Air India Express: ఉద్యోగులకు ఏఐఎక్స్‌ షాక్‌.. 25 మంది తొలగింపు.. మిగిలిన వారికి అల్టిమేటం

AI Express: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ఉద్యోగుల మూకుమ్మడి సెలవు వ్యవహారం తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. కంపెనీ 25 మందిని తొలగించింది. మిగిలిన వారికి అల్టిమేటం జారీ చేసింది.

Updated : 09 May 2024 11:47 IST

దిల్లీ: క్యాబిన్‌ సిబ్బందిలో 25 మందిని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express) తొలగించింది. మిగిలిన వారు గురువారం సాయంత్రం 4 గంటల్లోగా విధుల్లో చేరాలని అల్టిమేటం జారీ చేసింది. లేదంటే అందరినీ తొలగిస్తామని హెచ్చరించింది.

300 మంది ఉద్యోగుల మూకుమ్మడి అనారోగ్య సెలవుతో విమానాలు రద్దయిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. కంపెనీ (Air India Express) మరింత మందిని తొలగించే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. సెలవులో ఉన్న సిబ్బందితో సంస్థ ప్రతినిధులు నేడు సమావేశమయ్యే అవకాశం ఉందని తెలిపాయి. ఈరోజు దాదాపు 60 సర్వీసులను రద్దు చేశారు.

ముందస్తు ప్రణాళికలో భాగంగానే మూకుమ్మడి సెలవుపై వెళ్లినట్లు స్పష్టంగా అర్థమవుతోందని 25 మందికి పంపిన తొలగింపు లేఖలో కంపెనీ (Air India Express) పేర్కొంది. దీని వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపింది. సంస్థ ప్రతిష్ఠకూ నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఇది పూర్తిగా సంస్థ నిబంధనలకు విరుద్ధమని వెల్లడించింది. అందువల్లే చర్యలు తీసుకోవాల్సి వస్తోందని వివరణ ఇచ్చింది.

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో (Air India Express) ఏఐఎక్స్‌ కనెక్ట్‌ విలీన ప్రక్రియ మొదలైనప్పటి నుంచి క్యాబిన్‌ సిబ్బందిలోని ఒక వర్గం అసంతృప్తిగా ఉంది. ఉద్యోగులతో కంపెనీ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని 300 మంది క్యాబిన్‌ సిబ్బందికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఏఐఎక్స్‌ఈయూ) ఆరోపించింది. కొత్త ఒప్పందంలో భాగంగా తక్కువ వేతనం ఉన్న ఉద్యోగాలను ఇవ్వటంతో పాటు సిబ్బంది మొత్తాన్ని సమానంగా చూడడం లేదని పేర్కొంది. సంస్థలో మొత్తం 1,400 మంది క్యాబిన్‌ సిబ్బంది ఉన్నారు. వీరిలో 500 మంది సీనియర్‌ లెవెల్‌ ఉద్యోగులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు