icon icon icon
icon icon icon

మళ్లీ మంత్రిస్తారా?

ఒకరిది వరుసగా ఏడోసారీ గెలవాలన్న పట్టుదల... మరొకరిది ఈసారైనా నెగ్గాలన్న తపన... మరి లక్ష్మీనరసింహ ధర్మపురవాసులు ఎవరిని కరుణిస్తారో?

Updated : 15 Nov 2023 09:32 IST

ఒకరిది వరుసగా ఏడోసారీ గెలవాలన్న పట్టుదల... మరొకరిది ఈసారైనా నెగ్గాలన్న తపన... మరి లక్ష్మీనరసింహ ధర్మపురవాసులు ఎవరిని కరుణిస్తారో? కత్తిలాంటి పోటీలో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన కరీంనగరం ఎవరిని ఎత్తుకుంటుందో? కప్పలతక్కెడ రాజకీయంలోనూ సూర్యాపేటలో ప్రత్యర్థులు మారలేదు. అలుపెరగని ఈ వీరుల దంగల్‌ ఈసారి ఎలాంటి తీర్పునిస్తుందో? ఉమ్మడి కరీంనగర్‌, నల్గొండ మంత్రుల సమరాంగణాలపై విశ్లేషణ...

ఉత్కంఠగా ధర్మపురి.. విజయం ఈశ్వరుడిదా లక్ష్మణుడిదా?

స్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ 2004, 2008(ఉప ఎన్నిక)లో మేడారం నుంచి... 2009, 2010(ఉప ఎన్నిక), 2014, 2018లలో ధర్మపురి నుంచి వరుసగా ఆరుసార్లు గెలుపొందారు. మరోసారి విజయంపై కన్నేశారు. ఇదేస్థానంలో వరుసగా నాలుగుసార్లు ఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఈసారైనా గెలుపు దక్కించుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగారు. ఇక్కడ 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థిపై 441 ఓట్ల తేడాతోనే కొప్పుల విజయం సాధించారు. నాలుగు పర్యాయాలుగా వీరి మధ్య ఓట్ల వ్యత్యాసం తక్కువగానే ఉంటోంది. ఫలితంగా ఈసారి ప్రజలను తమవైపు తిప్పుకోవడానికి ఇద్దరూ శతథా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు భాజపా నుంచి ఎస్సీ మోర్చా జాతీయ నాయకుడు  ఎస్‌.కుమార్‌ సత్తా చాటడానికి సిద్ధపడ్డారు.

ప్రభుత్వ పథకాలపై విశ్వాసం

నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడటంతోపాటు నిత్యం ప్రజల మధ్యే ఉన్న తనను ఓటర్లు ఏడోసారి కూడా గెలిపిస్తారని కొప్పుల ఈశ్వర్‌ నమ్మకంగా ఉన్నారు. గోదావరిపై నిర్మించిన 16 ఎత్తిపోతల పథకాలు, ఎస్సారెస్పీ మెయిన్‌ కెనాల్‌ నుంచి అనుబంధ కాలువలను తవ్వించి వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలవడం, ధర్మపురి ఆలయానికి నిధులు తేవడం, పట్టణాల సుందరీకరణ... ఇలా ఎన్నో అభివృద్ధి పనులను ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. నియోజకవర్గంలోని 32 వేల మందికి సీఎం సహాయనిధిని అందించానని, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులూ తనవైపే ఉంటారని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల వైఖరిపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నించడంతో జనం నుంచి వ్యతిరేకత వచ్చింది. వెంటనే ఆ ప్రతిపాదనను విరమించుకున్నా... ఆయా పరిణామాలు ఈశ్వర్‌కు కొంత    ప్రతికూలంగా మారొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.


