KL Rahul: మాటలు రావట్లేదు.. అలాంటి బ్యాటింగ్‌ టీవీల్లోనే చూశాం: కేఎల్ రాహుల్

హైదరాబాద్‌ ఓపెనర్ల పవర్‌ హిట్టింగ్‌ చూశాక.. లఖ్‌నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా అభినందించకుండా ఉండలేకపోయాడు. మ్యాచ్‌ను క్షణాల్లోనే తమ నుంచి లాగేసుకున్నారని పేర్కొన్నాడు. 

Updated : 09 May 2024 11:28 IST

ఇంటర్నెట్ డెస్క్: లఖ్‌నవూపై హైదరాబాద్ ఓపెనర్లు విజృంభించారు. అలవోకగా సిక్స్‌లు, ఫోర్లు కొట్టిన తీరును అందరూ అభినందిస్తున్నారు.ప్రత్యర్థి కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోయాడు. మ్యాచ్‌ ఫలితంపై ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదని.. ఇదంతా అభిషేక్ శర్మ, ట్రావిస్‌ హెడ్ అద్భుత నైపుణ్యమని కేఎల్ వ్యాఖ్యానించాడు.

‘‘ఇది అసాధారణమైన బ్యాటింగ్‌ నైపుణ్యం ఉంటేనే సాధ్యమవుతుంది. ప్రతి బంతి బ్యాట్‌కు మిడిల్‌లోనే తాకింది. ఆ ఇద్దరి స్కిల్స్‌ ఉన్నతంగా ఉన్నాయి. అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. పదాలు దొరకడం లేదు. మనం ఇలాంటి బ్యాటింగ్‌ను టీవీల్లోనే చూసి ఉంటాం. ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవించాం. సిక్స్‌లు కొట్టేందుకు చాలా శ్రమించి ఉంటారు. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్‌ నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. హైదరాబాద్‌ ఓపెనర్లు మాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. ఎక్కడ బంతి వేసినా భారీ హిట్టింగ్‌ చేయడమే లక్ష్యంగా ఆడారు. వారిని అడ్డుకోవడం మా వల్ల కాలేదు. ఓడిపోవడంతో చాలా విషయాలు చర్చకొస్తాయి. కనీసం మేం 50 పరుగులు  తక్కువగా చేశామనిపించింది. పవర్‌ ప్లేలో త్వరగా వికెట్లను కోల్పోవడం నష్టం చేసింది. బదోనీ, నికోలస్‌ పూరన్ పోరాటంతో ఈ మాత్రం స్కోరునైనా సాధించగలిగాం. మేం 240 పరుగులు చేసినా వారు ఛేదించేవారేమో’’ అని కేఎల్ వ్యాఖ్యానించాడు. 

అది సరిపోలేదు: లఖ్‌నవూ కన్సల్టెంట్ ఆడమ్‌ వోగ్

‘‘ఇప్పుడు మేం ఉన్న పరిస్థితుల్లో ప్రత్యర్థి బ్యాటర్లను అభినందించడం తప్ప ఏం చేయలేం. పది బంతుల్లో ఒకటి లేదా రెండింటిని హిట్టింగ్‌ చేస్తే ఫర్వాలేదు. కానీ, ప్రతి బాల్‌ను సిక్స్‌గానో ఫోర్‌గానో కొట్టేద్దామని వచ్చే వారిని అడ్డుకోవడం చాలా కష్టం. మా ఆటగాళ్లతో మ్యాచ్‌ ఫలితంపై ఇంకా చర్చించలేదు. తొలి బంతి నుంచే మా బౌలర్లపై తీవ్ర ఒత్తిడి ఉంది. బ్యాటింగ్‌లో మేం త్వరగా వికెట్లను కోల్పోయాం. ఆయుష్, పూరన్ భాగస్వామ్యంతో 165 పరుగులు చేశాం. వారి దూకుడు ముందు ఇవి సరిపోలేదు’’ అని వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని