వారిలో ఎక్కువమంది గతంలో అనాసక్తి ప్రదర్శించే వారు. ‘‘విద్యావంతులు రాజకీయాలకు దూరంగా ఉంటే ఎలా? సమాజంలో గుణాత్మక మార్పు ఎలా సాధ్యం?’’ అంటూ ప్రజాస్వామ్యవాదులు తరచూ ప్రశ్నించేవారు. ఈ పరిస్థితి క్రమేణా మారుతోంది. ఉన్నత విద్యావంతులూ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు.

రాష్ట్రంలో గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో 37% మంది పీజీ పూర్తి చేసిన వారు కాగా.. ఇద్దరు పీహెచ్‌డీ పట్టాదారులు (గాదరి కిశోర్‌- తుంగతుర్తి, చెన్నమనేని రమేశ్‌- వేములవాడ) ఉన్నారు. వేములవాడ నుంచి గెలిచిన చెన్నమనేని రమేశ్‌కు ఈసారి టికెట్‌ దక్కలేదు. ప్రస్తుతం గాదరి కిశోర్‌ సహా పది మంది పీహెచ్‌డీ డాక్టరేట్‌లు వివిధ పార్టీల తరఫున పోటీ చేస్తున్నారు. వీరిలో అత్యధికులు ఉస్మానియా వర్సిటీ నుంచి డాక్టరేట్‌ పట్టాలు పొందారు. వారి వివరాలివీ..

  • భారాస నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి (జనగామ), గువ్వల బాలరాజు (అచ్చంపేట), గాదరి కిశోర్‌ (తుంగతుర్తి), బాల్క సుమన్‌ (చెన్నూరు), రసమయి బాలకిషన్‌ (మానకొండూరు)...
  • కాంగ్రెస్‌ నుంచి సీతక్క (ములుగు), సంపత్‌కుమార్‌ (అలంపూర్‌), కోట నీలిమ (సనత్‌నగర్‌), గద్దర్‌ కుమార్తె జీవీ వెన్నెల (కంటోన్మెంట్‌) పీహెచ్‌డీ పట్టాదారులుగా తాజా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
  • ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయశాస్త్ర విభాగంలో సహాయ ఆచార్యురాలైన గుమ్మడి అనూరాధ ఇల్లెందు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.
  • సీతక్క, సంపత్‌కుమార్‌, బాల్క సుమన్‌, గువ్వల బాలరాజు, రసమయి బాలకిషన్‌లు గత ఎన్నికల్లో పీహెచ్‌డీ అభ్యర్థులుగా తలపడగా.. ఈసారి పీహెచ్‌డీ పట్టాదారులుగా పోటీలో నిలిచారు. 

అభ్యర్థులు.. వారి పీహెచ్‌డీ సబ్జెక్టులు..

పల్లా రాజేశ్వర్‌రెడ్డి భౌతికశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. బాలరాజు- ప్రజాస్వామ్యంలో చట్టసభల అధికారాలపై, గాదరి కిశోర్‌- తెలంగాణ రాష్ట్ర సాధనలో మీడియా పాత్రపై, రసమయి బాలకిషన్‌- తెలంగాణ మలివిడత పోరాటంలో సాంస్కృతిక ఉద్యమంపై, బాల్క సుమన్‌- ఆంగ్ల భాషపై పరిశోధన పట్టాలు అందుకున్నారు.

సీతక్క- గుత్తికోయల ఆర్థిక, సామాజిక పరిస్థితులపై, సంపత్‌కుమార్‌- మేనేజ్‌మెంట్‌ రంగంలో, నీలిమ- భారత్‌లో ఎన్నికలు-సంస్కరణలపై (దిల్లీ జేఎన్‌యూ నుంచి) పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. వెన్నెల.. మహిళా సాధికారత అంశంపై పరిశోధన పూర్తి చేశారు.

 ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img