‘ఒక్క ఛాన్స్‌’ అంటూ ప్రచారం

రుసగా నాలుగుసార్లు ఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ప్రతిసారీ స్వల్ప మెజారిటీతో ఓటమి పాలవవుతుండడంతో ప్రజల్లో తనపై కొంత సానుభూతి ఉందని విశ్వాసంగా ఉన్నారు. దానికితోడు కాంగ్రెస్‌ ఆరు హామీలను జనంలోకి బలంగా తీసుకెళ్లడానికి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఎక్కువగా విమర్శలు చేస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే, కాంగ్రెస్‌లో ఒక వర్గాన్ని మాత్రమే ఎక్కువగా ప్రోత్సహిస్తారనే ఆరోపణలు లక్ష్మణ్‌కు ప్రతికూలంగా మారే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


పాత ప్రత్యర్థులతో 14 ఏళ్ల తర్వాత ఢీ

ర్మపురి నుంచి 2009లో పోటీ చేసిన ఎస్‌.కుమార్‌ ఆరు వేల పైచిలుకు ఓట్లను దక్కించుకున్నారు. 14 ఏళ్ల తర్వాత మరోసారి పాత ప్రత్యర్థులతో తలపడుతున్నారు. గతంలో పెద్దపల్లి ఎంపీ పదవికి పోటీ చేసిన అనుభవం ఉండటంతో ప్రచారం గట్టిగానే చేస్తున్నారు. యువ ఓటర్ల మద్దతు కూడగట్టడంపై దృష్టిసారించారు. కేంద్ర పథకాలతో ప్రజలకు చేకూరిన లబ్ధిని వివరిస్తున్నారు. స్థానికేతరుడు కావడం, భాజపాలో నాయకుల మధ్య సమన్వయ లేమి కుమార్‌కు ప్రతికూలంగా మారొచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది.

2018లో ఫలితం..

  • భారాస (కొప్పుల ఈశ్వర్‌): 70,579 ఓట్లు  
  • కాంగ్రెస్‌ (అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌): 70,138
  • స్వతంత్ర (కుంతల నర్సయ్య): 13,114
  • భాజపా (కన్నం అంజయ్య): 5,256

ఈనాడు, కరీంనగర్‌


కరీంన‘గరం... గరం’.. గంగుల X బండి

రాజకీయ చైతన్యమున్న కరీంనగర్‌ గడ్డపై అసెంబ్లీ పోరు ఆసక్తి రేపుతోంది. మంత్రి గంగుల కమలాకర్‌(భారాస) నాలుగోసారి గెలిచి తన పట్టు నిలుపుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే గంగుల చేతిలో 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయిన ఎంపీ బండి సంజయ్‌(భాజపా)... తొలిసారి గెలిచి శాసనసభకు వెళ్లడానికి ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగిన పురుమళ్ల శ్రీనివాస్‌ సైతం సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. నియోజకవర్గ పరిధిలో కరీంనగర్‌ కార్పొరేషన్‌తోపాటు కొత్తపల్లి, కరీంనగర్‌ గ్రామీణ మండలాలున్నాయి. నగర ఓటర్ల చేతిలోనే అభ్యర్థుల భవిత ఆధారపడి ఉండటం, ముగ్గురూ ఒకే సామాజిక వర్గానికి  చెందిన వారు కావడంతో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు.

ప్రగతి మంత్రమే ఫలితమిస్తుందని...

రాష్ట్ర ప్రభుత్వ ప్రగతి పనులు, సంక్షేమ పథకాలే తన గెలుపు మంత్రంగా గంగుల కమలాకర్‌ ప్రచారం కొనసాగిస్తున్నారు. కరీంనగర్‌లో ఐటీ టవర్‌ ఏర్పాటు, తీగల వంతెన నిర్మాణం, రహదారుల సుందరీకరణ, నగరాభివృద్ధిని ప్రధాన ఎజెండాగా చూపుతూ ప్రజల్లోకి వెళుతున్నారు. భారాస మ్యానిఫెస్టోపైనా గట్టి నమ్మకంగా ఉన్నారు. ఎంఐఎం మద్దతు ప్రకటించడంతో ముస్లిం ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. గంగుల కుటుంబ సభ్యులకు ఈడీ నోటీసులు, పార్టీలోని ద్వితీయశ్రేణి నాయకుల వైఖరిపై ప్రజల్లో వ్యతిరేకత మంత్రికి కొంత ప్రతికూలంగా మారే అవకాశముందని భావిస్తున్నారు. ఈసారి కొత్త వారికి అవకాశమివ్వాలనే ప్రచారాన్ని ప్రత్యర్థులు ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళుతున్నారు.


