India Economic Superpower: 21వ శతాబ్దపు ఆర్థిక శక్తిగా భారత్‌.. మోదీ, అంబానీ, అదానీ కీలక పాత్ర: సీఎన్‌ఎన్‌

India Economic Superpower: రాబోయే కొన్ని దశాబ్దాల్లో భారత్‌ ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని సీఎన్‌ఎన్‌ కథనం పేర్కొంది. దీంట్లో ప్రధాని మోదీతో పాటు అంబానీ, అదానీ కీలక పాత్ర పోషించనున్నారని తెలిపింది.

Updated : 09 May 2024 10:42 IST

వాషింగ్టన్‌: భారత్‌ 21వ శతాబ్దపు ఆర్థిక శక్తిగా (India Economic Superpower) అవతరించనుందని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘సీఎన్‌ఎన్‌’ పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థను రూపుదిద్దడంలో ప్రధానమంత్రి మోదీ (PM Modi), పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ (Mukesh Ambani), గౌతమ్‌ అదానీ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపింది. ఈ మేరకు బుధవారం ఓ సవివర కథనాన్ని ప్రచురించింది.

‘‘చైనాకు ప్రత్యామ్నాయంగా పెట్టుబడిదారులు భారత్‌ను చూస్తున్నారు. తద్వారా మెరుగైన వృద్ధితో పాటు సరఫరా వ్యవస్థల్లో నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయని భావిస్తున్నారు. అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు మోదీ ప్రభుత్వం రోడ్లు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వేల నిర్మాణాన్ని ప్రారంభించింది. అందుకోసం రూ.లక్షలాది కోట్లు వెచ్చిస్తోంది. రోజువారీ, వాణిజ్య కార్యకలాపాల్లో డిజిటల్‌ అనుసంధానతను ప్రోత్సహిస్తోంది. ఈ ప్రయాణంలో అంబానీ, అదానీ (Gautam Adani) కీలక భాగస్వాములుగా మారారు. ఫలితంగా రాబోయే కొన్ని దశాబ్దాల్లో ఆర్థిక శక్తిగా భారత్‌ అవతరించడంలో ఈ ముగ్గురూ కీలక పాత్ర పోషిస్తున్నారు.

‘‘ఈ క్రమంలో దేశంలో అంబానీ, అదానీ పలుకుబడి పెరిగింది. ఈ ధోరణి ఇతర దేశాల పారిశ్రామికీకరణ సమయంలోనూ కనిపించింది. వీరిద్దరినీ జర్నలిస్టులు అమెరికా తొలి బిలియనీర్‌ జాన్‌ డీ రాక్‌ఫెల్లర్‌తో పోలుస్తున్నారు. ఉభయుల వ్యాపార ఆశయాలు భారత ప్రభుత్వ వాతావరణ లక్ష్యాలతో కలిశాయి. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల మధ్య సాన్నిహిత్యం దేశ వృద్ధికి సహకరిస్తోందని కొందరు నిపుణులు చెబుతున్నారు’’ అని సీఎన్‌ఎన్‌ పేర్కొంది.

భారత్ మరిన్ని పరిశ్రమలను, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సీఎన్‌ఎన్‌ అభిప్రాయపడింది. ప్రతి నెలా వేలాది మంది కొత్తగా శ్రామిక శక్తిలో కలుస్తున్నారని తెలిపింది. వీరందరికీ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రస్తుతం ఉన్న కంపెనీల సామర్థ్యం సరిపోదని విశ్లేషించింది. టాటా గ్రూప్‌ వంటి బడా వ్యాపార సంస్థలు సైతం భారత్‌లో ఉన్నాయని గుర్తుచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని