icon icon icon
icon icon icon

KTR - Harish Rao: కేటీఆర్‌-హరీశ్‌ మెజారిటీ పోటీ

సంచలనం, అనూహ్యంలాంటివేమైనా జరిగితే తప్పించి... తెలంగాణ ఎన్నికల్లో విజేతలు ముందే ఖాయమైన నియోజకవర్గాలుగా చెప్పగలిగినవి ... సిరిసిల్ల, సిద్దిపేట! కేటీఆర్‌, హరీశ్‌రావులు గెలుస్తారా అని కాకుండా ఎంత మెజార్టీ సాధిస్తారనేదే అసలు ప్రశ్న!

Updated : 17 Nov 2023 07:34 IST

సంచలనం, అనూహ్యంలాంటివేమైనా జరిగితే తప్పించి... తెలంగాణ ఎన్నికల్లో విజేతలు ముందే ఖాయమైన నియోజకవర్గాలుగా చెప్పగలిగినవి ... సిరిసిల్ల, సిద్దిపేట! కేటీఆర్‌, హరీశ్‌రావులు గెలుస్తారా అని కాకుండా ఎంత మెజార్టీ సాధిస్తారనేదే అసలు ప్రశ్న! ఇంకా చెప్పాలంటే... వీరిద్దరి మధ్యా కనిపించని ఓ ఆసక్తికర పోటీ ఉంది. అదే ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుందని? భారాస సర్కారుకు రెండు చక్రాల్లాంటి కేటీఆర్‌, హరీశ్‌ల నియోజకవర్గాలపై విశ్లేషణ...

అగ్గిపెట్టెలో పట్టే ఆరు గజాల చీరను నేసిన ఘనత సిరిసిల్లది. ‘సిరిశాల’ అనే కుగ్రామం నుంచి నేడు జిల్లా కేంద్రంగా అవతరించింది. చేనేత, మరనేత వస్త్రోత్పత్తులకు నిలయమిది. ఈ నియోజకవర్గం నుంచి 2009, 2010(ఉప ఎన్నిక), 2014, 2018 ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధిస్తున్న కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్‌)... మరోసారి భారీ గెలుపుపై దృష్టిపెట్టారు.

2009 ఎన్నికల్లో భారాస(అప్పటి తెరాస) తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగిన కేకే మహేందర్‌రెడ్డి... కేటీఆర్‌(KTR)కు గట్టి పోటీ ఇచ్చారు. కేవలం 171 ఓట్ల వ్యత్యాసంతోనే ఓడిపోయారు. తర్వాత 2010 ఉప ఎన్నికల నుంచి వరుసగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా మహేందర్‌రెడ్డి పోరాడుతున్నారు. తొలి పోటీలో స్వల్ప మెజారిటీతో గెలుపొందిన కేటీఆర్‌... 2010లో 68 వేలు.. 2014లో 53,004... 2018లో 89,009 ఆధిక్యంతో కేకేపై గెలిచారు. మరోసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన కేకే గెలుపు కోసం శ్రమిస్తున్నారు. తరచూ అభ్యర్థులను మారుస్తున్న భాజపా.. ఈసారి రాణిరుద్రమను పోటీలో నిలిపి సత్తా చాటాలనుకుంటోంది.


సాయం అడిగితే చాలు..

మంత్రిగా, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేటీఆర్‌... నియోజకవర్గ కష్టసుఖాలను ఎప్పుడూ పట్టించుకుంటారని, సాయం అడిగితే చాలు పరిష్కరించడానికి ముందుంటారనే పేరుంది. నియోజకవర్గంలో ఏ కార్యక్రమమైనా హాజరవుతారు. గ్రామాల్లో పర్యటించినప్పుడు స్థానికుల కష్టసుఖాలను తెలుసుకుని, తన అనుచరులతో వారి సమస్యలను పరిష్కరించేలా చొరవ చూపుతారు. ఏదైనా సమస్యను సోషల్‌ మీడియా ద్వారా మంత్రి దృష్టికి తీసుకెళ్లినా... వెంటనే స్పందిస్తారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తూ నియోజకవర్గాన్ని తొమ్మిదిన్నరేళ్లలో ఆదర్శంగా నిలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దశల వారీగా అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌, మల్కపేట జలాశయాల నుంచి తంగళ్లపల్లి, ముస్తాబాద్‌, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాలకు సాగునీటిని తీసుకొచ్చారు. నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో సంక్షేమ శాఖలకు అవసరమైన వస్త్రోత్పత్తుల ఆర్డర్లను సింహభాగం ఇక్కడి మరమగ్గాల పరిశ్రమకు కేటాయిస్తున్నారు. మరమగ్గాల ఆధునికీకరణతోపాటు కార్మికులకు ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంగా అవతరించడం, మెడికల్‌, నర్సింగ్‌ కళాశాలలు రావడం, పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు కేటీఆర్‌పై సానుకూలతను పెంచాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు, కిందిస్థాయి కార్యకర్తల మధ్య సయోధ్య లేకపోవడం కొంత ప్రతికూలంగా మారే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.


సానుభూతి, కాంగ్రెస్‌ హామీలపై ఆశలు

ముస్తాబాద్‌ మండలం నామాపూర్‌కు చెందిన కేకే మహేందర్‌రెడ్డి లాయర్‌గా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్‌ వెంట నడిచారు. వరుస ఓటముల కారణంగా ఆయనపై ప్రజల్లో కొంత సానుభూతి ఉందనే అభిప్రాయం ఉంది. అన్నివర్గాల వారితో సన్నిహిత అనుబంధముంది. క్షేత్రస్థాయిలో వారందరి మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సానుభూతితోపాటు కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు తనని గట్టెక్కి స్తాయనే విశ్వాసంతో ప్రచారం చేస్తున్నారు. బూత్‌స్థాయిలో ఓట్లను రాబట్టుకోవడంలో పటిష్ఠమైన వ్యవస్థ లేకపోవడం ప్రతికూలాంశం.


కేంద్ర పథకాలపై ప్రచారం చేస్తూ...

వరంగల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన రాణిరుద్రమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో జర్నలిస్టుగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను అధ్యయనం చేశారు. తొలుత వైకాపాలో, తర్వాత యువ తెలంగాణలో, 2022లో భాజపాలో చేరారు. ఏడాది క్రితం సిరిసిల్ల నియోజకవర్గ పాలక్‌గా పనిచేసిన అనుభవం... పార్టీ పెద్దల మద్దతుతో ఇక్కడి అభ్యర్థిగా బరిలోకి దిగారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రచారంలో ఎండగడుతున్నారు. భాజపాలో సమన్వయలేమి కనిపిస్తుండటంతో నియోజకవర్గంలోని కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు భారాసలో చేరారు. మరికొందరు తటస్థంగా ఉండడం కూడా రాణిరుద్రమ ఓట్లను రాబట్టడంపై ప్రభావం చూపొచ్చు.


గత ఎన్నికల్లో ఆధిక్యం 89,009

సిరిసిల్ల ఓటర్లు..

మొత్తం: 2,44,426
పురుషులు: 1,19,663
మహిళలు: 1,24,756
యువ ఓటర్లు: 1,14,072
బీసీ ఓటర్లు: 55 శాతంపైగా

2018 ఫలితమిలా...

భారాస (కె.తారకరామారావు): 1,25,213 ఓట్లు
కాంగ్రెస్‌ (కేకే మహేందర్‌రెడ్డి): 36,204
భాజపా (మల్లుగారి నర్సాగౌడ్‌): 3,243


ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల


సిద్దిపేట నియోజకవర్గం..

అక్కడ ప్రత్యర్థులకు గత ఎన్నికల్లో డిపాజిట్లు దక్కలేదు. 1985 నుంచి కేసీఆర్‌.. 2004 ఉప ఎన్నిక నుంచి ఆయన మేనల్లుడు హరీశ్‌రావు వరుసగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అది. దాదాపు 38 ఏళ్లుగా వారికి కంచుకోటగా ఉన్న స్థానం. అదే సిద్దిపేట.. ఇక్కడ మూడు ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు డబుల్‌ హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసిన రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు(Harish Rao).. ప్రస్తుతం ఏడోసారి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ పోలైన ప్రతి పది ఓట్లలో దాదాపు 8 ఆయనకే పడగా.. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ (1,18,699) సిద్ధించింది.

ఇప్పుడు మరోసారి రికార్డు మెజారిటీపై హరీశ్‌రావు దృష్టిసారించారని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రత్యర్థులుగా కాంగ్రెస్‌ నుంచి విద్యార్థి ఉద్యమ నేపథ్యమున్న పూజల హరికృష్ణ, భాజపా అభ్యర్థిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి బరిలో నిలిచారు. గట్టి పోటీ ఇవ్వాలనే లక్ష్యంతో వీరిద్దరూ కృషి చేస్తున్నారు.


ప్రజలతో మమేకం..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నా.. వారంలో మూడు రోజులు నియోజకవర్గంలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండడం హరీశ్‌రావు ప్రత్యేకతగా విశ్లేషకులు చెబుతున్నారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటుతో పాటు నియోజకవర్గానికి రైలు సదుపాయం, రంగనాయకసాగర్‌ జలాశయం నిర్మాణం, స్వచ్ఛబడి, ఆధునిక రైతుబజారు, సమీకృత విపణి, ఐటీ హబ్‌, కోమటిచెరువు మినీ ట్యాంక్‌బండ్‌ తదితర అభివృద్ధి పనులు హరీశ్‌ హయాంలో సాకారమయ్యాయి. రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దారని పేరుంది. పార్టీలో ముఖ్యనాయకుడిగా.. స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉన్న హరీశ్‌రావు.. ప్రస్తుత ఎన్నికల్లో ఇప్పటివరకూ ఇక్కడ ప్రత్యక్షంగా ప్రచారం చేపట్టలేదు. ఆయన తరఫున పార్టీ శ్రేణులే ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నాయి. వంద ఓటర్లకు ఒకరు చొప్పున పార్టీ యువ, సీనియర్‌ నాయకులకు హరీశ్‌రావు బాధ్యత అప్పగించారు. ఇప్పటికే పలు గ్రామాలు, వివిధ కుల, ఇతరత్రా సంఘాలు మద్దతుగా నిలుస్తామంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి.


ఆరు హామీలతో ఆకర్షించే యత్నం

కాంగ్రెస్‌ అభ్యర్థి పూజల హరికృష్ణ పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గతంలో ఎన్‌ఎస్‌యూఐ మెదక్‌ జిల్లా అధ్యక్షుడిగా, యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 25 ఏళ్లుగా కాంగ్రెస్‌తో అనుబంధం కొనసాగిస్తున్నారు. ఇక్కడ 1985కు ముందు హస్తం హవా నడిచింది. గ్రామాల్లో పార్టీకి ఒకప్పటి సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. వీరిని ఆకట్టుకోవడంలో కాంగ్రెస్‌ అభ్యర్థులు సఫలం కావడంలేదనే విమర్శలున్నాయి. అందులోనూ ఇప్పుడు భారాసకు కంచుకోటగా మారిన సిద్దిపేటలో హరీశ్‌రావు వంటి నాయకుడిని ఢీకొట్టడం కాంగ్రెస్‌ అభ్యర్థికి సవాలే! పార్టీ ప్రకటించిన ఆరు హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓటర్లను ఆకర్షించే దిశగా హరికృష్ణ ప్రచారం చేస్తున్నారు. ఒక్క అవకాశమివ్వాలని అభ్యర్థిస్తున్నారు.


ప్రభావాన్ని చాటేందుకు..

భాజపా నుంచి దూది శ్రీకాంత్‌రెడ్డి మొదటిసారి బరిలో దిగారు. న్యాయవిద్యను అభ్యసించిన ఆయన 1996 నుంచి విద్యార్థి నేతగా ఏబీవీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, ఇతరత్రా హోదాల్లో పనిచేశారు. భారాస హవా ఉన్నా.. 2016లో సిద్దిపేట మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా గెలుపొందారు. 2020 నుంచి భాజపా జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థి, ప్రజా సమస్యలపై ఉద్యమించడం ఆయనకున్న సానుకూలత. ప్రధానంగా యువతను తనవైపు తిప్పుకోవడంపై దృష్టిసారించారు. కేంద్రంలోని భాజపా చేస్తున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమాన్ని, రాష్ట్రంలో అమలవుతున్న వివిధ పథకాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాను వివరిస్తున్నారు.


గత ఎన్నికల్లో ఆధిక్యం 1,18,699

యువ ‘సిద్ధి’పేట

మొత్తం ఓటర్లు: 2,33,733
పురుషులు: 1,15,346
మహిళలు: 1,18,317
యువత: 1.20 లక్షలు
బీసీలు: 55 శాతానికి పైగా..

2018లో ఫలితం

భారాస (హరీశ్‌రావు): 1,31,295 ఓట్లు
తెజస (భవానీరెడ్డి): 12,596
భాజపా (నరోత్తంరెడ్డి): 11,266


న్యూస్‌టుడే, సిద్దిపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img