యువత, సానుభూతి గెలిపిస్తాయని...

క్కడ రెండుసార్లు ఓడిపోయిన బండి సంజయ్‌ మూడోసారి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పార్టీ  స్టార్‌ క్యాంపెయినర్‌గా పలు జిల్లాలకు హెలికాప్టర్‌లో వెళ్లి ప్రచారం సాగిస్తూనే... ఉదయం, సాయంత్రం వేళల్లో కరీంనగర్‌ ప్రజలను కలుస్తున్నారు. యువత, మహిళా ఓట్లపై బండి గురిపెట్టారు. రైల్వే ప్రాజెక్టులు, హైవేల విస్తరణ, స్మార్ట్‌ సిటీ కోసం రూ.8వేల కోట్లను కేంద్రం నుంచి తెచ్చినట్లు ప్రచారంలో చెబుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కోల్పోయాక వచ్చిన సానుభూతి తనను గెలిపిస్తుందని విశ్వసిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న సంజయ్‌... నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజలకు మాత్రం దూరంగా ఉంటున్నారనే విమర్శలున్నాయి. తమను పట్టించుకోవడంలేదనే ఆరోపణలతో కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు, పలువురు కార్పొరేటర్లు భాజపాను వీడడం కొంతవరకు ప్రతికూలంగా మారొచ్చని విశ్లేషకులు అంటున్నారు.


నాకూ అవకాశం ఇవ్వండి

రీంనగర్‌ సమీపంలోని బొమ్మకల్‌ మేజర్‌ పంచాయతీ సర్పంచిగా ఉన్న పురుమళ్ల శ్రీనివాస్‌ భారాసను వీడి కాంగ్రెస్‌ టికెట్‌ పొందారు. ఆయన భార్య జడ్పీటీసీ సభ్యురాలు. గ్రామీణ   మండలంతోపాటు నగరంలో తమకున్న పలుకుబడితో పార్టీ ఆరు గ్యారంటీలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సంజయ్‌కి ఎంపీగా, గంగులకు ఎమ్మెల్యేగా అవకాశమిచ్చారని... తనకూ ఒక్క ఛాన్స్‌ ఇచ్చి చూడాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అయితే... కొత్త అభ్యర్థి కావడంతో సీనియర్లను కలుపుకొని పోవడం సవాల్‌గా మారింది. ఆయనపై గతంలో భూకబ్జా ఆరోపణలతో కేసులు నమోదవడం కొంత ప్రతికూలంగా మారొచ్చనే అభిప్రాయముంది.

గత ఎన్నికల్లో ఇలా...

  • భారాస (గంగుల కమలాకర్‌): 80,983 ఓట్లు
  • భాజపా (బండి సంజయ్‌ కుమార్‌): 66,009
  • కాంగ్రెస్‌ (పొన్నం ప్రభాకర్‌): 39,500

ఈనాడు, కరీంనగర్‌


సూర్యాపేట హోరాహోరీ.. మూడోసారీ ఆ ముగ్గురే..

నైజాం కాలం నుంచీ ఉద్యమ నేపథ్యమున్న సూర్యాపేట... ఈసారి ఆసక్తికర ఎన్నికల పోరుకు సిద్ధమైంది. వరుసగా మూడోసారి అదే అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రెండుసార్లు గెలిచి తొమ్మిదిన్నరేళ్లుగా మంత్రిగా పనిచేస్తున్న జగదీశ్‌రెడ్డితో కాంగ్రెస్‌ నుంచి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, భాజపా నుంచి సంకినేని వెంకటేశ్వరరావు తలపడుతున్నారు. 2014 నుంచీ ఇక్కడ ఈ ముగ్గురే ప్రత్యర్థులుగా ఉండటం విశేషం. 2018లో, ప్రస్తుతం కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన పటేల్‌ రమేశ్‌రెడ్డి ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ (ఏఐఎఫ్‌బీ) తరఫున పోటీ చేస్తున్నారు. ఇటీవల వరకూ భారాసలో కీలకంగా వ్యవహరించిన నల్గొండ డీసీఎంఎస్‌ మాజీ ఛైర్మన్‌ వట్టే జానయ్యయాదవ్‌ బీఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. వీరిద్దరూ ఏయే వర్గాల ఓట్లను ఎంతమేర చీల్చుతారనేది ఇక్కడ కీలకంగా మారింది.

