Chennai Vs Punjab: చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్‌ను కొనసాగిస్తుందా.. ప్లేఆఫ్స్‌ బెర్తు ఖరారు చేసుకుంటుందా?

ఐపీఎల్‌లో ఇవాళ పంజాబ్‌తో సొంతమైదానం చెపాక్‌ వేదికగా చెన్నై తలపడనుంది. ప్లేఆఫ్స్‌ బెర్తును ఖాయం చేసుకోవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్‌ విజయమూ కీలకమే.

Updated : 01 May 2024 13:11 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌ ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారుతోంది. నాలుగు బెర్తుల్లో రాజస్థాన్‌ ఒక ప్లేస్‌ దాదాపు ఖాయం చేసుకుంది. మిగిలిన మూడింటి కోసం ఐదు జట్లు బరిలో ఉన్నాయి. వాటిలో చెన్నై కూడా ఉంది.  అయితే చెన్నై పరిస్థితి అలా లేదు. రెండు మ్యాచులు గెలిస్తే రెండు ఓడుతూ వస్తోంది. ఈ ట్రెండ్‌ను మరిచి వరుస విజయాలు సాధించడం ఇప్పుడు అత్యవసరం. దానికి ఈ రోజు జరగబోయే పంజాబ్‌ మ్యాచ్‌ చాలా కీలకం. 

పంజాబ్‌ను ఈసారైనా అడ్డుకుంటారా?

  • మొదటి మ్యాచ్‌లో బెంగళూరుపై విజయం సాధించి పాయింట్ల ఖాతాను తెరిచిన చెన్నై.. తర్వాత గుజరాత్‌ను కూడా చిత్తు చేసింది. మరోసారి టైటిల్‌ను కొట్టే దిశగా దూసుకుపోతుందని చెన్నై ఫ్యాన్స్‌ జోష్‌లో ఉన్నారు.
  • ఆ తర్వాత దిల్లీ, హైదరాబాద్‌ చేతిలో వరుసగా ఓటములను చవిచూసింది. ఆ తర్వాత బలమైన కోల్‌కతాను, స్టార్లున్న ముంబయిని ఓడించింది.
  • లఖ్‌నవూతో వరుసగా జరిగిన రెండు మ్యాచుల్లోనూ చెన్నైకు పరాజయం తప్పలేదు. కానీ, సొంతమైదానంలో హైదరాబాద్‌ను చిత్తు చేసి మళ్లీ విజయాల బాట పట్టింది.
  • ఇప్పుడు వరుస మ్యాచుల్లో పంజాబ్‌ను ఢీకొట్టనుంది. మరో నాలుగు రోజుల్లో (మే 5న) ధర్మశాలలో తలపడనుంది. ఆ తర్వాత గుజరాత్, రాజస్థాన్, బెంగళూరుతో మ్యాచులున్నాయి. 
  • చెన్నై బ్యాటింగ్‌ ఎక్కువగా రుతురాజ్‌, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీపైనే ఆధారపడుతోంది. డారిల్ మిచెల్, అజింక్య రహానె పెద్దగా ప్రభావం చూపడంలేదు.
  • హైదరాబాద్‌తో మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ చేసిన డారిల్ మళ్లీ ఫామ్‌ అందుకోవడం చెన్నైకి కలిసొచ్చే అంశమే. ఓపెనర్‌గా వస్తున్న అజింక్య రహానె కూడా బ్యాట్‌ను ఝళిపిస్తే పంజాబ్‌కు కష్టాలు తప్పవు.
  • బౌలింగ్‌లో తుషార్ దేశ్‌పాండే హైదరాబాద్‌పై విజృంభించాడు. ముస్తాఫిజుర్, దీపక్, పతిరన ప్రత్యర్థులను హడలెత్తించారు. స్పిన్ విభాగం రవీంద్ర జడేజా ఆధ్వర్యంలో నడుస్తోంది.
  • చెన్నై - పంజాబ్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 28 మ్యాచుల్లో తలపడ్డాయి. సీఎస్కే 15 మ్యాచుల్లో గెలవగా.. పంజాబ్ 13 మ్యాచుల్లో విజయం సాధించింది.
  • చెపాక్‌ స్టేడియంలో పంజాబ్ మూడింట్లో గెలిచింది. దీంతో ఈసారి ఎలాగైనా కింగ్స్‌పై సూపర్‌ కింగ్స్‌ విజయం సాధించాలని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. 
  • ఈ సీజన్‌లో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన పంజాబ్.. కోల్‌కతాపై 262 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించి తిరిగి ఫామ్‌లోకి వచ్చింది.

తుది జట్లు (అంచనా)

చెన్నై: రుతురాజ్‌ గైక్వాడ్, అజింక్య రహానె, డారిల్ మిచెల్, శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, మొయిన్ అలీ, దీపక్ చాహర్, తుషార్‌ దేశ్‌పాండే, మతీశా పతిరన, ముస్తాఫిజుర్

పంజాబ్‌: ప్రభ్‌సిమ్రన్ సింగ్, జానీ బెయిర్‌స్టో, రిలీ రొసో, శశాంక్‌ సింగ్‌, సామ్ కరన్, జితేశ్‌ శర్మ, అశుతోష్‌ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్‌ సింగ్‌


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని