icon icon icon
icon icon icon

ఓం బిర్లాపై వలస నేత.. బరిలో కాంగ్రెస్‌ నుంచి భాజపా మాజీ నేత గుంజాల్‌

రాజస్థాన్‌లోని కోటా నుంచి 2019లో రెండోసారి ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లాను లోక్‌సభ స్పీకర్‌ను చేసి భాజపా అధిష్ఠానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. విద్యా కేంద్రంగా విలసిల్లుతున్న కోటా నుంచి మరోసారి ఆయనే పోటీ చేస్తున్నారు.

Updated : 23 Apr 2024 06:58 IST

జైపుర్‌ నుంచి ప్రకాశ్‌ భండారీ

రాజస్థాన్‌లోని కోటా నుంచి 2019లో రెండోసారి ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లాను లోక్‌సభ స్పీకర్‌ను చేసి భాజపా అధిష్ఠానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. విద్యా కేంద్రంగా విలసిల్లుతున్న కోటా నుంచి మరోసారి ఆయనే పోటీ చేస్తున్నారు. దేశంలో ప్రముఖ వ్యాపారులైన బిర్లాలతో ఆయనకు ఎటువంటి సంబంధం లేదు. విద్యార్థి నాయకుడి నుంచి లోక్‌సభ స్పీకర్‌గా ఆయన ఎదిగారు. ఆయనపై కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయడానికి ఎవరూ లేకపోవడంతో భాజపా సీనియర్‌ నేత ప్రహ్లాద్‌ గుంజాల్‌ను తీసుకొచ్చి పోటీ చేయిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోటా నార్త్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన గుంజాల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి శాంతి ధరీవాల్‌ చేతిలో ఓడిపోయారు. గుంజాల్‌ అభ్యర్థిత్వాన్ని ధరీవాల్‌ తీవ్రంగా వ్యతిరేకించినా మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, సచిన్‌ పైలట్‌, గోవింద్‌ సింగ్‌ డోటాసరా ఆయనకే టికెట్‌ ఇచ్చారు. ధరీవాల్‌ తనను వ్యతిరేకించినా గుంజాల్‌ పెద్దగా పట్టించుకోవడం లేదు.


గుజ్జర్లు, మీనాలపై ఆశ..

కోటా నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గుజ్జర్లు, మీనాలపై ప్రహ్లాద్‌ గుంజాల్‌ ఆశలు పెట్టుకున్నారు. ఆయన భాజపాపైనా, మోదీపైనా, అమిత్‌ షాపైనా విమర్శలు చేయడం లేదు. కేవలం ఓం బిర్లానే లక్ష్యంగా చేసుకున్నారు. కోటాను బిర్లా.. తన రాజ్యంగా మార్చుకున్నారని, ఆయన సోదరుడు పెత్తనం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ధరీవాల్‌ అశోక్‌ గహ్లోత్‌ కేబినెట్‌లో పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా పని చేశారు. కోటాలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. చంబల్‌ నదీ తీరాన్ని అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా మార్చారు. దీంతో ఆయనకు ఈ ప్రాంతంపై పట్టుంది.

క్షమాపణలు చెప్పని గుంజాల్‌

కాంగ్రెస్‌లో చేరిన వెంటనే జరిగిన బహిరంగసభలో గుంజాల్‌ మాట్లాడుతూ.. ధరీవాల్‌ మద్దతు కోరారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో తనపై చేసిన అవినీతి ఆరోపణలకు క్షమాపణలు చెబితేనే మద్దతిస్తానని ధరీవాల్‌ షరతు పెట్టారు. దీనికి గుంజాల్‌ అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్య సఖ్యత కుదరలేదు.

విమానాశ్రయం అంశం

కోటాలో విమానాశ్రయ ఏర్పాటు ఎన్నికల అంశంగా మారింది. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇది రెండు పార్టీల మధ్య ప్రచారానికి అస్త్రంగా మారింది. తాము ఉచితంగా భూమి సేకరించి ఇచ్చినా విమానాశ్రయ ఏర్పాటుకు ఓం బిర్లా అనుమతులు తేలేదని ధరీవాల్‌ ఆరోపిస్తున్నారు. అయితే తాను రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయించానని, రోడ్లు వేయించానని, రైళ్లను తీసుకొచ్చానని బిర్లా చెబుతున్నారు.


గుంజాల్‌కు ధరీవాల్‌ మద్దతిస్తే బిర్లాకు ఇబ్బందే

ఓం బిర్లా ఎదురీదుతున్నారు. ఒకవేళ గుంజాల్‌కు కోటా నగరంలో ధరీవాల్‌ పూర్తి స్థాయి మద్దతిస్తే బిర్లా ఓటు బ్యాంకుకు గండి పడటం ఖాయం. అప్పుడు స్పీకర్‌కు ఇబ్బందులు తప్పవు. 55,000 మంది మైనారిటీలతోపాటు గుజ్జర్లు, మీనాలు మద్దతిస్తే గుంజాల్‌ లాభపడతారు. అప్పుడు పట్టణ ప్రాంత ఓటర్లపై బిర్లా ఆధారపడాల్సి వస్తుంది. వారంతా మద్దతిస్తేనే ఆయన బయటపడతారు. కోటా నియోజకవర్గం 2 జిల్లాల్లోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో విస్తరించి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో గుంజాల్‌కు, పట్టణ ప్రాంతాల్లో బిర్లాకు పట్టుంది. రెండో విడత పోలింగ్‌ జరిగే 13 నియోజకవర్గాల్లో కోటాలో గట్టి పోటీ నెలకొందని భాజపా భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img