icon icon icon
icon icon icon

ఎన్నికల వ్యయంపై పరిమితి ఏదీ!

అంగబలం, ధనబలం రూపంలో ఈ స్ఫూర్తికి అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ధనప్రభావం.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోంది.

Published : 22 Apr 2024 04:26 IST

ఈసీ నిబంధనలు పాటించని పార్టీలు
విచ్చలవిడిగా అభ్యర్థుల ఖర్చు
నానాటికీ పెరుగుతున్న ధోరణి
ప్రజాస్వామ్యానికి నిష్పాక్షిక, పారదర్శక, ప్రలోభాలకు తావులేని ఎన్నికలే ప్రాణవాయువులు!

అంగబలం, ధనబలం రూపంలో ఈ స్ఫూర్తికి అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ధనప్రభావం.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోంది. దీన్ని కట్టడి    చేయడానికి ఎన్నికల కమిషన్‌ (ఈసీ) వద్ద ఉన్న అస్త్రం.. అభ్యర్థుల ‘వ్యయ నియంత్రణ’! ఎన్ని చర్యలు చేపడుతున్నా.. పార్టీలు పట్టపగ్గాల్లేకుండా  ఎన్నికల్లో డబ్బు కుమ్మరిస్తున్నాయి.  ఫలితంగా ఎన్నికలు నానాటికీ వ్యయభరిత మవుతున్నాయి.

ఏమిటీ వ్యయ పరిమితి?

ర్థిక స్థోమతతో సంబంధం లేకుండా అభ్యర్థులందరికీ సమానావకాశాలు లభించేలా చూడటానికి వారి ఎన్నికల ప్రచార ఖర్చుపై ఈసీ నియంత్రణ పెట్టింది. ఒక అభ్యర్థి తన ఎన్నికల ప్రచారం కోసం చట్టబద్ధంగా వెచ్చించదగిన మొత్తాన్ని వ్యయపరిమితిగా పేర్కొంటారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్‌ 77(1) ప్రకారం.. అభ్యర్థుల తమ ప్రచార ఖర్చుకు సంబంధించిన లెక్కలను పక్కాగా నిర్వహించాలి. నామినేషన్‌ వేసిన తేదీ నుంచి ఎన్నికల ఫలితాలు వచ్చేవరకూ వీటిని కొనసాగించాలి. ఇందులో బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాలకు సంబంధించిన వ్యయాన్ని నమోదు చేయాలి.  

  • అభ్యర్థుల ప్రచార ఖర్చులపై మాత్రమే పరిమితి ఉంది. ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు వెచ్చించే మొత్తాలపై ఎలాంటి ఆంక్షలు లేవు.
  • అభ్యర్థులంతా తమ వ్యయ ప్రకటనలను ఎన్నికలు ముగిశాక ఈసీకి సమర్పించాలి.

ప్రాతిపదిక ఏమిటి?

ఎన్నికల సంఘం తరచూ వ్యయపరిమితిని సవరిస్తూ ఉంటుంది. పెరుగుతున్న ఖర్చు, ఓటర్ల సంఖ్య ఆధారంగా ఈ కసరత్తు జరుగుతుంది. ద్రవ్యోల్బణం కారణంగా ఏటేటా సరకులు, వస్తువుల ధరల్లో పెరుగుదలను అంచనావేయడానికి ధరల ద్రవ్యోల్బణ సూచీ (సీఎఫ్‌ఐ)ని ప్రామాణికంగా తీసుకుంటారు. 2014-15లో అది 240గా ఉండేది. 2021-22కు 317కు పెరిగింది. ఆ మేరకు 2022లో చివరిసారిగా అభ్యర్థుల వ్యయపరిమితిని ఈసీ సవరించింది.


ఇలా పెరుగుతూ వచ్చింది..  

  • స్వతంత్ర భారత తొలి సార్వత్రిక ఎన్నికలు 1951-52లో జరిగాయి. నాడు లోక్‌సభ అభ్యర్థి వ్యయ పరిమితి రూ.25వేలుగా ఉంది. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో దాన్ని రూ.10వేలుగా నిర్ణయించారు.  
  • 1971లో ప్రధాన రాష్ట్రాల్లో దాన్ని రూ.35వేలుగా ఈసీ నిర్ధరించింది. 1980లో రూ.లక్షకు పెంచింది.  
  • 1984లో దాన్ని పెద్ద రాష్ట్రాల్లో రూ.1.5లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ.1.3 లక్షలుగా నిర్ధారించారు. 1-2 లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రాలకు దాన్ని రూ.లక్షగా, చండీగఢ్‌ వంటి కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.50వేలుగా నిర్ణయించారు.  
  • 1996లో వ్యయ పరిమితిని పెద్ద రాష్ట్రాల్లో రూ.4.5లక్షలకు పెంచారు. 1998లో దాన్ని ఏకంగా రూ.15లక్షలకు నిర్ణయించారు. 2004లో రూ.25లక్షలకు చేరింది.
  • పదేళ్లపాటు ఈ పరిమితిలో మార్పు లేదు. 2014లో అది రూ.70లక్షలకు పెరిగింది. 2022లో మరోసారి సవరణ జరిగింది.

ఇవి తప్పనిసరి..

  • అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయాన్ని ప్రత్యేక బ్యాంకు ఖాతా ద్వారా నిర్వహించాలి.
  • ప్రచార సామగ్రిని సరఫరాదారులు, ముద్రణదారుల ఫొటోలతో ఒక డిక్లరేషన్‌ ఫారంను సమర్పించాలి.
  • రూ.10 లక్షలకు మించిన అనుమానాస్పద లావాదేవీల గురించి బ్యాంకులు సంబంధిత జిల్లా కలెక్టర్లకు తెలియజేయాలి.

పట్టుబడుతున్న సొమ్మూ భారీగానే..

2019 ఎన్నికల సమయంలో నగదు, ఇతర వస్తువులు భారీగా పట్టుబడ్డాయి. వాటి విలువ రూ.3,475 కోట్లు. 2014 ఎన్నికల్లో పట్టుబడ్డ సొమ్ముతో పోలిస్తే ఇది మూడింతలు కావడం గమనార్హం.


‘కట్టలు’ తెగుతున్న అనధికార ఖర్చు

న ప్రభావ కట్టడికి ఈసీ ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ ఎన్నికలు అంతకంతకూ ఖరీదవుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలు ఏకంగా రూ.55,000 కోట్ల నుంచి 60,000 కోట్ల మధ్య ఖర్చుపెట్టాయని ‘సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌’ అనే స్వచ్ఛంద సంస్థ పరిశీలనలో వెల్లడైంది. దాదాపు 85 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులు రూ.40 కోట్లపైబడి వెచ్చించారని తెలిపింది.

  • 2014 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థులు రూ.30వేల కోట్లను ఖర్చుపెట్టినట్లు అంచనా. ఆ తర్వాత ఐదేళ్లకు జరిగిన ఎన్నికల్లో అది రెట్టింపు కావడం గమనార్హం. 2019 ఎన్నికల్లో పార్టీలు సరాసరిన ఓటుకు రూ.700 ఖర్చు పెట్టినట్లు అంచనా. ఎన్నికల షెడ్యూల్‌ రావడానికి ముందు పెట్టిన ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకుంటే.. ఈ మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది.
  • 1999లో ఈ వ్యయం రూ.10వేల కోట్లుగా ఉండగా.. 2004కు అది రూ.14వేల కోట్లకు, 2009కి రూ.20వేల కోట్లకు, 2014లో రూ.30వేల కోట్లకు పెరిగింది.

తేడాలుంటే అనర్హతే..

మర్పించిన ఖర్చు వివరాల్లో తేడాలున్నా లేక నిర్దేశించిన పరిమితిని దాటినా.. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 10(ఎ) కింద సంబంధిత అభ్యర్థిపై అనర్హతవేటు పడుతుంది.  


ఎంత ఖర్చుపెట్టవచ్చు?

చాలా రాష్ట్రాల్లో లోక్‌సభ అభ్యర్థికి గరిష్ఠ వ్యయపరిమితిని రూ.95 లక్షలుగా నిర్ధారించారు. అరుణాచల్‌ప్రదేశ్‌, గోవా, సిక్కింలో దాన్ని 75 లక్షలుగా నిర్ణయించారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆ పరిమితి రూ.75-95 లక్షల మధ్య ఉంది.

పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ అభ్యర్థి రూ.40 లక్షలు, చిన్నరాష్ట్రాల్లో రూ.28 లక్షలు ఖర్చుపెట్టవచ్చు.


పర్యవేక్షణ ఎలా?

భ్యర్థుల ప్రచార ఖర్చులను పర్యవేక్షించడానికి ఈసీ వ్యయ పరిశీలకులతోపాటు రాష్ట్ర, కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థలు రంగంలోకి    దిగుతాయి. ఇందులో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, నిఘా బృందాలు, వీడియో నిఘా బృందాలు ఉంటాయి.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img