icon icon icon
icon icon icon

Vemula prashanth reddy: అభివృద్ధి పనులే మళ్లీ గెలిపిస్తాయి

బాల్కొండ నియోజకవర్గం నుంచి మంత్రి వేముల  ప్రశాంత్‌రెడ్డి రెండు పర్యాయాలుగా శాసనసభకు ఎన్నికయ్యారు. తొలి దఫా గెలిచాక ‘మిషన్‌ భగీరథ పథకం’ వైస్‌ ఛైర్మన్‌గా పనిచేశారు.

Updated : 20 Nov 2023 09:27 IST

బాల్కొండ నియోజకవర్గానికి అదనపు నిధులు తీసుకొచ్చా
ఈనాడుతో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

ఈనాడు, నిజామాబాద్‌ : బాల్కొండ నియోజకవర్గం నుంచి మంత్రి వేముల  ప్రశాంత్‌రెడ్డి రెండు పర్యాయాలుగా శాసనసభకు ఎన్నికయ్యారు. తొలి దఫా గెలిచాక ‘మిషన్‌ భగీరథ పథకం’ వైస్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. రెండోసారి గెలిచి మంత్రిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం మూడోసారి ఎన్నికల బరిలో ఉన్నారు. తన గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తన విజయానికి దోహదం చేస్తాయంటున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రచార సందర్భంలో ప్రజలకు ఏం చెబుతున్నారు, వారి నుంచి ఆదరణ ఎలా ఉందనే విషయాలు ‘ఈనాడు’ ముఖా ముఖిలో  వెల్లడించారు.

ప్రజాప్రతినిధిగా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు?

నియోజకవర్గంలో వందశాతం బీటీ రోడ్లు నిర్మించాం. 80 శాతం రహదారులను రెండు వరుసల రోడ్లుగా మార్చాం. రూ.2 వేల కోట్లతో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పూర్తి చేశాం. భూగర్భ జలాల వృద్ధి కోసం రూ.150 కోట్లతో 24 చెక్‌డ్యామ్‌లు నిర్మించాం. ఎనిమిది మండల కేంద్రాల్లో సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్ల నిర్మాణం జరిగింది. భీమ్‌గల్‌ను మున్సిపాలిటీగా చేసి రూ.100 కోట్లతో అభివృద్ధి చేయిస్తున్నా. బస్‌ డిపోను పునరుద్ధరించాం. గ్రామాల్లో సిమెంటు రోడ్లకు రూ.100 కోట్లు కేటాయించాం. సామాజిక భవనాలు నిధులు కేటాయించాం. భీమ్‌గల్‌కు అదనంగా బాల్కొండలో మరొక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేశాం.

యువత భవిత కోసం ఏం చేశారు?

ఈ ప్రాంతం నుంచి గల్ఫ్‌ దేశాలకు పనుల కోసం వెళ్తుంటారు. అలాంటి వారికి వృత్తి నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి కల్పించడానికి మోర్తాడ్‌లో న్యాక్‌ ‘నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌’ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. వేల్పూర్‌లో ఒక స్టేడియం ఉండగానే.. అదనంగా కమ్మర్‌పల్లిలో మరొకటి నిర్మించాం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఉచిత శిక్షణ, మెటీరియల్‌ సమకూర్చాను. మోర్తాడ్‌, భీమ్‌గల్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ప్రత్యేక చొరవతో బాల్కొండకు మరొకటి మంజూరు చేయించాను. పది వేల మంది యువతకు శిరస్త్రాణలు పంపిణీ చేశాను. డ్రైవింగ్‌ లైసెన్సులు ఇప్పించాను.

ఈనాడు : జిల్లా  అభివృద్ధిలో  చూపిన చొరవ ఏంటి?

మంత్రి : రహదారులు, భవనాలశాఖ మంత్రిగా రూ.2500 కోట్లు మంజూరు చేసి రోడ్లు అభివృద్ధి చేయించాను. ఏళ్ల తరబడి తీరని సమస్యగా ఉన్న నిజామాబాద్‌లోని మాధవనగర్‌ ఆర్వోబీ నిర్మాణానికి రూ.63 కోట్లు మంజూరు చేశాం. జిల్లా యువతకు ఉపాధి శిక్షణ కోసం రూ.15 కోట్లతో నిజామాబాద్‌ నగరంలో న్యాక్‌ సంస్థ ఏర్పాటు చేశాం. నిజామాబాద్‌ నగరంలో రూ.60 కోట్లతో కళాభారతి నిర్మిస్తున్నాం. కరోనా సందర్భంలో జిల్లా ఆసుపత్రుల్లో సేవలు పెంచేందుకు ఎప్పటికప్పుడు     అధికారులతో సమీక్షలు నిర్వహించి మందులు, ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉంచాం.

మళ్లీ గెలిస్తే ఏం చేస్తారు?

ప్రభుత్వ పరంగా ఆసరా, బీడీ పింఛన్లు రాని వారికి మంజూరు చేయిస్తాను. 8 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాం. అర్హులై ఉండి రానివారు ఉంటే న్యాయం చేస్తాం. కొత్త రేషన్‌ కార్డుల మంజూరుకు కృషి చేస్తా. స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి 6 వేల గృహలక్ష్మి యూనిట్లను ఇప్పటికే మంజూరు చేశాం. మరో    10 వేల యూనిట్ల మంజూరుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వీటితో పాటు లింబాద్రిగుట్ట దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తాం. చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి సాగునీటి పథకానికి స్టీల్‌ పైపులు ఏర్పాటు చేస్తాం. బాల్కొండ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా మారుస్తాం. వేల్పూర్‌లో జూనియర్‌ కళాశాల మంజూరు చేయిస్తాను.

మీకు సంతృప్తినిచ్చిన పనులు ఏమైనా ఉన్నాయా?

నా స్నేహితుల ద్వారా విరాళాలు సేకరించి.. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేశాను. శస్త్రచికిత్సల విభాగం, ఆక్సిజన్‌ ప్లాంట్లు నిర్మించాం. నా సొంతంగా అంబులెన్సును కొనుగోలు చేసి ప్రభుత్వానికి అందించాను. భీమ్‌గల్‌ ప్రాంతానికి 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయించాను. రాష్ట్ర సచివాలయం, ఎత్తయిన అంబేడ్కర్‌ విగ్రహం, అమరవీరుల స్తూపం నిర్మాణాల పర్యవేక్షణ బాధ్యతల్లో పాలుపంచుకొనే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నాను.

ప్రచారంలో ఏం చెబుతున్నారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది?

ముఖ్యమంత్రికి ఇంటి మనిషిగా ఉండే నేను.. ప్రత్యేక శ్రద్ధతో నియోజకవర్గంలో చేసిన పనులు, అందించిన సంక్షేమ పథకాల గురించి చెబుతున్నా. మోసపూరిత మ్యానిఫెస్టోలతో మభ్యపెట్టేందుకు వస్తున్న ప్రతిపక్షాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని చెబుతున్నాం. ఇక్కడ అభివృద్ధి ఆగొద్దంటే కేసీఆర్‌ను గెలిపించాలి. మా పనులు గుర్తించిన జనం మద్దతుగా నిలుస్తామని భరోసా ఇస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img