icon icon icon
icon icon icon

చాయ్‌.. సమోసా.. బిర్యానీ.. దేని లెక్క దానిదే..!

ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయ పరిశీలన ప్రక్రియలో భాగంగా జిల్లాల ఎన్నికల కమిటీలు వివిధ వస్తువులకు ధరలను నిర్ణయిస్తాయి. ఈ జాబితా ఆధారంగా జిల్లా ఎన్నికల అధికారి.. అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని మదిస్తారు.

Published : 22 Apr 2024 04:53 IST

అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిశీలనలో భాగంగా మెనూ నిర్ణయం
ఒక్కోచోట ఒక్కోలా..

న్నికల్లో అభ్యర్థుల వ్యయ పరిశీలన ప్రక్రియలో భాగంగా జిల్లాల ఎన్నికల కమిటీలు వివిధ వస్తువులకు ధరలను నిర్ణయిస్తాయి. ఈ జాబితా ఆధారంగా జిల్లా ఎన్నికల అధికారి.. అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని మదిస్తారు. టోకు ధరల సూచీ, ద్రవ్యోల్బణ రేటు, ఆర్థిక శాఖ అందించే ఇతర ఆర్థిక సూచికల ఆధారంగా ఆయా జిల్లాల్లోని ప్రజాపనుల శాఖ.. ధరల జాబితాను జారీ చేస్తుంది. ఈ దఫా కొన్నిచోట్ల ఇవి ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఇందులో టీ, కాఫీల నుంచి రకరకాల ఆహారపదార్థాల ధరల ప్రస్తావన ఉంది. పూలమాలలు, జెండాలు, టోపీలకూ రేట్లను నిర్ణయించారు. వాహనాలు, సోఫాలు, ఏసీల అద్దెలనూ నిర్ధరించారు. అవి దేశవ్యాప్తంగా ఒకేలా లేవు. కొన్నిచోట్ల మార్కెట్‌ కన్నా తక్కువ ధరకు, మరికొన్నిచోట్ల ఎక్కువ రేటుకు నిర్ణయించారు.


ఎక్కడ ఎలా?

దేశంలోని చాలాప్రాంతాల్లో సర్వసాధారణంగా వడ్డించే స్నాక్స్‌లో చాయ్‌, సమోసా ముందుంటుంది. చాలావరకూ జిల్లాల కమిటీలు తమ మెనూలో వీటికి స్థానం కల్పించాయి. వీటి ధర ఎక్కడెక్కడ ఎంత పలుకుతోందంటే..  

పంజాబ్‌లోని జలంధర్‌లో అభ్యర్థులు కప్పు టీ కోసం రూ.15 ఖర్చు పెట్టవచ్చు. సమోసాకు అంతే మొత్తాన్ని ధరగా నిర్ణయించారు.


ధ్యప్రదేశ్‌లోని మాండ్లాలో కప్పు టీకి రూ.7, సమోసాకు రూ.7.50 వెచ్చించొచ్చు. ఇదే రాష్ట్రంలోని బాలాఘాట్‌లో టీ ధర రూ.5గా, సమోసా రేటు రూ.10గా నిర్ధారించారు.

  • మణిపుర్‌లోని థౌబల్‌ జిల్లాలో టీ, సమోసా ధరలను రూ.10 చొప్పున నిర్ణయించారు. ఈ రాష్ట్రంలోని తెగ్నౌపాల్‌ జిల్లాలో బ్లాక్‌ టీ 5, మిల్క్‌ టీ ధరను రూ.10గా లెక్కకట్టారు.
  • చెన్నైలో టీ ధర రూ.10-15 మధ్య, కాఫీ రేటు.. రూ.15-20గా ఉంది.
  • గౌతమబుద్ధ నగర్‌ (నోయిడా/ గ్రేటర్‌ నోయిడా)లో సమోసా, కప్పు టీలకు రూ.10 చొప్పున నిర్ధారించారు.
  • ఉత్తర గోవాలో సమోసా, టీకి రూ.15 చొప్పున, కాఫీకి రూ.20గా లెక్కగట్టారు.

మౌలిక వసతులకు ఇలా..

హెలిప్యాడ్‌లు, విలాసవంతమైన వాహనాలు, ఫామ్‌హౌస్‌లు వంటి ఖరీదైన మౌలికవసతుల నుంచి పూలు, కూలర్లు, టవర్‌ ఏసీలు, సోఫాల రేట్లనూ ప్రస్తావించారు.  

