Hyderabad vs Lucknow: 10 ఓవర్లలోపే విజయం.. నమ్మలేకపోతున్నా: కెప్టెన్‌ కమిన్స్‌

లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ ఘన విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యాన్ని వికెట్లేమీ కోల్పోకుండా కేవలం 9.4 ఓవర్లలోనే ఛేదించింది.   

Published : 09 May 2024 09:33 IST

హైదరాబాద్‌: లఖ్‌నవూ బ్యాటర్లు అపసోపాలు పడ్డ పిచ్‌పై హైదరాబాద్‌ (SRH) బ్యాటర్లు దుమ్ములేపారు. ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌ (89*: 30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు), అభిషేక్‌ శర్మ (75*: 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) లఖ్‌నవూ బౌలింగ్‌ను ఉచకోత కోశారు. వీరి విశ్వరూపంతో ఉప్పల్‌ స్టేడియం బౌండరీలతో మోతమోగిపోయింది. 166 పరుగుల లక్ష్యం కేవలం 9.4 ఓవర్లలోనే కరిగిపోయింది. దీంతో హైదరాబాద్‌ 10 వికెట్ల తేడాతో లఖ్‌నవూను చిత్తుచేసి ప్లే ఆఫ్స్‌నకు మరింత చేరువైంది.

మ్యాచ్‌ అనంతరం ఈ విజయంపై కెప్టెన్‌ కమిన్స్‌ (Pat Cummins) మాట్లాడాడు. ‘‘ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్ తమ ఆటతో పిచ్‌ స్వరూపాన్నే పూర్తిగా మార్చేశారు. వారి స్వేచ్ఛకు మేము అడ్డుచెప్పలేదు. ఆ ఇద్దరు ఆటగాళ్లుకు ఎంతో పాజిటివ్‌ దృక్పథం ఉంది. వారు ఎలా ఆడాలో, ఆడకూడదో ఒక బౌలర్‌గా నేను సలహాలు ఇవ్వలేను. హెడ్‌ గత రెండేళ్లుగా కష్టసాధ్యమైన పిచ్‌లపై విజృంభిస్తున్నాడు. విలువైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఇది సాధారణ విషయం కాదు. అభిషేక్‌ శర్మ అద్భుత ఆటగాడు. స్పిన్‌, పేస్‌ ఏ బౌలింగ్‌లోనైనా ఆడగలడు. కేవలం ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఔట్‌సైడ్‌ సర్కిల్‌లో ఉండే పవర్ ప్లే సమయంలో బౌలర్లు వీరిని ఎదుర్కోవడం కష్టంతో కూడుకున్న పని. వికెట్లు పడకుండా బ్యాటర్లు చెలరేగుతున్నప్పుడు నిజంగా వారు ఎన్ని పరుగులు సాధిస్తారని చెప్పడం కష్టమే. ఈ ఇద్దరు బ్యాటర్లకు ఇది అద్భుతమైన సీజన్‌గా చెప్పవచ్చు. 10 ఓవర్లలోపే మ్యాచ్‌ను ముగించడం.. నమ్మశక్యం కాని విధంగా ఉంది’’ అని కమిన్స్ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని