icon icon icon
icon icon icon

భూపేశ్‌ బఘేల్‌కు పరీక్ష!

లోక్‌సభ ఎన్నికల్లో గత రెండు విడతలుగా సాధించిన అప్రతిహత విజయాలను కొనసాగించాలని భాజపా, గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం నుంచి కోలుకోవాలని కాంగ్రెస్‌.. ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో హోరాహోరీ తలపడుతున్నాయి.

Updated : 23 Apr 2024 07:00 IST

ఛత్తీస్‌గఢ్‌లో రెండోవిడత 3 చోట్ల పోలింగ్‌

లోక్‌సభ ఎన్నికల్లో గత రెండు విడతలుగా సాధించిన అప్రతిహత విజయాలను కొనసాగించాలని భాజపా, గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం నుంచి కోలుకోవాలని కాంగ్రెస్‌.. ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో హోరాహోరీ తలపడుతున్నాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 11 నియోజకవర్గాలుండగా తొలి విడతలో ఒక స్థానానికి పోలింగ్‌ పూర్తయింది. మరో 3 సీట్లకు 26వ తేదీన పోలింగ్‌ జరగనుంది. మిగిలిన 7 చోట్ల వచ్చే నెల 7వ తేదీన పోలింగ్‌ జరుగుతుంది. రెండో విడత పోలింగ్‌ జరిగే నియోజకవర్గాల్లో రాజ్‌నంద్‌గావ్‌, మహాసముంద్‌, కాంకేర్‌ (ఎస్టీ) ఉన్నాయి. వీటిలో జాతీయ, స్థానిక అంశాలు ప్రభావం చూపుతున్నాయి. మోదీ గ్యారంటీలకు, కాంగ్రెస్‌ గ్యారంటీలకు మధ్య పోరు సాగుతోంది.


వీఐపీ నియోజకవర్గం

-రాజ్‌నంద్‌గావ్‌

విద్యావంతులు, మేధావులకు నిలయమైన రాజ్‌నంద్‌గావ్‌ ఘన సంస్కృతి కలిగిన నగరం. వారసత్వానికీ ప్రతీకగా నిలిచిన నగరం ఇది. ఎంతో మంది ప్రముఖులు ఇక్కడ పోటీ చేశారు. అందుకే దీనిని వీఐపీ నియోజకవర్గంగా చూస్తారు. 15,88,095 ఓటర్లున్న ఇక్కడ కాంగ్రెస్‌దే ఆధిపత్యం. ఛత్తీస్‌గఢ్‌ ఏర్పాటయ్యాక భాజపా ప్రాభవం ప్రారంభమైంది. గత ఎన్నికల్లో భాజపా గెలిచింది. శివనాథ్‌ నదీ తీరంలో ఉన్న ఈ నియోజకవర్గంలో వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, ఖనిజాలే జీవనాధారం. ఆసియాలోనే తొలి సంగీత విశ్వవిద్యాలయం ఈ ప్రాంతంలోని ఖైరాగఢ్‌లో ఉంది. ఇక్కడ గత ఎన్నికల్లో గెలిచిన సంతోశ్‌ పాండే మళ్లీ పోటీ చేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్‌ నుంచి మాజీ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ పోటీ చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఆయనకు ఇది పరీక్షే. ఈ నియోజకవర్గంలో గిరిజనులు 35శాతం, లోధి వర్గీయులు 30శాతం ఉన్నారు. గతంలో ఇక్కడ జౌళి పరిశ్రమ ఉండేది. ఇక్కడి నుంచి ఎందరో హాకీ క్రీడాకారులు వచ్చారు. ఈ నియోజకవర్గంలోని 8 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 కాంగ్రెస్‌ చేతిలో ఉన్నాయి. ఒక దానిని భాజపా, మరోదానిని జోగి కాంగ్రెస్‌ గెలుచుకున్నాయి.


వీసీ శుక్లా కంచుకోట

-మహాసముంద్‌

సీనియర్‌ కాంగ్రెస్‌ నేత విద్యాచరణ్‌ శుక్లా ఆరుసార్లు గెలిచిన నియోజకవర్గం మహాసముంద్‌. సాంస్కృతికంగా ఘన చరిత్ర కలిగిన ప్రాంతం. సోమవంశీ రాజులు పాలించిన ప్రాంతం. ఇక్కడ 15,15,747 ఓట్లున్నాయి. 2019లో ఇక్కడి నుంచి భాజపా నేత చున్నీలాల్‌ సాహు విజయం సాధించారు. ఈసారి భాజపా నుంచి రూప్‌ కుమారి చౌధరి, కాంగ్రెస్‌ నుంచి తామ్రధ్వజ్‌ సాహు, గోండ్వానా గణతంత్ర పార్టీ నుంచి మహమ్మద్‌ ఫరీద్‌ ఖురేషీ బరిలో ఉన్నారు.


అభివృద్ధి దిశగా కాంకేర్‌

రాజధాని రాయ్‌పుర్‌ దగ్గరగా ఉన్న కాంకేర్‌ 10ఏళ్ల కిందట నక్సల్స్‌కు కేంద్ర స్థానంగా ఉండేది. గత కొంత కాలంగా అభివృద్ధి పనులు జరగడంతో క్రమంగా ఈ ప్రాంతంలో మావోయిస్టులు పట్టు కోల్పోయారు. రోడ్లు నిర్మించడం, మార్కెట్ల ఏర్పాటు, పారామిలిటరీ బలగాల మోహరింపువల్ల అబూజ్‌మఢ్‌లోకి వచ్చే ఇక్కడి 70శాతం ప్రాంతానికి మావోయిస్టుల నుంచి విముక్తి కలిగిందని స్థానికులు చెబుతున్నారు. కొన్ని గ్రామాలకు ఫోన్లు, ఇంటర్నెట్‌ వచ్చాయి. 15ఏళ్ల కిందట ఇక్కడ ఓటు వేసేవాళ్లం కాదని, ఇప్పుడు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నామని మోహ్లాకు చెందిన స్థానికుడొకరు తెలిపారు. మోదీ అద్భుతంగా చేశారని ఒకరు చెప్పగా ఆయన ఏం చేశారని మరొకరు ప్రశ్నించారు. కాంకేర్‌లో భాజపా తరఫున భోజ్‌రాజ్‌ నాగ్‌ పోటీ చేస్తున్నారు. 2019లో ఈ సీటును 6వేల స్వల్ప మెజారిటీతో భాజపా గెలుచుకుంది. 2019లో పోటీ చేసిన వీరేశ్‌ ఠాకుర్‌నే కాంగ్రెస్‌ బరిలోకి దింపింది. తమకు నల్‌ జల్‌ యోజన కావాలని, గ్రామాల్లో అంతర్గత రోడ్డు వేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అభివృద్ధికే ఓటేస్తామని చెబుతున్నారు.
 

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img