icon icon icon
icon icon icon

Indrakaran reddy: నిర్మల్‌ ఖ్యాతి నిలబెడతా

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నిర్మల్‌ ప్రాంతానికి రాజకీయ క్షేత్రమనే పేరుంది. మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేరు తెర మీదకొస్తుంది. స్వరాష్ట్రమైన తర్వాత రెండుమార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ముచ్చటగా మూడోసారి బరిలో నిలిచారు.

Updated : 20 Nov 2023 07:18 IST

ఉమ్మడి జిల్లాలో ఘనమైన అభివృద్ధి చేశాం..
‘ఈనాడు’తో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నిర్మల్‌ ప్రాంతానికి రాజకీయ క్షేత్రమనే పేరుంది. మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేరు తెర మీదకొస్తుంది. స్వరాష్ట్రమైన తర్వాత రెండుమార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ముచ్చటగా మూడోసారి బరిలో నిలిచారు. శాసనసభ్యుడిగా, రాష్ట్రమంత్రిగా ఆయన చేసిన అభివృద్ధి.. ప్రస్తుతం ఓటర్ల నుంచి ఆయన కోరుకుంటున్నదేమిటి? ప్రత్యర్థులెవరు అనేదానిపై ఇంద్రకరణ్‌రెడ్డితో ‘ఈనాడు’ ప్రత్యేక ముఖాముఖి.

ఈటీవీ- ఆదిలాబాద్‌

ఈనాడు: మరోసారి విజయం సాధిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడానికి మీరేం చేస్తారు.?

మంత్రి: నిర్మల్‌ మున్సిపాల్టీలో భూగర్భ డ్రైనేజీని పనులు చేపడతాం. ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేస్తాం. బీడీ కార్మికలకు ప్రత్యేకమైన జీవనోపాధి కోసం పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తా. కేరళ రాష్ట్రం మాదిరిగా గల్ఫ్‌ వెళ్లేవారు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూస్తాం. స్థానికంగానే వివిధ అంశాలపై  ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తాం. ఉపాధికి గ్యారెంటీ ఇవ్వాలనే ప్రణాళిక ఉంది.

ఈ: ఒకప్పుడు మీది-కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీహరిరావుది గురుశిష్యుల అనుబంధం. ఇప్పుడు ప్రత్యర్థులు. మీ స్పందన ఏమిటి?

మంత్రి: రాజకీయ వైరుధ్యాలే తప్పితే మా మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బందుల్లేవు. యువజ కాంగ్రెస్‌ నాయకుడిగా ఎదిగేలా నేనే ప్రొత్సహించాను, పదవులు ఇప్పించాను. ఎమ్మెల్యే కావాలనే ఆయన ఆలోచన తప్పు కాదు. భారాస రెండుసార్లు టిక్కెట్టు ఇచ్చింది ఓడిపోయారు. అందుకనే నాకు టిక్కెట్టు ఇచ్చింది. నియోజకవర్గానికి ఎవరో ఒకరు ఎమ్మెల్యే అవుతారు. అందరు కాదు. ఆయన కాంగ్రెస్‌లో చేరారు. నెనెలాంటి వ్యక్తినో ప్రజలకు తెలుసు. వాళ్లే నిర్ణయిస్తారు.

ఈ: సుదీర్ఘకాలంగా ప్రజాజీవితంలో ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తుంటే మీరు బాధపడిన క్షణాలేమైనా ఉన్నాయా?

మంత్రి: (నవ్వుతూ) రోజూ బాధేస్తుంది. ఒకప్పటికీ రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు చాలా తేడా ఉంది. కొంతమంది నాయకుల్లో గ్రామం, మండలం, జిల్లా, సమాజ హితం కనిపించడంలేదు. మనతో ఉన్నవారే ఇతరులతో జతకడుతున్నారు. స్వార్థం, వ్యక్తిగతంగా నాకేం లాభమనే భావన పెరిగింది.

ఈనాడు: ఉమ్మడి జిల్లాలో మీరు చేసిన ప్రధాన అభివృద్ది పనులు ఏమిటి?

మంత్రి: ఉమ్మడి ఆదిలాబాద్‌ నాలుగు జిల్లాలుగా ఏర్పడిన తర్వాత అన్ని ప్రాంతాలను అభివృద్ధికి ఎమ్మెల్యేల సమన్వయంతో పనిచేశా. కుమురం భీం జిల్లా జోడేఘాట్‌లో రూ.25 కోట్లతో మ్యూజియం ఏర్పాటు చేశాం. అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా అర్బన్‌ పార్కులు ఏర్పాటు చేశాం. ఇటీవల అర్హులైన గిరిజనులకు పోడు పట్టాలు అందించాం. బాసర అభివృద్ధికి రూ.వంద కోట్ల నిధులు మంజూరు చేశాం. విద్యుత్తు సబ్‌స్టేషన్లు, పట్టణాల సుందరీకరణ, రహదారులు, మురుగు కాలువల నిర్మాణం వంటి ఎన్నో పనుల చేపట్టాం.

ఈ: కొత్త జిల్లా తీసుకురావడం, వైద్యకళాశాల ఏర్పాటు చేయడమనేది అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా జరిగిన ప్రభుత్వపరమైన అంశాలే కదా. అందులో మీపాత్ర ఉందంటారా?

మంత్రి: ఎందుకులేదు. అడగనిదే ఏ పని కాదు. నిర్మల్‌ జిల్లా అవుతుందని ఎవరైనా ఊహించారా? వైద్యకళాశాల వస్తుందని అనుకున్నారా? ముందుగా అనుకున్నదాని ప్రకారమైతే ఆదిలాబాద్‌, మంచిర్యాల జిల్లాలే ఏర్పడేవి. మా ముఖ్యమంత్రి మానవతావాది. ప్రజల కోసం ఏది అడిగినా కాదనరు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అర్థం చేసుకుని అడగగానే జిల్లా ఇచ్చారు. అందులో నా పాత్ర ఉన్నట్లే కదా.

ఈనాడు: తెలంగాణ స్వరాష్ట్రమైన తర్వాత మిమ్మల్ని నిర్మల్‌ నియోజకవర్గ ప్రజలు రెండుసార్లు గెలిపించారు. మిమ్మల్నే మూడోసారి ఎందుకు గెలిపించాలంటారు?

మంత్రి: రెండుసార్లు నన్ను గెలిపించిన నిర్మల్‌ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు. నాపైన నమ్మకంతో గెలిపించిన ప్రజల ఆశలకు అనుగుణంగా నిర్మల్‌ ఖ్యాతిని పెంచాను. అభివృద్ధిలోనూ అగ్రగామిగానే నిలిపాను. కలలో కూడా ఊహించని రీతిలో జిల్లా చేసేలా ప్రయత్నం చేశా. కొత్తగా వైద్యకళాశాల ఏర్పాటు చేశా. అందుకే మూడోసారి కూడా నాకే ఓట్లు వేస్తారనే విశ్వాసం ఉంది.

ఈ: నిర్మల్‌ జిల్లాలో మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు? భాజపానా, కాంగ్రెస్సా?

మంత్రి: జిల్లాలో అమలుచేసిన సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూస్తే మాకు రెండు పార్టీలు ప్రత్యర్థులు కావు.  ప్రసంగాలను చేయడం, ప్రజలను నమ్మించడంలో కొన్ని పార్టీలు ముందున్నాయి. రాష్ట్రంలో భారాసకు అక్కడక్కడ కొంతవరకు కాంగ్రెస్‌ నుంచి పోటీ ఉంటే నిర్మల్‌ నియోజకవరర్గంలో కొంత భాజపా ఉంటుంది. కాంగ్రెస్‌ ప్రభావం అసలు ఉండదు. రాష్ట్రంలోనైనా, నిర్మల్‌లోనైనా ముమ్మాటికీ గెలుపు భారాసదే. మూడోసారి ప్రభుత్వం ఏర్పడి కేసీఆర్‌ హ్యాట్రిక్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img