  • ప్రచారం కోసం టాటా సఫారీ లేదా స్కార్పియో నుంచి హోండా సిటీ, సియాజ్‌, బహిరంగ సభలకు ప్రజలను చేరవేయడానికి బస్సుల వరకూ వివిధ వాహనాల అద్దెలపై పరిమితిని నిర్దేశించారు.
  • రోజా పూలతో తయారైన పూలమాలకో రేటును, బంతిపూల మాలకో ధరను నిర్ణయించారు. పుష్పగుచ్ఛాలనూ అధికారులు వదలలేదు.
  • ప్రాంగణాలు, వసతి కోసం అనుమతించిన రేట్ల వివరాలనూ ప్రస్తావించారు. బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రకటనలు, హోర్డింగ్‌లు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, టోపీలు, జెండాలు, ఇతర ప్రచార సామగ్రి, ఎన్నికలకు సంబంధించిన ఇతర పనులకూ రేట్లను నిర్దేశించారు.  

మరికొన్ని..

  • జలంధర్‌లో ఛోలే భటూరేకు రూ.40, మటన్‌కు రూ.500, చికెన్‌కు రూ.250గా ధర నిర్ధరించారు. ఢోఢా (కిలో 450), ఘీ పిన్నీ (కిలో రూ.300) వంటి డెజర్ట్‌లకూ గరిష్ఠ ధరలను నిర్ణయించారు. గ్లాసు లస్సీకి రూ.20, కొబ్బరి నీళ్లు రూ.15గా నిర్ధరించారు.
  • మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో ఇడ్లీ, సాంబార్‌, పోహా-జిలేబీకి రూ.20 చొప్పున, దోశ, ఉప్మాలకు రూ.30 ధరను నిర్ధరించారు.
  • మణిపుర్‌లోని థౌబల్‌ జిల్లాలో కచోరి, ఖర్జూరాలు, గాజా (డిజెర్ట్‌)లకు రూ.10 చొప్పున నిర్ణయించారు. తెగ్నౌపల్‌ జిల్లాలో బాతు మాంసం రూ.300, పందిమాంసం రూ.400గా నిర్ధరించారు.
  • చెన్నైలో 2019నాటితో పోలిస్తే చికెన్‌ బిర్యానీ ప్యాకెట్‌ ధరను రూ.180 నుంచి రూ.150కి తగ్గించడం గమనార్హం.  
  • గౌతమబుద్ధ నగర్‌లో వెజ్‌ థాలీకి రూ.100 ధరను నిర్ధరించారు. కచోరి రూ.15, శాండ్‌విచ్‌ రూ.25, కిలో జిలేబీ ధర రూ.90గా నిర్ధరించారు.
  • ఉత్తర గోవాలో అభ్యర్థులకు నిర్దేశించిన మెనూలో బటాటా వడ ఉంది. దీని ధర రూ.15.
  • హరియాణాలోని జింద్‌లో అభ్యర్థులు తందూర్‌ పొయ్యిని రూ.300 అద్దెకు తీసుకోవచ్చు. అక్కడ దాల్‌ మఖనీ, మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కర్రీకి రూ.130 చొప్పున, మటర్‌ పన్నీర్‌కు రూ.160 ధరను అధికారులు నిర్ణయించారు. బటర్‌ నాన్‌, మిస్సీ రోటీ, సాదా రోటీ, కాజూ కట్లీ, గులాబ్‌ జామ్‌ వంటి డెజర్ట్‌లనూ మెనూలో చేర్చారు.

మద్యం మాట లేదు..

న్నికలంటే మద్యం ఏరులై పారుతుంటుంది. పార్టీ కార్యర్తలు, ఓటర్లకు అభ్యర్థులు మందు పంపిణీ చేస్తారన్నది బహిరంగ రహస్యమే. అయితే వీటి ధరలను రేటు కార్డుల్లో ప్రస్తావించలేదు.


6 పైసల నుంచి రూ.46 వరకూ...

దేశంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ పెడుతున్న ఖర్చు కూడా పెరుగుతోంది. 1952లో జరిగిన దేశ తొలి ఎన్నికలకు రూ.10కోట్లు వ్యయమయ్యాయి. ఈ లెక్కన ఒక్కో ఓటరుపై 6పైసలు ఖర్చయింది. 2014 నాటికి ఆ వ్యయం రూ.46కు పెరిగింది. ఈసారి అది రూ.50పైనే ఉండొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img