icon icon icon
icon icon icon

శివమొగ్గలో కమలానికి తలపోటు!

కర్ణాటకలోని శివమొగ్గ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు భాజపాకు తలనొప్పిగా మారాయి. హిందుత్వ నాయకుడిగా పేరున్న భాజపా సీనియర్‌ నేత కేఎస్‌ ఈశ్వరప్ప ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.

Updated : 24 Apr 2024 05:44 IST

స్వతంత్ర అభ్యర్థిగా ఈశ్వరప్ప నామినేషన్‌
యడియూరప్పపై కోపంతోనే..

ఈనాడు, బెంగళూరు: కర్ణాటకలోని శివమొగ్గ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు భాజపాకు తలనొప్పిగా మారాయి. హిందుత్వ నాయకుడిగా పేరున్న భాజపా సీనియర్‌ నేత కేఎస్‌ ఈశ్వరప్ప ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. తన కుమారుడు కేఎస్‌ కాంతేశ్‌కు పార్టీ టికెట్‌ దక్కకపోవడంతో నిరాశకు గురై ఈ చర్యకు పూనుకున్నారు. ఎన్నికల సమయంలో పార్టీలకు తిరుగుబాటు అభ్యర్థుల బెడద సహజమే అయినా.. శివమొగ్గ కథ కొంత భిన్నం. ఇక్కడ భాజపా తరఫున బరిలో ఉన్నది మాజీ సీఎం, భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు యడియూరప్ప పెద్ద కుమారుడు బి.వై.రాఘవేంద్ర. ఆయన భాజపా సిద్ధాంతాలు, ప్రధాని మోదీ నాయకత్వం, హిందుత్వం పేరిట ప్రచారం చేస్తుండగా.. ఈశ్వరప్ప కూడా సరిగ్గా అవే అంశాలను ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. తాను భాజపాకు, మోదీకి, హిందుత్వవాదానికి వ్యతిరేకిని కాదని స్పష్టం చేస్తున్నారు. భాజపా రాష్ట్ర శాఖలోని కుటుంబ రాజకీయాలు, ఏకవ్యక్తి నిర్ణయాలకు వ్యతిరేకంగానే ఎన్నికల బరిలో దిగినట్లు చెబుతున్నారు.

ఒకప్పుడు రామలక్ష్మణుల్లా..

ఈశ్వరప్ప కోపమంతా యడియూరప్ప (అప్ప)పైనే. ఈ ఇద్దరు నేతలూ ఒకేసారి రాజకీయ రంగప్రవేశం చేశారు. తొలినాళ్లలో వారు మంచి మిత్రులు. కర్ణాటక భాజపాలో వీరిద్దరినీ రామలక్ష్మణులుగా పిలిచేవారు. అయితే యడియూరప్ప రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదగగా, ఈశ్వరప్ప ఎక్కువగా జిల్లాకే పరిమితమయ్యారు. ఈశ్వరప్ప అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్సీ పదవిని చేపట్టారు. ఉపముఖ్యమంత్రి స్థాయి దాకా కూడా ఎదిగారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. యడియూరప్పతో విభేదాలున్నా పార్టీపై విధేయత కారణంగా ఈశ్వరప్ప ఏనాడూ నోరు మెదపలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం తన కుమారుడు కాంతేశ్‌కు టికెట్‌ రాకపోవడానికి కారణం యడియూరప్పేనని ఈశ్వరప్ప బహిరంగంగా విమర్శలకు దిగారు.

పార్టీ ప్రక్షాళన కోసమే అంటూ..

వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉండే భాజపా.. కర్ణాటకలో మాత్రం ఆ సిద్ధాంతానికి తిలోదకాలిచ్చిందని ఈశ్వరప్ప ఆరోపిస్తున్నారు. యడియూరప్ప కుమారుల్లో ఒకరు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. మరో కుమారుడు రెండోసారి ఎంపీ టికెట్‌ పొందారు. స్థానికంగా వ్యతిరేకత ఉన్నా.. అప్ప సన్నిహితురాలుగా పేరున్న శోభా కరంద్లాజెను ఉడుపి-చిక్కమగళూరు నుంచి బెంగళూరు ఉత్తర స్థానానికి మార్చి మరీ టికెట్‌ ఇప్పించారు. ఇదంతా చేయగలిగిన యడియూరప్ప తన కుమారుడి విషయం వచ్చేసరికి మాత్రం వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారనేది ఈశ్వరప్ప కోపం. రాష్ట్రంలో భాజపా అప్ప కుటుంబం చేతిలో బందీగా మారిందని ఆయన ఆరోపిస్తున్నారు. పార్టీని ప్రక్షాళించేందుకే తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. ఆయన ఆవేదన పూర్తిగా వ్యక్తిగతమైనదైతే భాజపా పెద్దగా ఆందోళన చెందాల్సిన పని ఉండేది కాదు. కానీ యడియూరప్పతో విభేదించిన మైసూరు ఎంపీ ప్రతాప్‌ సింహా, బెంగళూరు ఉత్తర ఎంపీ డి.వి.సదానందగౌడ, ఉడుపి చిక్కమగళూరు టికెట్‌ ఆశావహుడు సి.టి.రవి, విజయపురలో బసవనగౌడ యత్నాళ్‌ తదితరులకు కూడా టికెట్‌ రాలేదు. ఈశ్వరప్ప తిరుగుబాటుతో ఈ ప్రాంతాల నుంచి భాజపాకు వ్యతిరేకత ఎదురవుతుందన్న ఆందోళన కమలనాథుల్లో వ్యక్తమవుతోంది.


ఎట్టకేలకు వేటు

తాము చేయలేనిది ఈశ్వరప్ప చేస్తున్నారన్న అభిప్రాయం పార్టీలోని పలువురు సీనియర్లలో వ్యక్తమవుతోంది. ఆయన రాష్ట్రంలో మూడో అతిపెద్ద వర్గమైన కురుబ సామాజిక వర్గానికి చెందినవారు. ఆ వర్గం సంఘాల నుంచీ ఆయన అసమ్మతికి మద్దతు లభిస్తోంది. ఈ పరిస్థితుల్లో తిరుగుబావుటా ఎగురవేసిన ఈశ్వరప్పను భాజపా అధినాయకత్వం పార్టీ నుంచి బహిష్కరించడం గమనార్హం. మరోవైపు మోదీ, పార్టీ పేరుతో ప్రచారం చేయడాన్ని సవాలు చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img