icon icon icon
icon icon icon

పూర్ణియాలో పరువు పోరు!

దేశంలోని రెండు ప్రధాన రాజకీయ కూటములు...అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా హోరాహోరీ తలపడుతున్న రాష్ట్రం బిహార్‌. రాష్ట్రమంతటా ఈ కూటములఅభ్యర్థుల మధ్యే పరస్పర పోటీ నెలకొన్నప్పటికీ పూర్ణియా లోక్‌సభ స్థానంలో మాత్రం త్రిముఖ పోరు కనిపిస్తోంది.

Updated : 23 Apr 2024 06:56 IST

ఎన్డీయే, ఇండియా కూటములకు సవాల్‌ విసురుతున్న పప్పూయాదవ్‌
కాంగ్రెస్‌ అవమానించింది అంటూ స్వతంత్రంగా పోటీ
ఆర్జేడీలో చేరిన వెంటనే టికెట్‌ పొందిన బీమా భారతి
హ్యాట్రిక్‌ కోసం జేడీయూ తీవ్ర ప్రయత్నం
బిహార్‌లో రాజకీయం గరం గరం

దేశంలోని రెండు ప్రధాన రాజకీయ కూటములు...అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా హోరాహోరీ తలపడుతున్న రాష్ట్రం బిహార్‌. రాష్ట్రమంతటా ఈ కూటముల అభ్యర్థుల మధ్యే పరస్పర పోటీ నెలకొన్నప్పటికీ పూర్ణియా లోక్‌సభ స్థానంలో మాత్రం త్రిముఖ పోరు కనిపిస్తోంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన రాజేశ్‌ రంజన్‌ అలియాస్‌ పప్పూయాదవ్‌ ఆ కూటముల అభ్యర్థులను ఒంటరిగానైనా బలంగానే ఢీకొంటున్నారు. దీంతో అక్కడ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది.

త్రిముఖ పోటీ షురూ

పూర్ణియా లోక్‌సభ స్థానంలో ఎన్డీయే తరఫున జేడీ(యు) అభ్యర్థిగా సిటింగ్‌ ఎంపీ సంతోష్‌ కుమార్‌ కుశ్వాహా పోటీ చేస్తున్నారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో విజయం సాధించిన ఆయన మళ్లీ గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు.

జేడీ(యు)ను వీడి గత నెలలో ఆర్జేడీలో చేరిన బీమా భారతి...విపక్ష ఇండియా కూటమి అభ్యర్థినిగా టికెట్‌ దక్కించుకున్నారు. ఆమె అయిదుసార్లు బిహార్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.  

ఇక, వీరిద్దరినీ స్వతంత్ర అభ్యర్థిగా ఎదుర్కొంటున్న పప్పూయాదవ్‌ గత నెలలో తన నేతృత్వంలోని ‘జన్‌ అధికారి పార్టీ’ని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. తనకు పూర్ణియా టికెట్‌ వస్తుందని ఆశించారు. ఇండియా కూటమి సర్దుబాటులో పూర్ణియా సీటు ఆర్జేడీకి వెళ్లిడంతో భంగపడిన పప్పూయాదవ్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. పోటీ నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్‌ నేతలు సూచించినా ససేమిరా అన్నారు.


ఇదీ పప్పూయాదవ్‌ గతం..

త్య, హత్యాయత్నం, బెదిరింపులు తదితర 32కు పైగా కేసులున్న పప్పూ యాదవ్‌ గతంలోనూ స్వతంత్ర అభ్యర్థిగా, సమాజ్‌వాదీ పార్టీ, లోక్‌జనతా పార్టీ, ఆర్జేడీ తరఫున మొత్తం అయిదు సార్లు (పూర్ణియా నుంచి 1991, 1996, 1999; మాధేపుర నుంచి 2004, 2014) లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2015లో ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత ‘జన్‌ అధికారి పార్టీ’ని స్థాపించారు.


ఓటరు నాడి ఏమిటో?

ప్పూయాదవ్‌కు నేర నేపథ్యం ఉన్నప్పటికీ వివిధ వర్గాల సామాన్య ప్రజల్లోకి చొరవగా వెళ్తూ మద్దతు కూడగట్టే యత్నం చేస్తున్నారు. జేడీ(యు) అభ్యర్థి సంతోష్‌కుమార్‌...రెండు దఫాలుగా ఎంపీగా ఉండడం, రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఆయనకు ప్రతికూలం కావచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా. మిత్రపక్ష భాజపా ఓట్లు సంతోష్‌కుమార్‌కు  బదిలీకాకపోవచ్చని భావిస్తున్నారు. ఆర్జేడీ అభ్యర్థినిగా ఉన్న బీమా భారతి జేడీ(యు) ఓట్లను చీల్చే అవకాశం ఉంది. ఆమె కూడా ప్రస్తుత ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఆర్జేడీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ వెంటనే టికెట్‌ పొందడంతో ఆర్జేడీ శ్రేణుల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. బీమా భారతి విజయం కోసం ఆ పార్టీ అగ్రనేత తేజస్వీ యాదవ్‌ శ్రమిస్తున్నారు. సాధారణ ప్రజల్లో తనకున్న బలం ముందు ఉన్నత సామాజిక వర్గాల్లో భాజపా, జేడీ(యు)కు ఉన్న పునాదులు, ఇండియా కూటమికి ఉన్న ముస్లిం-యాదవ్‌ ఓటు బ్యాంకు నిలువలేవని పప్పూయాదవ్‌ ధీమాగా చెబుతున్నారు. గత ఏడాది కాలంగా పప్పూయాదవ్‌ ‘ప్రణామ్‌ పూర్ణియా’ పేరుతో ప్రజల మధ్య ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వకుండా అవమానించిందంటూ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img