icon icon icon
icon icon icon

ఎన్నికల జోరు... గాలి మోటార్ల హోరు

ఎన్నికల్లో హెలిక్యాప్టర్ల వినియోగం ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు.. లేదంటే జాతీయ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులకు మాత్రమే పరిమితమనేది ఒకప్పటి మాట.

Updated : 21 Nov 2023 14:23 IST

లక్షెట్టిపేట (మంచిర్యాల), న్యూస్‌టుడే: ఎన్నికల్లో హెలిక్యాప్టర్ల వినియోగం ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు.. లేదంటే జాతీయ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులకు మాత్రమే పరిమితమనేది ఒకప్పటి మాట. ప్రస్తుతం ఎన్నికల్లో ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలకు గాలిమోటారు వినియోగం సర్వసాధారణంగా మారింది. జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ముఖ్య నాయకులు తమ ఎన్నికల ప్రచారానికి వీటిని వినియోగిస్తున్నారు. రోజుకు మూడు నుంచి అయిదు ప్రాంతాలను చుట్టుముడుతూ ఆయా ప్రదేశాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు.

 ఎన్నికల్లో ఏ పార్టీ అయినా గెలుపునకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సాధారణంగా ఏ పార్టీలో అయినా చరిష్మా ఉండి ఓటర్లను ప్రభావితం చేయగల నాయకులు ఒకరిద్దరు మాత్రమే ఉంటారు. ఉన్న తక్కువ సమయంలో వారు రోడ్డుమార్గం ద్వారా ఎక్కువ సభల్లో పాల్గొనడం సాధ్యం కాదన్న విషయాన్ని గుర్తించిన పార్టీలు స్టార్‌ క్యాంపెయినర్ల ప్రచారం కోసం ఎన్నికలకు ముందస్తుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఒక్కో పార్టీ కనీసం రెండు చొప్పున హెలిక్యాప్టర్లను ఎన్నికల ప్రచారం కోసం సమకూర్చుకుంటుండటం విశేషం. వీటికి అయ్యే ఖర్చు అభ్యర్థుల ఖాతాల్లో కాకుండా పార్టీ ఖాతాలో జమ అవుతుంది.

ఎప్పుడో అరుదుగా చూసే హెలిక్యాప్టర్లు ఎన్నికల పుణ్యమా అని తరచూ కనిపిస్తుండటంతో వాటిని చూసేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో ల్యాండ్‌ అయ్యే అవకాశం ఉండటంతో భద్రత దృష్ట్యా రోడ్డు మార్గంలో ప్రయాణించేందుకు వీలు లేని అటవీ ప్రాంతాల్లో నాయకులు హెలిక్యాప్టర్లలో తరలివచ్చి ప్రచారాలు నిర్వహిస్తున్నారు.  

వరుస కడుతున్న పార్టీలు

భారాస అధినేత కేసీఆర్‌ గాలిమోటారులో రాష్ట్రాన్ని చుట్టి వస్తున్నారు.  ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు రెండు విడతల్లో ఆరు నియోజక వర్గాలను ఆయన చుట్టుముట్టారు. భారాస ముఖ్య నాయకులు కేటీఆర్‌, హరీశ్‌రావులు కూడా వినియోగిస్తూ తమ ప్రచారాన్ని సాగిస్తున్నారు.

ఇక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తన ముమ్మర ప్రచారంలో భాగంగా హెలిక్యాప్టర్‌నే వినియోగిస్తున్నారు. ఆదిలాబాద్‌, ఉట్నూరు, బెల్లంపల్లిల్లో ఆయన ఇప్పటి వరకు ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌గా ఆయన హెలిక్యాప్టర్‌ వినియోగిస్తుండగా ఆ  పార్టీ జాతీయ నాయకులైన రాహుల్‌, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే లాంటి నాయకులు వినియోగిస్తుండటం గమనార్హం.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌లు గాలిమోటార్ల ద్వారా తమ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు. బండి సంజయ్‌ ఇప్పటికే జన్నారం, సిర్పూరులో  నిర్వహించిన ఎన్నికల సభకు హెలిక్యాప్టర్‌లో వచ్చారు. ఉమ్మడి జిల్లాలో త్వరలో జరగనున్న ప్రచార సభల్లో పాల్గొననున్న భాజపా జాతీయ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి  అమిత్‌షాతో పాటు వివిధ భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల  పర్యటన సందర్భంగా గాలిమోటార్ల ద్వారానే సాగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img