icon icon icon
icon icon icon

తల్లికి వ్యతిరేకంగా తనయుడి ప్రచారం

దేశంలోని ప్రఖ్యాత సంస్థానాల్లో గ్వాలియర్‌ ఒకటి. దాన్ని పాలించిన సింధియా రాజవంశానికి చెందిన రాజమాత విజయరాజె సింధియా 1989 లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య పరిస్థితులను ఎదుర్కొన్నారు.

Updated : 29 Apr 2024 06:10 IST

1989 ఎన్నికల్లో గ్వాలియర్‌లో కాక పుట్టించిన సింధియాల సమరం

దిల్లీ: దేశంలోని ప్రఖ్యాత సంస్థానాల్లో గ్వాలియర్‌ ఒకటి. దాన్ని పాలించిన సింధియా రాజవంశానికి చెందిన రాజమాత విజయరాజె సింధియా 1989 లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య పరిస్థితులను ఎదుర్కొన్నారు. నాడు మధ్యప్రదేశ్‌లోని గుణ స్థానంలో బరిలో దిగిన ఆమెకు వ్యతిరేకంగా.. స్వయంగా ఆమె ఏకైక కుమారుడు మాధవరావ్‌ సింధియా ప్రచారం చేశారు. తన తల్లికి ఓటేయొద్దని పిలుపునిచ్చారు. ఆసక్తికరమైన ఈ విషయాన్ని భాస్కర్‌ రాయ్‌ అనే పాత్రికేయుడు-రచయిత ‘ఫిఫ్టీ ఇయర్‌ రోడ్‌’ అనే తన తాజా పుస్తకంలో వివరించారు. అందులోని కథనం ప్రకారం- తన కుమారుణ్ని జనసంఘ్‌ భవిష్యత్‌ నేతగా తీర్చిదిద్దాలని రాజమాత తొలుత కలలుగన్నారు. భాజపా ఆవిర్భవించాక.. ఆ పార్టీ నాయకుడిగా చూడాలని కోరుకున్నారు. అందుకు విరుద్ధంగా తన రాజకీయ జీవితం ఆరంభంలోనే మాధవరావ్‌ సింధియా కాంగ్రెస్‌లో చేరారు. ఇది రాజమాతకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీనికితోడు ఆస్తుల విషయంలోనూ తల్లీకుమారుల మధ్య విభేదాలు తలెత్తాయి. తన తల్లి భాజపా చేతుల్లో కీలుబొమ్మగా మారిందని మాధవరావ్‌ భావించేవారు. అందుకే 1989లో గుణలో విజయరాజే పోటీ చేసినప్పుడు ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. రాజమాత కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా.. ప్రచారంలో తన కుమారుడిపై బాగానే విమర్శలు చేశారు. నాటి ఎన్నికల్లో విజయం చివరికి ఆమెనే వరించింది.

ఓటర్లను రూపాయి చొప్పున కోరిన కాన్షీరాం

1988లో అలహాబాద్‌ స్థానానికి ఉప ఎన్నిక జరిగినప్పటి మరో ఆసక్తికర విషయాన్నీ తాజా పుస్తకంలో రచయిత వివరించారు. నాడు అక్కడ కాన్షీరాంతోపాటు బలమైన అభ్యర్థులైన వీపీ సింగ్‌, సునీల్‌ శాస్త్రి బరిలో నిలిచారు. అప్పుడు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించిన కాన్షీరాం.. తనకు ఒక రూపాయి చొప్పున ఇవ్వాలని తన మద్దతుదారులను కోరారు. ‘‘పెద్ద రాజకీయ పార్టీలు ఓట్లను రాబట్టుకునేందుకు నగదు, మద్యం పంచుతుంటాయి. అందుకు భిన్నంగా అలహాబాద్‌లో నాకు మద్దతు తెలిపేవారంతా ఒక రూపాయి నోటు చొప్పున ఇవ్వాలని నేను ఓటర్లను కోరారు. ఒక ఓటు- ఒక నోటు అని నినాదమిచ్చాను’’ అని కాన్షీరాం చెప్పినట్లు పుస్తకంలో రచయిత వివరించారు. నాటి ఎన్నికల్లో కాన్షీరాం మూడో స్థానానికి పరిమితమయ్యారు.

జనంలో నానిన ఎన్టీఆర్‌ నినాదం

ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ వ్యతిరేక శక్తులను ఏకం చేయడానికి ప్రయత్నించడం ద్వారా రాజీవ్‌గాంధీకి గట్టి పోటీదారుగా మారిన తీరునూ రచయిత తాజా పుస్తకంలో వివరించారు. హిందీ, ఆంగ్ల భాషల్లో ధారాళంగా మాట్లాడలేకపోయినప్పటికీ.. తన హావభావాలతో ఆయన ఉత్తర భారత ప్రజలనూ ఆకట్టుకునేవారని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్‌ను పీకిపారేయండి’ అంటూ ఓ సభలో ఎన్టీఆర్‌ ఇచ్చిన నినాదం జనంలోకి బాగా వెళ్లిందని తెలిపారు. 1960ల మధ్య నుంచి భారత రాజకీయాల్లో, ఎన్నికల్లో చోటుచేసుకున్న పలు కీలక పరిణామాలను ‘ఫిఫ్టీ ఇయర్‌ రోడ్‌’లో భాస్కర్‌ రాయ్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img