ఆ రెండే మంత్రి నినాదాలు

సూర్యాపేటను జిల్లా కేంద్రంగా చేయడంతో పాటు పట్టణంలో రూ.7 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు జగదీశ్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యకళాశాల, కలెక్టరేట్‌, జిల్లా పోలీసు కార్యాలయం, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణం, రహదారుల సుందరీకరణ తదితర అభివృద్ధి పనులను గతంతో పోలుస్తూ ఓట్లు అడుగుతున్నారు. పట్టణంతో పాటు నియోజకవర్గంలోని మూడు మండలాలైన ఆత్మకూరు(ఎస్‌), చివ్వెంల, పెన్‌పహడ్‌లలో ఒక దశ ప్రచారాన్ని పూర్తిచేశారు. రెండు మండలాల్లో ఎక్కువగా ఉన్న గిరిజనులను ఆకట్టుకొనే దిశగా వ్యూహాలు అమలుచేస్తున్నారు. కాంగ్రెస్‌లో అసమ్మతి వర్గం బరిలో ఉండటం.. పట్టణంలో తటస్థ ఓటర్లు గత ఎన్నికల్లో తనకు సానుకూలంగా ఉండగా.. ఈ దఫా కూడా కలిసివస్తారని అంచనా వేస్తున్నారు. అయితే రెండో శ్రేణి నాయకులు, పట్టణంలోని కొందరు కౌన్సిలర్లపై ప్రజల్లో అసంతృప్తి ఉండటం, నియోజకవర్గ ప్రజలకు మంత్రి నిత్యం అందుబాటులో ఉండకపోవడం కొన్ని ప్రతికూలతలు.


ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్‌ హామీలతో..

ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్‌ పార్టీ గ్యారంటీలపై మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి నమ్మకం పెట్టుకున్నారు. ఈ దఫా తాను చివరిసారి బరిలో ఉంటున్నానని, తప్పకుండా గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. నిరుద్యోగులకు  ప్రభుత్వం అన్యాయం చేసిందని, అన్ని వర్గాలకూ న్యాయం చేయలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. మూడు మండలాల్లో సంస్థాగతంగా పార్టీ బలంగా ఉండటం దామోదర్‌రెడ్డికి కలిసొచ్చే అంశం. గత ఎన్నికల్లోనూ మూడు గ్రామీణ మండలాల్లోనే ఆయనకు అత్యధిక ఓట్లు వచ్చాయి. అయితే పార్టీ టికెట్‌ ఆశించి భంగపడిన రమేశ్‌రెడ్డి ఏఐఎఫ్‌బీ తరఫున పోటీ చేస్తుండడం, పట్టణంలో ఓటర్లు కాంగ్రెస్‌ హయాంలో జరిగిన దాడులు, గొడవలపై అసంతృప్తిగా ఉండటం ప్రతికూల అంశాలు.


అమిత్‌షా సభతో సంకినేని జోరు

ప్రధాని మోదీ హయాంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతున్నాయో చెబుతూ భాజపా అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు ప్రచారం నిర్వహిస్తున్నారు. తొలి జాబితాలోనే ఆయనకు పార్టీ టికెట్‌ ప్రకటించడం, కేంద్ర మంత్రి అమిత్‌షా సూర్యాపేటలో సభ నిర్వహించడంతో ఢీ అంటే ఢీ అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి పట్టు లేకపోవడం కొంత ఇబ్బందికరం.

2018లో ఓట్లు ఇలా..

  • భారాస (జగదీశ్‌రెడ్డి): 68,650
  • కాంగ్రెస్‌ (దామోదర్‌రెడ్డి): 62,683
  • భాజపా (వెంకటేశ్వరరావు): 39,240

ఈనాడు, నల్గొండ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img